హైదరాబాద్ సిటీ, వెలుగు: స్వచ్చ ఆటో కార్మికులు చెత్త తీసుకెళ్లే ప్రాంతాలకు రాంకీ వస్తోందని..ఇలాగే చేస్తే స్వచ్ఛ ఆటోలు బంద్ చేసి నిరసన తెలుపుతామని స్వచ్ఛ ఆటో కార్మికులు హెచ్చరించారు. శుక్రవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు ముందు స్వచ్ఛ ఆటో టిప్పర్ అండ్ రిక్షా కార్మికుల యూనియన్ ఆధ్యర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్ ప్రెసిడెంట్ గోపాల్ నాయక్ మాట్లాడుతూ బల్క్ గార్బేజ్ సేకరించొద్దని రాంకీ తమను బెదిరిస్తోందని, తాము పనిచేసే ప్రాంతాల్లో రాంకీ ఈ వెహికల్స్‌తో చెత్త సేకరిస్తోందన్నారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓడియన్ మాల్ లో తమ కార్మికుడు చెత్త సేకరించే వాడని, అక్కడ రాంకీ ఆటోలని పంపుతున్నారన్నారు. దీంతో స్వచ్ఛ ఆటోలకు పని తగ్గిపోయి కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆరోపించారు. ఇలాగే చేస్తే చెత్త సేకరణ నిలిపివేస్తామన్నారు. సమస్యపై పలుమార్లు రాంకీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. తర్వాత జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. హంసరాజు, అర్జున్, లక్ష్మన్, రాము, రమేశ్, ప్రభాకర్ పాల్గొన్నారు.
