బెంగాల్ సీఎంగా నేడు (మే 9, 2026) సువేందు ప్రమాణం

బెంగాల్ సీఎంగా నేడు (మే 9, 2026) సువేందు ప్రమాణం
  • బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏకగ్రీవ ఎన్నిక
  • అగ్నిమిత్ర పాల్, శంకర్ ఘోష్‌‌‌‌‌‌‌‌లకు డిప్యూటీ సీఎం పదవులు!
  • హాజరుకానున్న ప్రధాని మోదీ, నితిన్ నబిన్, రాష్ట్రాల సీఎంలు

కోల్‌‌‌‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో శనివారం ఒక నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. బెంగాల్​లో బీజేపీ ఫస్ట్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం కోల్‌‌‌‌కతాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ శాసనసభా పక్ష (సీఎల్పీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ శాసన సభాపక్ష నేతగా సువేందు పేరును బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రతిపాదించారు.

ఎమ్మెల్యేలందరూ వాయిస్ ఓట్ ద్వారా ఆమోదం తెలిపారు. సీఎల్పీ లీడర్​గా ఎన్నికైన సువేందు అధికారి.. సాయంత్రం లోక్ భవన్ కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్​కు విజ్ఞప్తి చేశారు. దీంతో బెంగాల్ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కోల్‌‌‌‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌‌‌‌లో శనివారం ఉదయం 11 గంటలకు సువెందు సీఎంగా ప్రమాణం చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. సువేందు అధికారితో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా కోటాలో అగ్నిమిత్ర పాల్, ఉత్తర బెంగాల్ ప్రతినిధిగా శంకర్ ఘోష్ పేర్లు డిప్యూటీ సీఎంలుగా ఖరారైనట్లు సమాచారం. అంతకుముందు గురువారం గవర్నర్ ఆర్.ఎన్.రవి.. మమతా బెనర్జీ నేతృత్వంలోని రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేశారు. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

ఇది శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాల ప్రభుత్వం
లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ‘పశ్చిమ బెంగాల్ బీజేపీ శాసనసభా పక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. రాష్ట్రంలో కమ్యూనిస్టుల కాలంలో మొదలైన అరాచకాలను మమతా బెనర్జీ మరింత పెంచారు. ఇక్కడ ఓటు వేయడం అసాధ్యమనే వాతావరణాన్ని సృష్టించారు. అలాంటి పరిస్థితుల్లో కూడా బీజేపీని, నరేంద్ర మోదీ నాయకత్వాన్ని నమ్మి బెంగాల్ ప్రజలు పార్టీని గెలిపించారు.

ఇంత భారీ విజయాన్ని అందించినందుకు బెంగాల్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పదిహేనేండ్ల తృణమూల్ పాలన అంతమైంది. ఇప్పుడు బెంగాల్​లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాల ప్రభుత్వం కొలువుదీరుతోంది. సువేందు సారథ్యంలో బెంగాల్ అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలవుతుంది’ అని పేర్కొన్నారు.

కోల్‌‌‌‌కతాలో భారీ భద్రత, ట్రాఫిక్ ఆంక్షలు
బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌‌‌‌లో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం కోల్‌‌‌‌కతా అంతటా భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాని సహా కీలక నేతలు హాజరవుతున్న నేపథ్యంలో నగరంలోని కొన్ని ఏరియాల్లో సరుకు రవాణా వాహనాలపై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించారు. వేదిక చుట్టుపక్కల బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు  తెలిపారు. వీవీఐపీ కాన్వాయ్‌‌‌‌ల కదలికలకు ఆటంకం కలగకుండా, సెంట్రల్ కోల్‌‌‌‌కతాలో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక మళ్లింపు ప్లాన్‌‌‌‌లు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.