‘మార్స్​లో చిక్కుకున్నా.. సాయం చేస్తాం..’: సుష్మా

 ‘మార్స్​లో చిక్కుకున్నా.. సాయం చేస్తాం..’: సుష్మా

‘మీరు మార్స్​లో చిక్కుకుపోయినా సరే.. ఇండియన్​ ఎంబసీ మీకు సాయం చేస్తుంది’.. ఇది విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్​ చెప్పిన మాట. మార్స్​ మీద అనేది అతిశయోక్తిగా అనిపించినా ఆమె స్పందించే తీరు మాత్రం అక్షరాలా అదే. విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్​ మనసున్న అమ్మగా నిలిచారు. దేశ విదేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న ఇండియన్లు.. సోషల్​ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసినా సరే వెంటనే స్పందించి సాయం చేసేవారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారెందరినో ఇండియాకు క్షేమంగా రప్పించారు. హైదరాబాద్​కు చెందిన సైదా మరియం అనే మహిళ ఖతార్​లో చిక్కుకుపోతే ఇండియాలోని ఆమె తల్లి.. సుష్మాస్వరాజ్​కు లెటర్​ రాసి సమాచారమిచ్చారు. దానిపై వెంటనే స్పందించిన సుష్మా ఖతార్​లోని ఇండియన్​ ఎంబసీ అధికారులకు చెప్పి ఆమెను ఇండియాకు తిరిగి రప్పించారు. అదే తరహాలో ఒమన్​లో చిక్కుకుపోయిన హైదరాబాదీ మహిళ కుల్సుం భానును రక్షించారు.  ఉపాధి కోసం తెలంగాణ నుంచి సౌదీకి వెళ్లిన 29 మంది కార్మికులు అక్కడ చిక్కుకుపోయారు. వారి యజమాని 12 రోజులుగా తిండి, నీళ్లు ఇవ్వకుండా హింసిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై టీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ విజ్ఞప్తి చేయడంతో సుష్మా స్పందించారు. నేరుగా సౌదీలోని ఇండియన్​ ఎంబసీతో మాట్లాడారు. ‘అక్కడి తెలంగాణ వర్కర్లకు వెంటనే సాయం చేయండి. వివరాలను నాకు, కేటీఆర్​కు పంపండి’ అని ఎంబసీ అధికారి అహ్మద్​ జావేద్​ను ఆదేశించారు.

పెళ్లినాటికి ఇండియాలో ఉంటావ్..

గతేడాది అమెరికాలో ఉండే రవితేజ అనే ఇండియన్​ యువకుడు పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నాడు. మరో రెండు వారాల్లో అతడి పెళ్లి.. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ట్విట్టర్‌లో సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశాడు. ఆమె వెంటనే ఆ యువకుడికి ధైర్యం చెప్పారు. పెళ్లి సమయానికి ఇంట్లో ఉంటావంటూ భరోసా ఇచ్చారు.