స్విగ్గీ, జొమాటో మళ్లీ దూకుడు పెంచాయి

స్విగ్గీ, జొమాటో మళ్లీ దూకుడు పెంచాయి

నిన్నమొన్నటిదాకా కాస్త వెనుకబడ్డ ఫుడ్‌‌‌‌ డెలివరీ కంపెనీలు స్విగ్గీ, జొమాటో దూకుడు మళ్లీ మొదలయింది. వీటి ప్రత్యర్థులు ఓలా, ఉబర్‌‌‌‌ ఆన్‌‌‌‌లైన్ ఫుడ్‌‌‌‌ డెలివరీ మార్కెట్‌‌‌‌పై పెద్దగా దృష్టి సారించకపోవడమే ఇందుకు కారణం. ఫుడ్‌‌‌‌పాండాను దక్కించుకోవడానికి ఓలా భారీగా డబ్బు ఖర్చు చేసింది. ఉబర్‌‌‌‌ ఈట్స్‌‌‌‌ను మార్కెట్లో నిలదొక్కుకునేలా చేయడానికి దీని మాతృసంస్థ ఉబర్‌‌‌‌ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఓలా మెజారిటీ నిధులను ఫుడ్‌‌‌‌పాండా నుంచి వెనక్కి తీసుకుంది. ఉబర్‌‌‌‌ ఈట్స్‌‌‌‌కు కేటాయింపులు సగానికి అంటే , రూ.835 కోట్లకు తగ్గిపోయాయి. ఇటీవలే న్యూయార్క్‌‌‌‌ స్టాక్‌‌‌‌ ఎక్సేంజ్‌‌‌‌లో లిస్ట్‌‌‌‌ అయిన ఉబర్‌‌‌‌, ఫిబ్రవరి నుంచి కస్టమర్ల డిస్కౌంట్లను తగ్గిస్తూ వస్తోంది. నిధుల తగ్గింపుపై వివరణ కోసం పంపిన ఈ–మెయిల్‌‌‌‌కు ఉబర్‌‌‌‌ స్పందించలేదు.

మార్జిన్లు బాగా తక్కువ..

ఫుడ్‌‌‌‌ డెలివరీ వ్యాపారంలో మార్జిన్లు చాలా తక్కువ. అందుకే ఓలా ఫుడ్‌‌‌‌పాండా నుంచి మెల్లిగా తప్పుకుంటోంది. ఇతర రెస్టారెంట్ల ఫుడ్‌‌‌‌ను డెలివరీ చేయడానికి బదులు, గ్రేట్‌‌‌‌ కిచిడీ ఎక్స్‌‌‌‌పెరిమెంట్‌‌‌‌, లవ్‌‌‌‌మేడ్‌‌‌‌, ఎఫ్‌‌‌‌ఎల్ఆర్టీ వంటి ప్రైవేటు లేబుల్ బ్రాండ్స్‌‌‌‌ను రూపొందిస్తున్నది. 2021 నాటికి ఇండియా ఫుడ్‌‌‌‌ డెలివరీ మార్కెట్‌‌‌‌ దాదాపు రూ.34,800 కోట్లకు చేరుతుందని రెడ్‌‌‌‌సీర్‌‌‌‌ కన్సల్టింగ్‌‌‌‌ స్టడీలో తేలింది. ఉబర్‌‌‌‌ అమెరికాలో ఐపీఓకు వెళ్లడానికి ముందే ఫుడ్‌‌‌‌ డెలివరీ వ్యాపారాన్ని స్విగ్గీకి అమ్మడానికి చర్చలు జరిపింది. వీటి ఫలితం వివరాలు మాత్రం తెలియలేదు. ఉబర్‌‌‌‌ స్టాక్‌‌‌‌ తొలిరోజే తీవ్ర నష్టాలతో ముగిసింది. ‘‘కస్టమర్లకు డిస్కౌంట్లు ఇవ్వడానికి స్విగ్గీ, జొమాటో దగ్గర దండిగా నిధులు ఉన్నాయి. ఇండియాలో ఫుడ్‌‌‌‌ డెలివరీ బిజినెస్‌‌‌‌ తమకు లాభదాయకం కాదని ఉబర్‌‌‌‌ భావిస్తోంది’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక అధికారి వెల్లడించారు. ఉబర్‌‌‌‌ ఈ వ్యాపారం కోసం వందల కోట్లు ఖర్చు చేసినా, నెలలో ఆర్డర్ల సంఖ్య 13 లక్షలు దాటడం లేదు. మొదట్లో మాత్రం ప్రతినెలా 25 శాతం వృద్ధి కనిపించినా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జొమాటో, స్విగ్గీలు నెలకు దాదాపు 3.5 కోట్ల వరకు ఆర్డర్లు డెలివరీ ఇస్తున్నాయి. ఫుడ్‌‌‌‌పాండా డెలివరీల సంఖ్య 40 లక్షలు మించడం లేదు. ‘‘రవాణా వ్యయాలు భారీగా పెరుగుతున్నాయి. మార్జిన్లు బాగా తగ్గుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఫుడ్‌‌‌‌ డెలివరీ మార్కెట్‌‌‌‌ ఎలా నిలబడుతుందో అర్థం కావడం లేదు’’ అని వార్టన్‌‌‌‌ స్కూల్‌‌‌‌లో ప్రొఫెసర్‌‌‌‌ కార్తిక్‌‌‌‌ హోసనగర్‌‌‌‌ అన్నారు. మరో ఉబర్‌‌‌‌ అధికారి మాత్రం విభిన్నంగా స్పందించారు. ఇండియాలో క్యాబ్‌‌‌‌ వ్యాపారం పడిపోతోందని, ఫుడ్‌‌‌‌ డెలివరీయే కంపెనీని నిలబెడుతుందని అభిప్రాయపడ్డారు. ఉబర్‌‌‌‌ ఈట్స్‌‌‌‌లో పెట్టుబడులను హేతుబద్ధీకరించామని, ఫుడ్‌‌‌‌ డెలివరీ మార్కెట్‌‌‌‌ నుంచి తప్పుకునే ఉద్దేశమే లేదని స్పష్టీకరించారు. 2017లో ఓలా, స్విగ్గీ కస్టమర్ల సంఖ్య 57 శాతం పెరగగా, గత ఏడాది 30 శాతాన్ని మించకపోవడం గమనార్హం. ఉబర్‌‌‌‌ ఈట్స్ ప్రైవేట్‌‌‌‌ లేబుల్‌‌‌‌ హోమ్‌‌‌‌ క్రావింగ్స్ మాత్రం భారీ వృద్ధిని నమోదు చేసింది. ఇండోర్‌‌‌‌, పుణే, అహ్మదాబాద్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌ ఫుడ్‌‌‌‌ డెలివరీ మార్కెట్లో ఇప్పటికీ తామే మొదటిస్థానంలో ఉన్నామని కంపెనీ తెలిపింది.

స్విగ్గీ, జొమాటోలకు దండిగా డబ్బులు...

ఇండియాలోకి ఉబర్‌‌‌‌ ఈట్స్‌‌‌‌ 2017లో అడుగుపెట్టింది. అప్పటికే స్విగ్గీ, జొమాటోల దూకుడు కొనసాగుతోంది. దీంతో ఉబర్‌‌‌‌ భారీ డిస్కౌంట్లతో కస్టమర్లను నిలుపుకోవడానికి ప్రయత్నించింది. గత ఏడాది జొమాటో, స్విగ్గీలకు మరోసారి భారీగా నిధులు అందాయి. దీంతో డిస్కౌంట్ల యుద్ధం మళ్లీ మొదలయింది. ఉబర్‌‌‌‌ ఫుడ్‌‌‌‌పాండాపై పేచేయి సాధించినా, స్విగ్గీ, జొమాటోలతో తలపడాలంటే మాత్రం మరింత డబ్బు కావాలి. ఉబర్‌‌‌‌ గతంలో 70 శాతం వరకు డిస్కౌంట్లు ఇచ్చిందని,  ఇప్పుడు తొలగించిందని రెస్టారెంట్లు తెలిపాయి. మూడు సంస్థలూ డిస్కౌంట్లతో ముంచెత్తడం వల్ల కస్టమర్లు లాభపడ్డారని, కంపెనీలు మాత్రం నష్టపోయాయని నిపుణులు అంటున్నారు.