
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న సూపర్ హీరో మూవీ ‘హను–మాన్’. అమృత అయ్యర్ హీరోయిన్. కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తేజ సజ్జా మాట్లాడుతూ ‘ సూపర్ హీరో అనగానే స్పైడర్ మాన్, సూపర్ మాన్ గుర్తొస్తారు. మనం సినిమాల్లో చూసింది వాళ్ళనే. కానీ వాళ్ళు స్ఫూర్తిపొందింది మన కల్చర్ నుండి, మన హనుమంతుడి నుండి. వాళ్ళ సూపర్ హీరోలు ఫిక్షనల్. హనుమంతుడు మన చరిత్ర. అలాంటి గొప్ప దేవుడి అనుగ్రహంతో ఒక కుర్రాడికి సూపర్ పవర్ వస్తే ఏం చేస్తాడనేది ఈ మూవీ స్టోరీ’ అన్నాడు. టీజర్ చూస్తే ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి అంది అమృత.
ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ‘నాకు ఇష్టమైన దేవుడు హనుమంతుడు. ఆయన పేరు మీద ఇంత పెద్ద సినిమా చేయడం హ్యాపీ. అనుకున్న బడ్జెట్ కంటే ఆరింతలు పెద్దదయ్యింది. అయినా నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఇంటర్నేషనల్ ఫిల్మ్‌గా చేయమని సపోర్ట్ చేశారు. ఇది కేవలం ప్యాన్ ఇండియా సినిమా కాదు ప్యాన్ వరల్డ్ సినిమా. ఎందుకంటే హనుమంతుడు సూపర్ హీరో. ఈ సినిమా కోసం అంజనాద్రి అనే కొత్త వరల్డ్ క్రియేట్ చేశాం. అన్ని భాషల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. తమిళ, హిందీ, మలయాళం, కన్నడ ప్రేక్షకులు కూడా ఇది తమ సినిమా అని భావించేలా తీస్తున్నాం’ అన్నాడు. నటుడు గెటప్ శ్రీను, డీవోపీ శివేంద్ర, సంగీత దర్శకుడు హరి గౌర తదితరులు పాల్గొన్నారు.