సుష్మా స్వరాజ్ రాజకీయ ప్రస్థానం

సుష్మా స్వరాజ్ రాజకీయ ప్రస్థానం

దేశ రాజకీయాల్లో నిప్పు కణిక సుష్మాస్వరాజ్. గాడ్ ఫాదర్లు లేకుండా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన మహిళా నేతల్లో ఆమెది మొదటిస్థానం. విద్యార్థి నాయకురాలి నుంచి జాతీయ స్థాయి వరకు ఆమె ఎదిగిన తీరు అనిర్వచనీయం.

1952, ఫిబ్రవరి 14న హర్యానా లోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు సుష్మా స్వరాజ్. ఆమె తండ్రి పేరు హరిదేవ్ శర్మ. సుష్మా పేరు కూడా సుష్మ శర్మ. 1975లో స్వరాజ్ కౌశల్ ను వివాహం చేసుకున్నాక… సుష్మా స్వరాజ్ గా పేరు మార్చుకున్నారు. విద్యార్థి దశలోనే 1970ల్లో రాజకీయాల్లోకి వచ్చారు. ABVPలో క్రియాశీలకంగా పనిచేశారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేశారు. జనతా పార్టీలో చేరిన సుష్మా… ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో పాల్గొన్నారు. 1977లో మొదటిసారి హర్యానా అసెంబ్లీకి అంబాలా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఏడాది 25 ఏళ్ల వయసులో… హర్యానా మంత్రి అయ్యారు. 1979లో జనతా పార్టీ హర్యానా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. జనతా పార్టీ ముక్కలైన తర్వాత… 1984లో బీజేపీలో చేరారు సుష్మ.

1987లో BJP నుంచి పోటీ చేసిన సుష్మా స్వరాజ్… రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై… బీజేపీ-లోక్ దళ్ సంకీర్ణ  ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1990లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1996లో 13 రోజుల అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1998 అక్టోబర్ లో కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి… ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు సుష్మా స్వరాజ్. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో 1998 డిసెంబర్ లో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగాల్సి వచ్చింది. 52 రోజుల పాటు ఢిల్లీ సీఎంగా పనిచేశారు.. ఇక ఢిల్లీ మొదటి మహిళా సీఎం కూడా సుష్మానే.

1998లో మరోసారి లోక్ సభకు ఎన్నికైన సుష్మా… వాజ్ పేయి కేబినెట్ లో సమాచార, ప్రసారశాఖ చేపట్టారు. 1999 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలోని బళ్లారి నియోజకవర్గం నుంచి సోనియా గాంధీపై పోటీ చేశారు సుష్మ. ఆ ఎన్నికల్లో సుష్మ ఓడిపోయినా.. సోనియాకు గట్టి పోటీ ఇచ్చారు. 2000 సంవత్సరంలో మళ్లీ రాజ్యసభకు ఎన్నికైన సుష్మా… 2004 వరకు వాజ్ పేయి కేబినెట్ లో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు నిర్వహించారు. 2006లో మరోసారి రాజ్యసభకు ఎన్నికై 2009 వరకు బీజేపీ డిప్యూటీ లీడర్ గా పనిచేశారు.

2009 లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లోని విదిశ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు సుష్మా స్వరాజ్. 2009 డిసెంబర్ 21 నుంచి 2014 వరకు లోక్ సభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. 2014లో బీజేపీ అధికారంలోకి రావటంతో నరేంద్ర మోడీ కేబినెట్ లో విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2016 డిసెంబర్ లో సుష్మా స్వరాజ్ కు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. సర్జరీ తర్వాత రాజకీయాల్లో నెమ్మదించారు సుష్మా స్వరాజ్. ఆరోగ్యం బాగాలేకపోవడంతో 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు.