తమిళనాడులో రూ. 75 వేల వరకు రైతు రుణ మాఫీ

తమిళనాడులో రూ. 75 వేల వరకు రైతు రుణ మాఫీ
  • తమిళనాడులో రైతులకు 

చెన్నై: తమిళనాడు రైతులకు ఆ రాష్ట్ర సీఎం విజయ్​తీపికబురు చెప్పారు. సహకార బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న రైతులకు రూ.75 వేల వరకు పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. ఈ నిర్ణయం మే 1, 2025 నుంచి ఫిబ్రవరి 28, 2026 మధ్య తీసుకున్న రుణాలకు వర్తిస్తుంది. ఈ మాఫీ వల్ల రాష్ట్రవ్యాప్తంగా 14.43 లక్షల మంది రైతులు లబ్ధి పొందనుండగా.. రాష్ట్ర ఖజానాపై రూ.5,932 కోట్ల అదనపు భారం పడనుంది.

అయితే, రైతులకు ఇది పెద్ద ఉపశమనాన్ని కలిగిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. మంగళవారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం సీఎం విజయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే, రూ.75 వేల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులకు రూ.35 వేల వరకు మాఫీ లభిస్తుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ‘ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వ వనరులను పరిగణనలోకి తీసుకుని.. ఈ క్లిష్ట సమయంలో మే 1, 2025 నుంచి ఫిబ్రవరి 28, 2026 మధ్య పంట రుణాలు తీసుకున్న 14.43 లక్షల మంది రైతులకు సుమారు రూ. 6 వేల కోట్ల రుణమాఫీని అమలు చేయాలని సీఎం ఆదేశించారు’ అని అధికారులు ప్రకటనలో తెలిపారు. రాబోయే సాగు సీజన్ కోసం రుణాలు పొందాలనుకునే రైతులకు ఈ పంట రుణమాఫీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని విజయ్ వ్యాఖ్యానించినట్టు వారు పేర్కొన్నారు. కాగా, సహకార బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన చిన్న, సన్నకారు రైతులకు రూ. 50 వేల వరకు రుణాలు మాఫీ చేయనున్నట్టు గత నెలలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే, రైతుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం రూ. 50 వేల నుంచి రూ.75 వేలకు పెంచింది.