సైలెంట్ మూడ్ లో కాంగ్రెస్ నేతలు

సైలెంట్ మూడ్ లో కాంగ్రెస్ నేతలు

రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సైలెంట్ మూడ్ లోకి వెళ్లిపోయారు. మునుగోడు ఎన్నికలు, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో మొన్నటి వరకు ఫుల్ బిజీగా ఉన్న లీడర్లు.. ఇప్పుడు రిలాక్స్ లో ఉన్నారు. భారత్ జోడో యాత్ర స్టేట్ దాటడంతో హస్తం లీడర్లు ఫ్రీ అయ్యారు. సొంత పనుల్లో నిమగ్నమయ్యారు. కొందరు లీడర్లు ఫ్యామిలీతో టూర్లకు వెళ్లారు. మరికొందరు నేతలు తమ సొంత నియోజకవర్గాల్లో పబ్లిక్ కు అందుబాటులో ఉంటున్నారు. ఇంకొందరు హైదరాబాద్ లోని ఇంటి నుంచి బయటకు రావడం లేదు. పూర్తిగా ఫ్యామిలీకి టైం కేటాయిస్తున్నారు. 

ఈజిప్టులో ఉత్తమ్

మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈజిప్టు పర్యటనలో ఉన్నారు. వాతావరణ మార్పులపై ఈజిప్టులో అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. మనదేశం నుంచి ఇద్దరు ఎంపీలు హాజరయ్యారు. అందులో ఎంపీ ఉత్తమ్ ఒక్కరు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన ఫ్యామిలీతో తిరుపతి, శ్రీశైలంకు వెళ్లారు. ఎప్పుడు గడ్డంతో కనిపించే జగ్గారెడ్డి ఇప్పుడు కొత్త గెటప్ లో కనిపిస్తున్నారు. 

సొంత పనుల్లో నేతలు

మునుగోడు ఫలితాల తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మంకే పరిమితమయ్యారు. ఎమెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో, మాజీ ఎంపీ పొన్నం కరీంనగర్ లో  ఉంటున్నారు. మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కీ లు, మాజీ కేంద్రమంత్రులు రేణుకాచౌదరి, బలరాం నాయక్ లు హైదరాబాద్ లో సొంత పనుల్లో మునిగిపోయారు. కొందరు నేతలు వారి వ్యాపారాల్లో లీనమయ్యారు. 

లంచ్ పార్టీ ఇచ్చిన రేవంత్

రాహుల్ భారత్ జోడోయాత్ర సక్సెస్ తో పాటు ఉప ఎన్నికల ప్రచారం పాల్గొన్న నేతలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిన్న నిజాం క్లబ్ లో లంచ్ పార్టీ ఇచ్చారు. సీనియర్ నేతలు హైదరాబాద్ లో  ఉన్నా పార్టీకి డుమ్మాకొట్టారు. రాహుల్ పాదయాత్ర క్యాడర్ లో ఉత్సాహం నింపినా... మునుగోడు ఫలితం నిరాశ పరిచిందని ఆపార్టీ నేతలు అంటున్నారు.