స్టాలిన్కు షాకిచ్చిన గవర్నర్... సెంథిల్ బాలాజీ మంత్రి పదవి తొలిగింపు

స్టాలిన్కు షాకిచ్చిన గవర్నర్... సెంథిల్ బాలాజీ మంత్రి పదవి తొలిగింపు

మనీలాండరింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న తమిళనాడు విద్యుత్‌, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీని  గవర్నర్  ఎన్‌ రవి బర్తరఫ్ చేశారు.    ఈ ఆదేశాలు తక్షణమే ఆమల్లోకి వస్తాయని రాజ్ భవన్  వర్గాలు వెల్లడించాయి. 

సీఎం స్టాలిన్  కు సమాచారం ఇవ్వకుండానే బాలాజీని మంత్రి పదవి నుంచి తొలిగించడం గమనార్హం. ఈ పరిణామంపై సీఎం స్టాలిన్ స్పందిస్తూ.. రాష్ట్ర మంత్రిని తొలిగించే అధికారం గవర్నర్‌కు లేవని ..  దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని అన్నారు.

కాగా 2023 జూన్  14న బాలజీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్ట్‌ చేసింది. ఆయన నివాసంతో పాటుగా కార్యాలయాల్లో 18 గంటలపాటు సోదాలు, విచారణ జరిపి ఆ తరువాత అదుపులోకి తీసుకుంది. అయితే ఆ సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో ఆయనకు శస్త్ర చికిత్స అనివార్యమైంది. కావేరి ఆస్పత్రిలో డాక్టర్‌ ఏఆర్‌ రఘురాం బృందం ఐదు గంటల పాటు శ్రమించి సెంథిల్‌ బాలాజీకి బైపాస్‌ సర్జరీ చేశారు. 

 ప్రస్తుతం బాలజీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న క్రిమినల్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ప్రస్తుతం బాలాజీకి నిర్వర్తిస్తున్న విద్యుత్ శాఖను ఆర్థిక మంత్రి తంగం తెన్నరసుకు , ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలను గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముత్తుసామికి తమిళనాడు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది.  

బాలాజీ 2006 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ తరపున కరూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2011లో కరూర్ నుంచి ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచి  దివంగత జె. జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 

2015లో జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ కుటుంబ సభ్యుడితో విభేదాలు రావడంతో కేబినెట్ నుంచి తొలగించారు. 2016 ఎన్నికల్లో అరవకురిచ్చి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అన్నాడీఎంకే ప్రభుత్వంలో కేబినెట్‌ హోదా లభించలేదు.