మ్యూచువల్‌ బదిలీలకు ముందుకొస్తలేరు

మ్యూచువల్‌ బదిలీలకు ముందుకొస్తలేరు
  • సీనియార్టీ వదులుకునేందుకు సర్కార్ టీచర్ల వెనకడుగు 
  • 2,958 దరఖాస్తుల్లో 1,260 అండర్‌‌‌‌ టేకింగ్‌‌ అప్లికేషన్లు 
  • రెండ్రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం

హైదరాబాద్, వెలుగు: మ్యూచువల్‌ బదిలీలకు సర్కార్‌‌ టీచర్లు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. సర్వీస్ సీనియార్టీని వదులుకునేందుకు వెనకడుగు వేస్తున్నరు. మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్లకు 2,958 అప్లికేషన్లు రాగా, సర్వీస్​తో సంబంధం లేకుండా విల్లింగ్ లెటర్లు ఇవ్వాలని కోరితే, అందులో సగం మంది కూడా ముందుకు రాలేదు. కేవలం 1,260 మంది మాత్రమే అండర్ టేకింగ్ ఇచ్చారు. ఈ లిస్టును ఇటీవల స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఆర్థిక శాఖకు పంపారు. ఇందులోనూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని పక్కనపెట్టే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. జీవో 317తో నష్టపోయిన ఉద్యోగులకు సొంత జిల్లాలకు వెళ్లేందుకు వీలుగా మ్యూచువల్ బదిలీలకు 3 నెలల కింద ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉమ్మడి జిల్లా పరిధిలో సర్వీస్ ప్రొటెక్షన్ ఉండదని చెప్పినా, టీచర్ల సంఘాల ఆందోళనలతో ఆ రూల్ మార్చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో పరస్పర బదిలీలకు 2,958 దరఖాస్తులు అందాయి. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో సర్వీస్‌తో సంబంధం లేకుండా బదిలీలు కోరుకునే వారి నుంచి మరోసారి అండర్ టేకింగ్ అడగడంతో 1,260 అప్లికేషన్లు వచ్చాయి. వీటిని సర్కారు ఆమోదానికి పంపించారు. అయితే, కొందరు డీఈవోలు గతంలో పెట్టుకున్న దరఖాస్తులతో పాటు కొత్త దరఖాస్తులనూ సర్కార్‌‌కు పంపించారు. అయితే కొత్త అప్లికేషన్లను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు పక్కనపెట్టారు. పాత దరఖాస్తులపై ఇప్పటికే ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. సీఎస్ సోమేశ్‌కుమార్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ హిమాచల్‌ప్రదేశ్‌​సదస్సుకు వెళ్లగా, వారు శుక్రవారం హైదరాబాద్ రానున్నారు. తర్వాత దీనిపై మరోసారి చర్చించి, శనివారం లేదా సోమవారం మ్యూచువల్ బదిలీల ఆర్డర్స్‌ను టీచర్లకు పంపించనున్నారు. ఆ లిస్టులను డీఈవోలకూ పంపిస్తారు. మరోపక్క కోర్టు కేసు కూడా శుక్రవారమే ఉండటంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.