చిన్నమ్మ ఇక లేరు

చిన్నమ్మ ఇక లేరు

చివరి ట్వీట్ మోడీజీ.. థ్యాంక్యూ వెరీ మచ్​. నా జీవిత కాలంలో ఈ రోజు కోసమే ఎదురుచూశాను. అమిత్​ షాజీ..

రాజ్యసభలో మీరు వ్యవహరించిన తీరు నిజంగా అద్భుతం. ఇది సాహసోపేత మైనదేకాదు చరిత్రాత్మక నిర్ణయం కూడా.

గ్రేట్​ ఇండియాకు సెల్యూట్​.

– కాశ్మీర్​ బిల్లుపై సుష్మా స్వరాజ్​

 

మంగళవారం రాత్రి తీవ్రమైన గుండెపోటు

ఎయిమ్స్​కు తరలించిన కుటుంబ సభ్యులు

ఆస్పత్రికి చేరేసరికే విషమించిన సుష్మాస్వరాజ్​ ఆరోగ్యం

పదకొండు గంటల ప్రాంతంలో తుదిశ్వాస

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర

బీజేపీ సీనియర్ ​లీడర్, మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్(67) గుండెపోటుతో​ మంగళవారం
రాత్రి కన్నుమూశారు. సాయంత్రం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఎయిమ్స్​కు తరలించారు. క్రిటికల్​ కండీషన్​లో ఆస్పత్రికి చేరుకున్న సుష్మను బతికించేందుకు ఎయిమ్స్​ డాక్టర్లు ఎంతగానో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఆస్పత్రికి చేరే సరికే ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పారు. పదకొండు గంటల ప్రాంతంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు ప్రకటించారు. సుష్మా స్వరాజ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకే 2019 లోక్​సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. తెలంగాణ బిల్లు పాసవడంలో సుష్మ కీలక పాత్ర పోషించారు. తనను చిన్నమ్మగా పిలవాలని తెలంగాణ ప్రజలను కోరారామె.

లోక్ సభలో పాస్ కావడంతో కీలకపాత్ర

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ చిన్నమ్మ ఇక లేరు. మంగళవారం రాత్రి కన్నుమూసిన సుష్మాస్వరాజ్ మన రాష్ట్రంతో అనుబంధం ఉన్న జాతీయ నేత . బీజేపీ సీనియర్ నేతగా 2014కు ముందు జాతీయ స్థాయిలో విపక్ష నేతగా కీలకపాత్ర పోషించిన సుష్మాస్వరాజ్ మొదటి నుంచీ తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కు మద్దతిస్తూ వచ్చారు. 2009 నుంచి లోక్ సభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న ఆమె చాలాసార్లు తెలంగాణకు వచ్చి ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ నిర్ణయం తీసుకోక ముందు కూడా పలు సందర్భాల్లో బిల్లు తెస్తే మద్దతిస్తామని సుష్మ చెబుతూ వచ్చారు. కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న తర్వాత 2013 ఆగస్టులో సుష్మా స్వరాజ్ ఒక ట్వీట్ చేశారు. ‘‘అయాం ఫర్ తెలంగాణ, వి ఆర్ ఫర్ తెలంగాణ, బీజేపీ ఈజ్ ఫర్ తెలంగాణ’’ అని రాశారు. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వచ్చిన సమయంలోనూ సుష్మ తన వంతు పాత్ర పోషించారు. అప్పట్లో బీజేపీ సీనియర్లు సహా కొందరు నేతలు బిల్లుకు మద్దతుపై వ్యతిరేకతతో ఉన్నా సుష్మ మాటకే కట్టుబడ్డారు. అప్పటికే లోక్ సభలో పెప్పర్ స్పే, సస్పెన్షన్ల మధ్య బిల్లు పెట్టడం కష్టమని స్పీకర్ మీరాకుమార్ భావించారు. అయితే బీజేపీ మద్దతు కలిసొస్తే సభలో బలం సరిపడా ఉంది. దీంతో ఆమె సూచనపై నాటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మరికొందరు సుష్మాస్వరాజ్ ను కలిశారు. వారు కోరగానే ఆమె రెండో ఆలోచన లేకుండా సపోర్ట్ చేస్తామని చెప్పారు. తర్వాత సభలో బిల్లు పెట్టగానే జైపాల్ రెడ్డి, సుష్మాస్వరాజ్ ఇద్దరి ప్రసంగాల తర్వాత 23 నిమిషాల్లోనే ఆమోదం పొందింది. ఇంత వేగంగా బిల్లు పాస్ కావడానికి సుష్మ సహకారమే కారణమైంది. సోనియాగాంధీని తల్లిగా అనుకుంటే తనను చిన్నమ్మగా తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలని ఆమె అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ పురిటివేదన పడుతోందని చెప్పారు. 2017 నవంబర్​లో హైదరాబాద్​లో నిర్వహించిన గ్లోబల్​ ఎంటర్​ప్రెన్యూర్​షిప్​సమ్మిట్ (జీఈఎస్)లో సుష్మా స్వరాజ్​పాల్గొన్నారు. ‘‘నేను తెలంగాణ చిన్నమ్మను. అందుకే హైదరాబాద్​ అంటే ఏంటో చెప్పగలను. సంప్రదాయం, ఆధునికతల అద్భుతమైన కలయికే హైదరాబాద్’’ అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఆమె కోరుకున్న గౌరవం దక్కింది. తెలంగాణ చిన్నమ్మగా ఆమె జనం గుండెల్లో నిలిచిపోయారు.

ఐడియాలజీపై రాజీపడని సుష్మాజీ: మోడీ

‘‘దేశ రాజకీయాల్లో ఒక మహోజ్వల అధ్యాయం ముగిసింది. ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన సుష్మాజీ కోట్ల మందికి ప్రేరణగా నిలిచారు. ఆమె మరణాన్ని పర్సనల్​ లాస్​గా ఫీలవుతున్నా. ఐడియాలజీ విషయంలో ఏనాడూ రాజీపడని సుష్మాజీ గొప్ప వక్తగా, బెస్ట్​ పార్లమెంటేరియన్​గానూ కీర్తిపొందారు. గడిచిన ఐదేండ్లలో ఆరోగ్యం  బాగాలేకపోయినా మంత్రిగా ప్రపంచం నలుమూలల్లోని ఎంతో మందికి సాయం అందించారు. ఆమె చేసిన ప్రతిపనినీ దేశం ప్రేమగా గుర్తుంచుకుంటుంది. సుష్మాజీ ఫ్యామిలీకి, ఆమె అభిమానులకు సానుభూతి తెలుపుతున్నా.’’