బెంగళూరు: హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి కర్నాటకలోని హుబ్బళ్లికి బయలుదేరిన ఓ విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ఆకాశంలోనే మూడు గంటల పాటు చక్కర్లు కొట్టింది. దీంతో ప్యాసింజర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫ్లై91 విమానం ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు 22 మంది ప్యాసింజర్లతో హైదరాబాద్ నుంచి హుబ్బళ్లికి బయలుదేరింది.
సాయంత్రం 4:30 గంటలకు హుబ్బళ్లిలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం సుమారు 3 గంటలు హుబ్బళ్లి గగనతలంలోనే చక్కర్లు కొట్టింది. దీంతో అందులోని ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. కొందరు కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుడిని ప్రార్థించారు. చివరకు భద్రతా కారణాల దృష్ట్యా పైలట్ విమానాన్ని బెంగళూరుకు మళ్లించాడు. సాయంత్రం 6:30 గంటలకు విమానం బెంగళూరులో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. రాత్రి 11 గంటలకు వాతావరణం చక్కబడగానే విమానం తిరిగి హుబ్బళ్లికి చేరుకుంది.

