పద్మారావునగర్, వెలుగు: ఇండ్ల మధ్య నిర్మిస్తున్న గ్యాస్ గోడౌన్ నిర్మాణ పనులను వెంటనే ఆపాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సనత్‌నగర్ అల్లాఉద్దిన్ కోటలో ఇండ్లకు ఆనుకుని నిర్మిస్తున్న భారత్ గ్యాస్ గోడౌన్ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. నిరుపేదలు నివసించే ప్రాంతంలో గ్యాస్ గోదాం ఏర్పాటుకు ఎలా అనుమతులిచ్చారు? ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు? అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే అమీర్ పేటలోని రేణుకా నగర్లో ఉన్న గ్యాస్ గోడౌన్ వల్ల ఆ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే జీహెచ్‌ఎంసీ ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కమిషనర్ కర్ణన్‌ను ఫోన్ చేసి కోరారు. లేని పక్షంలో స్థానిక ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట డీసీ శ్రీనివాస్, హైడ్రా అధికారి మోహన్ రావు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సురేశ్, ఏఈ జమీర్, సివిల్ సప్లై అధికారి జ్యోతి ఉన్నారు.

