- సివిల్ సప్లై అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలు జరిగాయని ఆరోపణలు
- డీఫాల్ట్, మూతపడిన, ఓపెన్ కాని మిల్లులకు కేటాయింపులపై ఆరా
- ఆఫీసర్ల పాత్రపైనా వివరాలు సేకరిస్తున్న స్పెషల్ టీం
- మరో రెండు రోజుల పాటు కొనసాగనున్న విచారణ
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ అక్రమాల వ్యవహారం ఆఫీసర్ల మెడకు చుట్టుకుంటోంది. కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించారని తెలియడంతో విచారణ కోసం ప్రభుత్వం స్పెషల్ టీంను ఏర్పాటు చేసింది. అయితే అసలు ప్రారంభమే కాని, మూతపడిన మిల్లులకు ధాన్యం కేటాయించడంతో పాటు మిల్లర్ల అక్రమాలు సివిల్ సప్లై ఆఫీసర్ల కనుసన్నల్లోనే జరిగాయన్న ఆరోపణలు వినిపించడంతో ఆ శాఖ ఆఫీసర్ల పాత్రపైనా విచారణ ముమ్మరం చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యులతో కూడిన టీం ఇప్పటికే జిల్లాలోని పలు మిల్లు్ల్లో తనిఖీలు చేస్తూ, రికార్డులను జల్లెడ పడుతోంది. దీంతో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లతో పాటు, వారికి సహకరించిన ఆఫీసర్లు సైతం ఆందోళన చెందుతున్నారు.
బయటపడ్డ రూ.224 కోట్ల అక్రమాలు
సూర్యాపేట జిల్లాలో ఉన్న పలు రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు 10 రోజుల నుంచి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2022 – 23 సంవత్సరానికి సంబంధించిన సీఎంఆర్ ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకపోవడంతో సమారు రూ.500 కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయి. వీటిని చెల్లించేందుకు ప్రభుత్వం పలుమార్లు సమయం ఇచ్చినా మిల్లర్లు పట్టించుకోలేదు.
ఈ క్రమంలో ఆగస్టు 5వ తేదీ వరకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని చివర్ అవకాశం ఇచ్చింది. అయినా మిల్లర్లు ముందుకు రాకపోవడంతో.. అసలు మిల్లుల్లో ఎంత మేరకు నిల్వలు ఉన్నాయి అనే విషయం తెలుసుకునేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్లు రంగంలోకి దిగి మిల్లు్ల్లో తనిఖీలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో 2022 – 23 సీజన్ తో పాటు 2024–25, 2025–26 సీజన్లకు సంబంధించిన వడ్ల నిల్వల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు.
ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకుని, మిల్లింగ్ చేసి సర్కార్‌కు అందించాల్సిన బియ్యాన్ని.. బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పలు మిల్లుల్లో సుమారు రూ.210 కోట్ల విలువైన సీఎంఆర్ మాయమైనట్లు ఆధారాలు దొరకడంతో అఫీసర్లే ఆశ్చర్యపోయారు.
చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలోని శివ సుబ్రహ్మణ్యేశ్వర్ మోడరన్ రైస్ మిల్ లో రూ. 4.89 కోట్ల విలువైన 2,050 టన్నులు, సూర్యాపేటకు చెందిన శివ సాయి రైస్ మిల్లులు దాదాపు రూ.13 కోట్ల విలువైన 2,900 టన్నులు, తిరుమలగిరి మండలం అన్నారం గ్రామంలోని ఏఎస్ఆర్ రైస్ మిల్లులో రూ. 46కోట్ల విలువైన 19,701 టన్నులు, జేపీ రైస్ మిల్లులో రూ.11.67 కోట్లు విలువ చేసే 4,886 టన్నులు పక్కదారి పట్టించినట్లు గుర్తించారు.
అలాగే సూర్యాపేట మండలం కసారాబాద్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర రైస్ మిల్లులో రూ.27.23 కోట్ల విలువైన 11400 టన్నులు, వజ్ర రైస్ కార్పొరేషన్, వజ్ర వికాస్ రైస్ మార్ట్ లో రూ.73 కోట్ల విలువైన 29,197 టన్నులు, రవికృష్ణ రైస్ మిల్లులో రూ.47.62 కోట్ల విలువైన 12 వేల టన్నుల సీఎంఆర్ మాయమైనట్లు గుర్తించారు. వీటిలో పలు మిల్లులను సీజ్ చేసి మిల్లర్లపై కేసులు నమోదు చేశారు.
రూల్స్ పట్టించుకోకుండా కేటాయింపులు
సూర్యాపేట జిల్లాలో అసలు నడవని మిల్లులు, గతంలోనే డిఫాల్ట్ అయిన, ప్రారంభం కానీ మిల్లులకు కూడా యథేచ్ఛగా సీఎంఆర్ కేటాయించడంపై విచారణ బృందం ప్రధానంగా దృష్టి సారించింది. నిబంధనల ప్రకారం ఒక మిల్లు పాత బియ్యం అప్పగించకపోతే, కొత్తగా ధాన్యం కేటాయించకూడదు. కానీ సూర్యాపేటలో మాత్రం ఈ నిబంధనలు తుంగలో తొక్కారు.
రూల్స్ బ్రేక్ చేసి మరీ కోట్ల విలువైన ధాన్యాన్ని మిల్లర్ల చేతుల్లో పోయడంలో సివిల్ సప్లై ఆఫీసర్ల హస్తం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు స్పెషల్ టీమ్ ఈ విషయంపై ఆరా తీస్తోంది. మిల్లర్లు కొన్నేండ్లుగా సీఎంఆర్ ను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నా ఆఫీసర్లు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మరో వైపు మూత పడ్డ మిల్లు కూడా నడుస్తోందని, మిల్లులో ధాన్యం నిల్వలు ఉన్నాయని మూడు నెలల కింద సివిల్ సప్లై ఆఫీసర్లు కలెక్టర్ కు రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం.
ఆఫీసర్ల పాత్రపై విచారణ.. రెండు రోజుల్లో రిపోర్ట్
సివిల్ సప్లై శాఖపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ టీం శనివారం జిల్లాలో పర్యటించి పలు మిల్లుల్లో విచారణ చేపట్టారు. ఆఫీసర్ల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నట్లు సమాచారం. అసలు ప్రారంభమే కాని, మూతబడిన మిల్లులకు ధాన్యం కేటాయించడం వంటి అక్రమాలు వెలుగుచూస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే అధికారులు ఏ ప్రాతిపదికన ధాన్యం కేటాయింపులు చేశారు? మిల్లర్ల నుంచి అందిన నజరానా ఎంత ? అనే కోణంలో స్పెషల్ టీం ఎంక్వైరీ చేస్తోంది. స్పెషల్ టీం విచారణ మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది. మిల్లుల్లో ధాన్యం నిల్వలు, రికార్డులు, గత మూడేండ్లలో జరిగిన కేటాయింపులను బృందం పరిశీలిస్తోంది.
విచారణ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే నివేదిక ఆధారంగా ఎంతమంది ఆఫీసర్లపై వేటు పడుతుందోనని జిల్లా యంత్రాంగంలో చర్చ నడుస్తోంది. అక్రమాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని సర్కార్ సంకేతాలు పంపడం, విచారణ ముమ్మరంగా సాగుతుండడంతో ఆఫీసర్లు ఆందోళన చెందుతున్నారు.
