V6 News

మావోయిస్టు భాగ్యకు కన్నీటి వీడ్కోలు

మావోయిస్టు భాగ్యకు కన్నీటి వీడ్కోలు
  •     అశృనయానాల మధ్య అంతక్రియలు

తొగుట(మిరుదొడ్డి), వెలుగు: ఛత్తీస్ గఢ్​ కాంకేర్  జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయిన భాగ్య అలియాస్  రూపిరెడ్డి అంత్యక్రియలు బుధవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో అశ్రునయనాల మధ్య జరిగాయి. మంగళవారం రాత్రి గ్రామానికి భాగ్య డెడ్​బాడీ చేరుకుంది. బుధవారం ఉదయం గ్రామస్తులు, ఉద్యమకారులు, విప్లవ సంఘాల నేతలు, అభిమానులు, ప్రజా సంఘాల నేతలు హాజరై నివాళులు అర్పించారు. 

మధ్యాహ్నం ఒంటి గంటకు అంతిమయాత్ర ప్రారంభం కాగా, వందలాది మంది అభిమానుల సమక్షంలో శవయాత్ర  కొనసాగింది. ఉద్యమకారులు పాటలు పాడుతూ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఆమె వ్యవసాయ క్షేత్రంలో భాగ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. భాగ్యకు ఆమె తమ్ముడు తలకొరివి పెట్టాడు.

శోకసంద్రంలో ధర్మారం

గ్రామానికి చెందిన రంగబోయిన భాగ్య ఎన్​కౌంటర్లో చనిపోవడంతో ధర్మారం గ్రామంలో విషాదం అలుముకుంది. 25 ఏళ్ల కింద ఉద్యమంలోకి వెళ్లిన భాగ్య శవంగా తిరిగిరావడడంతో ఆమె చివరి చూపు కోసం గ్రామస్తులంతా తరలివచ్చారు. భాగ్య కుటుంబ సభ్యులు రోధించిన తీరు పలువురుని కంటతడి పెట్టించింది.

అంత్యక్రియల్లో అమరవీరుల బంధుమిత్రుల కమిటీ ఏపీ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పద్మ కుమారి, అధ్యక్షురాలు అంజమ్మ, ఉపాధ్యక్షురాలు శాంత, సంధ్య, సహ కారదర్శి భవాని, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శోభ, విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి పాణి, బాలసాని రాజయ్య, పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణ సహ కారదర్శి కుమారస్వామి , అధ్యక్షులు లక్ష్మణ్, పూర్వ విద్యార్థుల సంఘం వేదిక నాయకులు రవి, రమణ, ఓంబ్రహ్మం, కుల నిర్మూలన పోరాట సమితి సభ్యులు అభినయ్, టీపీఎఫ్  నేతలు సత్యం, మల్లేశం, బంధుమిత్రుల కమిటీ సభ్యులు భూపతి గౌడ్, సాయి కుమార్, మల్లేశం, శ్రీహరి యాదవ్  తదితరులు పాల్గొన్నారు.