IND vs SL 1st Test: భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య రేపు (శనివారం, ఆగస్టు 15న) గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తొలి టెస్టు ప్రారంభం కావడానికి మరో 20 గంటల సమయం కూడా లేదు. ఈ కీలక పోరుకు సంబంధించిన పిచ్ రిపోర్ట్‌తో పాటు టీమిండియా ఏ కాంబినేషన్‌తో బరిలోకి దిగనుందనే వివరాలు బయటకు వచ్చాయి. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఇండియా తొలి మ్యాచ్‌లో ఎలా ఆడబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
తొలి టెస్ట్ ప్లాన్ ఇదే:
గాలే స్టేడియం పిచ్ తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలించి పరుగులు కురిపించే అవకాశం ఉంది. కానీ మూడో రోజు నుంచి పిచ్ క్రమంగా పగుళ్లు బారి స్పిన్నర్లకు బాగా సహకరించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పిచ్ స్వభావాన్ని బట్టి భారత మేనేజ్మెంట్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్‌ను సెకలర్ట్ చేసుకోవాలని యోచిస్తోంది.
పేసర్లు ఎవరు? స్పిన్నర్లు ఎవరు?:
* పేస్ విభాగం: మహమ్మద్ సిరాజ్ తన స్థానాన్ని ఖాయం చేసుకోగా, రెండో పేసర్ స్థానం కోసం ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఎంపికైన ఆకిబ్ నబీ కొలంబో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోవడంతో అతడికి తుది జట్టులో అవకాశం దక్కడం కష్టమే అని చెప్పాలి.
* స్పిన్ విభాగం: ఆల్‌రౌండర్‌గా జట్టుకు కొండంత భరోసా ఇచ్చే రవీంద్ర జడేజా స్థానం పక్కా కావడంతో.. మిగిలిన రెండు స్థానాల కోసం కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్లకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సరాన్ష్ జైన్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు అనే ఊహగానాలు వినిపిస్తున్నాయి.
సీనియర్లు లేని భారత జట్టు:
2008 తర్వాత శ్రీలంక గడ్డపై భారత జట్టు ఇప్పటి వరకు టెస్టు సిరీస్ ఓడిపోలేదు. అయితే ఈసారి విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్, అజింక్య రహానే వంటి సీనియర్లు వీడ్కోలు పలకడం, బుమ్రా గాయంతో దూరమవ్వడం జట్టుకు పెద్ద లోటే అని చెప్పాలి.. ఇక రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ తప్ప మిగిలిన వారిలో శ్రీలంకలో టెస్టులు ఆడిన అనుభవం లేదు. మరోవైపు శ్రీలంకను కూడా గాయాల సమస్య బాగా వేధిస్తోంది. ఆ జట్టులోని కీలక బ్యాటర్లు పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్ తొలి టెస్టుకు దూరం కావడం ఆ జట్టుకు మింగడుపడని అంశమే.
