ప్రూవ్ చేసుకోవాలంటే ప్లాట్ ఫాం కావాలి... టాలెంట్తో పాటు అవకాశాలు కూడా రావాలి

ప్రూవ్ చేసుకోవాలంటే ప్లాట్ ఫాం కావాలి... టాలెంట్తో పాటు అవకాశాలు కూడా రావాలి

సినిమాలు, సీరియల్స్.. ప్లాట్​ఫాం ఏదైనా ప్రేక్షకులను అలరించడమే అంతిమ లక్ష్యం. టాలెంట్​ ఉండి దాన్ని ఏదో ఒక ప్లాట్​ఫాం మీద ప్రూవ్ చేసుకోవాలి.. ఫలానా అవకాశమే రావాలి.. అందులోనే నెగ్గాలి.. అనుకుంటే వర్కవుట్కాదు. ఒక్కోసారి టాలెంట్ ఉన్నా దాన్ని షో కేస్ చేసుకునే ప్లాట్​ఫాం దొరక్క వేచి చూసేవాళ్లు బయట ఎంతోమంది ఉన్నారు. అలాంటప్పుడు నీకు దొరికిన ప్లాట్​ఫాంలోనే నీ టాలెంట్​ని ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు కన్న కలలు నిజమవుతాయి. 

ఎక్కడైతే గుర్తింపు తెచ్చుకోవాలని పాటుపడతావో ఆ ప్లాట్​ఫాం వెతుక్కుంటూనీ దగ్గరకి వస్తుందనడంలో సందేహమే లేదు. ఇది ఒక ఫిలాసఫీ కాదు..ఓ నటుడి జీవితంలో జరిగినసంఘటనలపై అతను చెప్పే
సారాంశం. అతనెవరంటే..స్పేస్ జెన్​ అనే సిరీస్​లోసైంటిస్ట్​గా కనిపించిననకుల్ మెహతా.

నకుల్ మెహతాది రాజస్థాన్​లోని ఉదయ్​పూర్. అతని తాత, తండ్రి ఇద్దరూ మిలిటరీలో పనిచేశారు. కానీ నకుల్ మాత్రం యాక్టింగ్ వైపు అడుగులు వేశాడు. కామర్స్​లో మాస్టర్స్ చేసిన నకుల్‌ జాజ్, హిప్​ హాప్, బ్రేక్, ఫోక్​, సాల్సా వంటి డాన్సుల్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. 

ఇండియాలో ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ కొరియోగ్రాఫర్, బాల్​రూమ్ టీచర్​ అయిన సందీప్ సొపార్కర్ దగ్గర బాల్​రూమ్​ డాన్స్​లో శిక్షణ పొందాడు. 2011లో మహారాష్ట్రని రిప్రజెంట్​ చేస్తూ ఆల్ ఇండియా డాన్స్​ స్పోర్ట్​ ఫెడరేషన్​లో పార్టిసిపేట్ చేశాడు. లాటిన్ బాల్​రూమ్ కేటగిరీలో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. స్టాండర్డ్ బాల్​రూమ్​ కేటగిరీలో విన్నర్​గా నిలిచి గోల్డ్​ మెడల్​ సాధించాడు. 


నకుల్​ యాక్టర్​ అవ్వాలనే ఉద్దేశంతో తనకు వచ్చిన అవకాశాల్లో కమర్షిల్ యాడ్స్, మ్యూజిక్​ వీడియోలు, థియేటర్​ గ్రూప్​లో నాటకాలు.. అన్నీ ట్రై చేశాడు. చివరిగా 2005లో ‘అభిమాని’ అనే తెలుగు సినిమాతో డెబ్యూ చేశాడు. తర్వాత మరో తెలుగు సినిమా ‘ఇండియన్ బ్యూటీ’లో నటించాడు. 

2008లో ‘హాల్ ఎ దిల్​’ అనే సినిమా చేశాడు. సినిమాలు కలిసిరాకపోవడంతో 2011లో ‘అవంత్ గార్డె’ అనే షార్ట్​ ఫిల్మ్ చేశాడు. దాన్ని కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్​లో ప్రదర్శించారు. అయినా తనకు సరైన గుర్తింపు దక్కలేదు. 2012 నుంచి 2014 మధ్య ‘ప్యార్ కా దర్ద్​ హై మీతా మీతా ప్యారా ప్యారా’ అనే సీరియల్​తో మొదటిసారి టీవీ షోలో కనిపించాడు.​ దాంతో ఇండియన్​ టెల్లీ అవార్డ్​ ఫర్ ఫ్రెష్ న్యూ ఫేస్​ మేల్​, డెబ్యూగా లీడ్​రోల్​కు గోల్డ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. 

2015లో ‘ఇండియాస్ గాట్ టాలెంట్ 6’ అనే షోలో మెరిశాడు. 2016 నుంచి 2018 మధ్య మరో సీరియల్ చేశాడు. అదే ‘ఇష్క్ బాజ్’. ఆ సీరియల్​ సక్సెస్​ కావడంతో గుర్తింపు కూడా లభించింది. అందులో తను నటించిన పాత్ర ‘శివాయ్’కి గాను ఐటీఎ​, పాపులర్, ఇండియన్ టెల్లీ వంటి అవార్డులు దక్కాయి. 

సురభితో కలిపి బెస్ట్ ఆన్​స్క్రీన్ జోడీగా గోల్డ్ అవార్డు తీసుకున్నారు. ఆ తర్వాత కో– ప్రొడ్యూసర్​గా మారి ‘ఐ డోంట్ వాచ్​​ టీవీ’ అనే వెబ్​ ఫిల్మ్ తీశాడు. అది ఇండియన్ టెలివిజన్ ఇండస్ట్రీ మీద సెటైర్​. వేద్, ఆర్య, తసల్లీ సె, ఫెయిరీ ఫోక్​ వంటి షార్ట్​ ఫిల్మ్స్​లో నటించాడు. 

టీవీలో బడే అచ్చే లగ్తే హైన్ 2, 3 సీజన్స్​లో నటించాడు. క్రైమ్ పెట్రోల్​ అనే షోకి హోస్ట్​గా వ్యవహరించాడు. కొన్ని పాపులర్ సీరియల్స్​లో స్పెషల్​ అప్పియరెన్స్ ఇచ్చాడు. ‘యానిమల్’ సినిమా ఇంగ్లిష్ వెర్షన్​లో రణ్​బీర్ కపూర్​ పాత్రకు డబ్బింగ్​ చెప్పాడు. ప్రస్తుతం వెబ్ సిరీస్​లు చేస్తున్నాడు. ఈ ఏడాది ‘స్పేస్ జెన్ : చంద్రయాన్​’ అనే సిరీస్​తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

‘‘ఒకప్పుడు నేను బయట కనిపిస్తే ‘ఆ సినిమాలో నటించాడు. ఫలానా సీరియల్​ యాక్టర్​’ అని గుర్తుపట్టేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు.. నన్ను చూడగానే వాళ్ల కళ్లలో సంతోషం కనిపిస్తుంది. దగ్గరకు వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఇది కదా నేను ఇన్నాళ్లు కలగన్నది అనిపిస్తుంది. ‘ఇష్క్​ బాజ్​’ అనే సీరియల్​ నుంచి ఇది మొదలైంది. ఆ సీరియల్​ నాకు ఒక సినిమా యాక్టర్​ లెవల్​లో గుర్తింపుతెచ్చింది. టీవీ చిన్న మీడియం కానే కాదు.. ప్రతి ఇంట్లోనూ టీవీ ఉంటుంది. ప్రతి ఫ్యామిలీకి సీరియల్ యాక్టర్స్ పరిచయమే.’’

‘‘2012లో పెండ్లి చేసుకున్నాను. మాకు ఇద్దరు పిల్లలు. పేరెంట్​ అయ్యాక నాలో చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే పిల్లలకు మనం ఏం చేస్తున్నామో అవసరం లేదు. ఎప్పుడూ వాళ్ల కళ్లముందు ఉండాలని కోరుకుంటారు. మీరు ఎలా ఉన్నా వాళ్లకు నచ్చుతారు. ఒక మంచి మనిషిగా ఎదగడానికి
ఇంతకన్నా ఏం కావాలి అనిపిస్తుంది.’’ 

కెరీర్​గురించి..

‘‘చిన్నప్పటి నుంచి ఆర్ట్స్, స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. థియేటర్​ గ్రూప్​లో నాటకాలు వేస్తున్న టైంలోనే తెలుగు ఇండస్ట్రీలో నటుడిగా అవకాశం వచ్చింది. అందులో లీడ్​ రోల్ చేశాను. కానీ అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత హిందీలోనూ ఒక ప్రాజెక్ట్ చేశాను. అయితే నేను ట్రై చేసిన వాటిలో సక్సెస్ చూడలేకపోయాను. దాంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉండి, నాలో ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే పనిలో పడ్డాను. 

ఒక యాక్టర్​కి కావల్సిన ఎమోషన్స్​ అన్నీ నేను యాక్ట్ చేసి చూపించగలను. అయినా నాకు గుర్తింపు రావట్లేదేంటని? బాగా ఆలోచించాను. నన్ను నేను సెల్ఫ్​ మోటివేట్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఒకటే డిసైడ్ అయ్యాను. అదేంటంటే.. నాకు యాక్టింగ్ వచ్చు కాబట్టి దాన్ని నేను ప్రూవ్ చేసుకోవాలంటే ఒక ప్లాట్​ఫాం కావాలి. సినిమాల్లో చేయాలనేదే చివరి లక్ష్యం. కానీ, మనకు అవకాశాలు రావాలంటే కచ్చితంగా దాన్ని ఏదో ఒక ప్లాట్​ఫాంలో నిరూపించుకోవాలి అనిపించింది. 

అందుకే సీరియల్స్, వెబ్ సిరీస్​లు, షార్ట్​ ఫిల్మ్స్ ఇలా అన్నింటినీ ట్రై చేశా. సక్సెస్​లకంటే ఫెయిల్యూర్స్​నే ఎక్కువ చూశాను. నా కెరీర్ బిగినింగ్​లో దాదాపు 500 ఆడిషన్స్ చేసి ఉంటాను.  వాటిలో కనీసం వంద కూడా వర్కవుట్ కాలేదు.  

ముంబైలో ఉంటూ ఇలాంటి కెరీర్​ని లీడ్​ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. పైగా ప్రతి ప్రాజెక్ట్ కమిట్​మెంట్​తోనే చేస్తాం. కానీ దానికి తగిన గుర్తింపు రాకపోతే బాధగా ఉంటుంది. ఒక పాయింట్​లో సక్సెస్, ఫెయిల్యూర్స్​ను సీరియస్​గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని రియలైజ్​ అయ్యాను. ఆ మైండ్​సెట్టే నన్ను ఇప్పుడు ముందుకు నడిపిస్తోంది” అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.