చిన్నమ్మ లేదని చిన్నబోయిన సిటీ

చిన్నమ్మ లేదని  చిన్నబోయిన సిటీ

బీజేపీ అగ్ర నాయకురాలు, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సందర్భంగా లోక్‌‌సభా పక్ష నేతగా మద్దతు పలికిన తెలంగాణ చిన్నమ్మ సుష్మాస్వరాజ్‌‌ లేరని తెలిసి నగరం చిన్నబోయింది. పార్టీ నాయకురాలిగా, ఎన్‌‌డీఏలో కేంద్ర మంత్రి హోదాలో ఆమె సిటీకి  వచ్చారు. నగరంతో తనకున్న అనుబంధాన్ని పలుమార్లు ఆమె చెప్పుకున్నారు.  ఈ ఏడాది ఏప్రిల్​లో జరిగిన పార్టీ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. మంగళవారం రాత్రి గుండెపోటుతో చనిపోయిన వార్త తెలిసి గ్రేటర్‌‌ బీజేపీ శ్రేణులు, అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్లు దిగ్భ్రాంతికి గురయ్యారు – హైదరాబాద్​, వెలుగు

‘సోదర సోదరీమణులారా తెలంగాణ కోసం బలిదా నం వద్దు. తెలంగాణ చూడడానికి బతకాలి’ అంటూ లోక్‌‌సభలో తన ప్రసంగంతో ఉత్తేజపరిచిన తెలంగాణ చిన్నమ్మ మరణంతో నగరం చిన్నబోయింది. తెలంగాణ ప్రజలకు చిన్నమ్మగా సుపరిచితురాలైన బీజేపీ అగ్రనేత సుష్మాస్వరాజ్‌‌ లేరని విచారం వ్యక్తం చేసింది. ఆమె మరణవార్త తెలుసుకుని బీజేపీ నగర నాయకులతో పాటు పార్టీ  అనుబంధ సంఘాల నేతలు, ఇతర రాజకీయ

పార్టీల నాయకులు విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు సిటీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉద్యమ సమయంలో, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వం తర్వాత ఎప్పుడు వచ్చినా తనను కలవడానికి వచ్చే నాయకులను ఆప్యాయంగా పలకరించేవారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలోను ఆమెను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన నాయకులకు ప్రత్యేక గౌరవం ఇచ్చేవారు. ప్రస్తుత సికింద్రాబాద్‌‌ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌‌రెడ్డి , కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయలకు సుష్మాజీ అంటే అభిమానం.

2019 ఏప్రిల్‌‌ 5న హైదరాబాద్‌‌కు చివరిసారిగా నగరంలో పర్యటిం చారు. సికిం ద్రాబాద్‌‌, మల్కాజిగిరి అభ్యర్థులైన కిషన్‌‌రెడ్డి , రాం చంద్రం తరపున ఆమె ప్రచారం చేశారు. ఇదే ఆమెకు నగరంలో చివరి పర్యటన. ఉద్యమ సమయంలోను 2013 ఏప్రిల్‌‌ 30న తెలంగాణ పొలి టికల్‌‌ జేఏసీ ధర్నాకు సంఘీభావం తెలిపి స్వయంగా పాల్గొన్నారు. 2017 నవంబర్‌‌ గ్లో బల్‌‌ ఎంటర్‌‌ప్రెన్యూర్‌‌ సమ్మిట్‌‌లో విదేశాం గ మంత్రి హోదాలో కార్యక్రమంలో పాల్గొన్న సుష్మా హైదరాబాద్‌‌పై తనకున్న ప్రేమను బహిరంగంగా వ్యక్తపరిచారు. ఈ సభలో ఆమెరికా అధ్యక్షుడు ట్రంప్‌‌ కూతురు ఇవాంకతో కలిసి పాల్గొన్నారు.

‘నేను మీ తెలంగాణకు చిన్నమ్మను ..నాకు ఈ హైదరాబాద్‌‌ సంస్కృతి గురించి బాగా తెలుసు. ఈ నగరం సంప్రదాయకత, ఆధునికత కలిగిన అద్భు తమైనది’ అంటూ మాట్లాడిన విషయాలను నగరవాసులు గుర్తు చేసుకున్నారు. పాతబస్తీకి చెందిన ముస్లిం మహిళలు సౌది అరేబియా, రియాద్‌‌ లో ఇబ్బందులు పడుతున్నారని ట్విటర్‌‌ ద్వారా తెలుసుకుని వారికి అండగా నిలిచారు. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ సుష్మాస్వరాజ్‌‌లాం టి నేత మళ్లీ దొరకదని ఆమె అభిమానులు బాధలో మునిగిపోయారు.