ఫాస్టాగ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఇకపై వాహనంపై ఉన్న స్టిక్కర్‌ను మార్చాల్సిన అవసరం లేకుండానే.. డిజిటల్‌గా తమ ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకును మార్చుకునే సరికొత్త అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ 'వన్ ట్యాగ్' పోర్టబిలిటీ విధానాన్ని అధికారికంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ఫాస్టాగ్ సేవలను మరింత ఈజీ చేసేందుకు ఈ వ్యవస్థను తీసుకొచ్చారు.
వన్ ట్యాగ్ ప్రత్యేకతలు ఏమిటి?
ఈ కొత్త విధానం ద్వారా యూజర్లు తమ పాత ఫాస్టాగ్ స్టిక్కర్, ట్యాగ్ ఐడీ, వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను మార్చకుండానే కేవలం బ్యాంకును మాత్రమే మార్చుకోవచ్చు. ఇప్పటివరకు ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు ఫాస్టాగ్ మార్చాలంటే పాత అకౌంట్ క్లోజ్ చేసుకుని.. కొత్త స్టిక్కర్ తీసుకోవాల్సి వచ్చేది. వన్ ట్యాగ్ తో ఇకపై ఆ ఇబ్బందులకు చెక్ పడనుంది.
బ్యాంకు మార్చుకునే విధానం:
రాజ్‌మార్గ్ యాత్ర మొబైల్ యాప్ ద్వారా ఈ పోర్టబిలిటీ ప్రక్రియను పూర్తిగా డిజిటల్‌గా పూర్తి చేసుకోవచ్చు. దీని గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందా రండి.
Step 1: NHAIకి చెందిన రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌ను ఓపెన్ చేయాలి.
Step 2: యాప్‌లోని ఫాస్టాగ్ పోర్టబిలిటీ ఆప్షన్ ద్వారా మీ ప్రస్తుత ట్యాగ్, వాహన అర్హతను తనిఖీ చేసుకోవాలి.
Step 3: పాత బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు ట్యాగ్‌ను మార్చడానికి మీ సమ్మతి తెలియజేయాలి.
Step 4: ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వంటి సుమారు డజనుకు పైగా పార్టనర్ బ్యాంకుల్లో నచ్చిన కొత్త బ్యాంకును సెలెక్ట్ చేసుకోవాలి.
Step 5: కొత్త బ్యాంకు నిర్వహించే కస్టమర్ వెరిఫికేషన్, ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి.
Step 6: ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త బ్యాంకు మీ ఫాస్టాగ్ సేవలను టేకప్ చేస్తుంది.
ALSO READ : నెస్లే అమ్ముతున్న బేబీ ఫుడ్స్‌పై FSSAI కేసులు..
పాత అకౌంట్లు, టోల్ ప్లాజాల పరిస్థితి ఏమిటి?
పోర్టబిలిటీ పూర్తయినప్పటికీ.. పాత ఖాతాకు సంబంధించిన పెండింగ్ లావాదేవీలు, రీఫండ్లు, కస్టమర్ వెరిఫికేషన్ బాధ్యతలను పాత బ్యాంకే చూసుకుంటుంది. కొత్త బ్యాంకు కేవలం భవిష్యత్ సేవల బాధ్యతను మాత్రమే తీసుకుంటుంది. పోర్టబిలిటీ తర్వాత టోల్ ప్లాజాల వద్ద వినియోగదారులు ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. NPCI నెట్‌వర్క్‌లో కేవలం జారీ చేసే బ్యాంకు వివరాలు మాత్రమే అప్‌డేట్ అవుతాయి.
దేశంలో ఫాస్టాగ్ వాడకం 98 శాతానికి పైగా చేరుకుంది. ఇప్పటివరకు సుమారు 13 కోట్ల ఫాస్టాగ్స్ జారీ చేయగా.. అందులో దాదాపు 6 కోట్ల ట్యాగ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయి. ఫాస్టాగ్ విధానం వల్ల ఏటా సుమారు 71 కోట్ల గంటల ప్రయాణ సమయం, 56 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అవుతోందని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. డబ్బు లెక్కల్లో చెప్పుకోవాలంటే దీని విలువ సుమారు రూ.5వేల 250 కోట్లుగా ఉంది. అంతేకాకుండా టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు రాబోయే రోజుల్లో బ్యారియర్-ఫ్రీ టోలింగ్‌ను తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానికుల కోసం సుమారు రూ.15వందల రాయితీ ధరతో వార్షిక స్థానిక పాస్‌ను అందించే ప్లాన్ చేస్తోంది కేంద్రం.
