పడ్డా.. పడగొట్టారు.. ఐదో టెస్టులోకి తిరిగి రేసులోకొచ్చిన భారత్

పడ్డా.. పడగొట్టారు.. ఐదో టెస్టులోకి తిరిగి రేసులోకొచ్చిన భారత్

లండన్‌‌: బ్యాటర్లు ఫెయిలైన చోట టీమిండియా పేసర్లు మ్యాజిక్ చేశారు. మహ్మద్ సిరాజ్‌‌ (4/86), ప్రసిధ్ కృష్ణ (4/62) చెరో నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. పట్టు జారిపోయిందనుకున్న ఐదో టెస్టులో మన జట్టును తిరిగి రేసులోకి తెచ్చారు. ఇండియాను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసి బజ్‌‌బాల్‌‌ ఆటతో ఓ దశలో 129/1తో నిలిచి భారీ ఆధిక్యం సాధించేలా కనిపించిన ఆతిథ్య జట్టు నడ్డివిరిచారు. సిరాజ్‌‌, ప్రసిధ్ దెబ్బకు రెండో రోజు, శుక్రవారం  తొలి ఇన్నింగ్స్‌‌లో 51.2 ఓవర్లలో 247 రన్స్‌‌కే ఆలౌటై 23 రన్స్‌‌ లీడ్‌‌తో సరిపెట్టింది.

 ఓపెనర్లు జాక్ క్రాలీ (57 బాల్స్‌‌లో 14 ఫోర్లతో 64), బెన్ డకెట్ (38 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో  43), హ్యారీ బ్రూక్ (64 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 53) మెరిసినా.. మిగతా వాళ్లు నిరాశ పరిచారు. అంతకుముందు ఇండియా 69.4 ఓవర్లలో 224 రన్స్‌‌కే ఆలౌటైంది. తొలి రోజు పోరాడిన కరుణ్ నాయర్ (57), వాషింగ్టన్ సుందర్ (37) రెండో రోజు ఆ జోరు కొనసాగించలేకపోయారు. గస్ అట్కిన్సన్ (5/33) ఐదు వికెట్లతో ఇండియాను దెబ్బకొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌‌లో ఇండియా 18  ఓవర్లలో 75/2  స్కోరుతో రెండో రోజు ఆట ముగించింది. 

ధాటిగా ఆడిన ఓపెనర్‌‌‌‌ యశస్వి జైస్వాల్ (49 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 బ్యాటింగ్‌‌ ) ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. అతనికి తోడు నైట్ వాచ్‌‌మన్ ఆకాశ్‌‌ దీప్ (4 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నాడు. కేఎల్ రాహుల్  (7)ను టంగ్‌‌, సాయి సుదర్శన్‌‌ (11)ను అట్కిన్సన్ ఔట్ చేశారు.  ప్రస్తుతం ఇండియా 52  రన్స్‌‌ ఆధిక్యంలో ఉంది.  చేతిలో ఇంకో 8 వికెట్లు ఉండటంతో  మూడో రోజు మొత్తం బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ ముందు మంచి టార్గెట్ ఉంచితే జట్టుకు విజయావకాశాలు ఉంటాయి.

30 నిమిషాలు.. 20 రన్స్‌‌ .. 4 వికెట్లు

ఓవర్‌‌‌‌నైట్ స్కోరు 204/6తో రెండో రోజు ఆట కొనసాగించిన ఇండియా తొలి 30 నిమిషాల్లో ఇంకో 20 రన్స్ మాత్రమే చేసి మిగిలిన  నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌‌నైట్ బ్యాటర్‌‌‌‌ కరుణ్ నాయర్ త్వరగానే పెవిలియన్ చేరగా.. టెయిండర్లు మరోసారి బ్యాట్లెత్తేశారు. టంగ్ బౌలింగ్‌‌లో కరుణ్ ఎల్బీ అవ్వగా.. అట్కిన్సన్ ఓవర్లో సుందర్‌‌ ఒవర్టన్‌‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆపై ఒకే ఓవర్లో  సిరాజ్ (0), ప్రసిధ్ కృష్ణ (0)ను డకౌట్ చేసిన అట్కిన్సన్‌‌ ఇండియా ఇన్నింగ్స్ ముగించాడు.

దంచికొట్టి.. ఢమాల్

ఇండియాను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసి తొలి గంటలోనే బ్యాటింగ్‌‌కు వచ్చిన ఇంగ్లండ్‌‌ స్టార్టింగ్‌‌లో మళ్లీ బజ్‌‌బాల్‌‌ ఆటతో దుమ్మురేపింది. ఇండియా బ్యాటర్లు తడబడిన గ్రీన్ వికెట్‌‌పై ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్‌‌ టీ20  స్టయిల్లో భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. వాళ్ల ముందు ఆకాశ్‌‌ దీప్, సిరాజ్, ప్రసిద్ కృష్ణ తేలిపోయారు. సిరాజ్‌‌ను టార్గెట్ చేసిన క్రాలీ తొలి సెషన్‌‌లో రాబట్టిన 12 ఫోర్లలో ఐదు అతని బౌలింగ్‌‌లోనే కొట్టాడు. ఆకాశ్‌‌ బౌలింగ్‌‌లో థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ కొట్టి తన ఫిఫ్టీ  పూర్తి చేసుకున్నాడు. ఇంకోవైపు డకెట్ క్రీజు వదిలి ముందుకు వచ్చి ఆకాశ్‌‌ బౌలింగ్‌‌లో రెండుసార్లు కట్‌‌షాట్లు ఆడాడు.  

ఆకాశ్‌‌ ఓవర్లోనే రివర్స్ స్కూప్‌‌తో అలరించిన అతను సిరాజ్ బౌలింగ్‌‌లో రాంప్ షాట్‌‌తో సిక్స్‌‌ రాబట్టడం విశేషం. లంచ్‌‌కు 15 నిమిషాల ముందు ఆకాశ్‌‌ బౌలింగ్‌‌లో మరో రివర్స్ హిట్ ప్రయత్నించి డకెట్ కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటవడంతో ఇండియా బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఓపెనర్లు 77 బాల్స్‌‌లోనే 92 రన్స్ చేశారు.  వాళ్ల జోరుతో ఇంగ్లండ్ 16 ఓవర్లలోనే 109/1తో లంచ్‌‌కు వెళ్లింది. తొలి సెషన్‌‌లో ఇంగ్లండ్ ఓపెనర్ల ధాటికి బెంబేలెత్తిన ఇండియా పేసర్లు లంచ్ బ్రేక్ తర్వాత గొప్పగా పుంజుకున్నారు. హైదరాబాదీ సిరాజ్‌‌, ప్రసిధ్  కృష్ణ వరుస వికెట్లతో జట్టును తిరిగి రేసులోకి తెచ్చారు. బ్రేక్‌‌ నుంచి వచ్చిన కొద్దిసేపటికే క్రాలీని ఔట్ చేసిన ప్రసిధ్ ఇంగ్లండ్‌‌ లయను దెబ్బకొట్టాడు.  

ఆపై, సిరాజ్ ఖతర్నాక్ బాల్స్‌‌తో రెచ్చిపోయాడు.  పిచ్‌‌ నుంచి లభిస్తున్న సపోర్ట్‌‌ను సద్వినియోగం చేసుకుంటూ బాల్‌‌ను రెండు వైపులా స్వింగ్ చేసిన సిరాజ్ అద్భుతమైన ఇన్‌‌ స్వింగింగ్ యార్కర్లతో  స్టాండిన్ కెప్టెన్‌‌ ఒలీ పోప్ (22), ఇన్‌‌ఫామ్ బ్యాటర్ జో రూట్‌‌ (29)ను వెంటవెంటనే పెవిలియన్ చేర్చాడు.  కొద్దిసేపటికే మరో ఇన్‌‌ స్వింగర్‌‌‌‌తో జాకబ్ బెథెల్ (6)ను కూడా ఎల్బీ చేయడంతో ఇంగ్లిష్​ టీమ్ 195/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో జెమీ స్మిత్ (8)తో కలిసి  హ్యారీ బ్రూక్‌‌ స్కోరు 200 దాటించాడు. 

అయితే, ప్రసిధ్‌‌ ఒకే ఓవర్లో స్మిత్‌‌, జెమీ ఒవర్టన్ (0)ను వెనక్కుపంపడంతో ఇంగ్లండ్ 215/7తో టీ బ్రేక్‌‌కు వెళ్లింది. రెండో సెషన్‌‌లో 114 రన్స్ చేసిన ఆ టీమ్ ఆరు వికెట్లు కోల్పోయింది. బ్రేక్ నుంచి వచ్చిన వెంటనే రెండు ఫోర్లతో జోరు మీద కనిపించిన అట్కిన్సన్ (11)ను కూడా ప్రసిధ్ ఔట్‌‌ చేశాడు. ఈ టైమ్‌‌లో సిరాజ్ బౌలింగ్‌‌లో స్లాగ్ స్వీప్ షాట్‌‌తో బ్రూక్ సిక్స్‌‌తో ఎదురుదాడికి దిగగా... వర్షం రావడంతో ఆట ఆగిపోయింది.  మళ్లీ మొదలైన వెంటనే బ్రూక్‌‌ను సిరాజ్‌‌ బౌల్డ్ చేశాడు. భుజం గాయం కారణంగా క్రిస్ వోక్స్‌‌ మ్యాచ్‌‌ నుంచి తప్పుకోవడంతో ఇంగ్లండ్‌‌ ఆలౌటైంది.

జైస్వాల్ బజ్‌‌బాల్‌‌

మూడో సెషన్‌‌లో మళ్లీ బ్యాటింగ్‌‌కు వచ్చిన ఇండియాకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ మంచి ఆరంభం ఇచ్చాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ తప్పిదాలను పునరావృతం చేయకుండా అతను ఇంగ్లిష్ టీమ్‌‌కు బజ్‌‌బాల్‌‌ బ్యాటింగ్‌‌తో కౌంటర్‌‌‌‌ ఇచ్చాడు. మంచి డిఫెన్స్‌‌ చూపెడుతూనే.. నాణ్యమైన షాట్లతో బౌండ్రీలు రాబట్టాడు. డ్రైవ్స్‌‌, కట్ షాట్లతో బౌలర్లపై పైచేయి సాధించాడు. డీఫ్ ఫైన్‌‌ లెగ్‌‌లో డాసన్‌‌, స్లిప్‌‌లో బ్రూక్‌‌ క్యాచ్‌‌లు డ్రాప్ చేయడంతో అతనికి రెండు లైఫ్‌‌లు కూడా దక్కాయి.

 వీటిని సద్వినియోగం చేసుకున్న అతను ఒవర్టన్‌‌ బౌలింగ్‌‌తో సిక్స్ కొట్టి 44 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఇంకోఎండ్‌‌లో తన మార్కు డిఫెన్స్‌‌తో క్రీజులో నిలిచే ప్రయత్నం చేసిన రాహుల్.. టంగ్‌‌ ఊరించే బాల్‌‌ను వెంటాడి స్లిప్‌‌లో రూట్‌‌కు క్యాచ్ ఇచ్చాడు. సాయి సుదర్శన్  కూడా మెరుగ్గానే కనిపించినా.. అట్కిన్సన్ లో బౌన్స్‌‌ బాల్‌‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. దీనికి రివ్యూ కూడా వేస్ట్ చేశాడు.

సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌: 69.4 ఓవర్లలో 224 ఆలౌట్ (కరుణ్‌‌ నాయర్‌‌ 57, సుదర్శన్‌‌ 38, అట్కిన్సన్ 5/33, జోష్‌‌ టంగ్‌‌ 3/57).
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌‌: 51.2 ఓవర్లలో 247 ఆలౌట్ (క్రాలీ 64, బ్రూక్ 53, ప్రసిధ్ 4/62, సిరాజ్ 4/86). 
ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌: 18 ఓవర్లలో  75/2 (జైస్వాల్ 51 బ్యాటింగ్‌‌, ఆకాశ్ 4 బ్యాటింగ్‌‌, టంగ్ 1/25)