టెక్నాలజీతో అగ్ని ప్రమాదాలకు చెక్!..ఈ ఏడాది అడవుల్లో జీరో ఫైర్ యాక్సిడెంట్స్ : రాష్ట్ర అటవీ శాఖ

టెక్నాలజీతో అగ్ని ప్రమాదాలకు చెక్!..ఈ ఏడాది అడవుల్లో జీరో ఫైర్ యాక్సిడెంట్స్ : రాష్ట్ర అటవీ శాఖ
  • అటవీయేతర ప్రాంతాల్లో 148 ప్రమాదాలే నమోదు
  • సాటిలైట్, డ్రోన్లతో అనుక్షణం అడవులపై నిఘా
  • రోజుకు నాలుగుసార్లు ‘ఫైర్ అలర్ట్’ మెసేజ్‌‌లు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర అటవీ శాఖ ముందస్తు ప్రణాళికలు, ఆధునిక సాంకేతికత వినియోగం సత్ఫలితాలనిస్తోంది. అటవీ సంరక్షణలో టెక్నాలజీని జోడించడంతో రాష్ట్రంలో అగ్నిప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈసారి అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు కనుమరుగైంది. గతేడాది నుంచి ఇప్పటివరకు 148 అగ్నిప్రమాదాలు మాత్రమే నమోదయ్యాయి. 

అవి కూడా అటవీయేతర భూముల్లో చోటుచేసుకున్నాయి. ప్రధానంగా వ్యవసాయ క్షేత్రాల్లో వరి కొయ్యలు కాల్చడంతో ప్రమాదాలు జరిగాయని ఫారెస్ట్​ ఆఫీసర్లు స్పష్టం చేశారు. నిరుడు డిసెంబర్‌‌  వరకు మొత్తం 539 ఫైర్  పాయింట్స్ నమోదు కాగా.. అందులో 170 అడవిలో, 370 బయట జరిగినట్లు నిర్ధారించారు. అటవీ శాఖ పకడ్బందీ ఫైర్ సేఫ్టీ చర్యలతోనే అడవి సురక్షితంగా ఉందని చెప్తున్నారు. 

అగ్ని పోర్టల్ తో నిఘా

అడవిలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి అటవీ శాఖ పూర్తిస్థాయిలో సాంకేతికతను వినియోగిస్తోంది. అడవిలో చిన్నపాటి మంటలు చెలరేగినా క్షణాల్లో సాటిలైట్ల ద్వారా సమాచారం అందుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా అగ్ని పోర్టల్  నిర్వహిస్తున్నారు. పగలు రెండు, రాత్రి రెండు సార్లు సాటిలైట్  డేటా ఆధారంగా అలర్ట్  మెసేజ్‌‌లు వస్తాయి. ఈ పోర్టల్‌‌లో అటవీ అధికారులతో పాటు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖ అధికారుల నంబర్లను రిజిస్టర్  చేశారు. 

ప్రమాదం జరిగిన లొకేషన్‌‌తో సహా అందరికీ ఒకేసారి మెసేజ్  వెళ్తుంది. అంతేకాకుండా సిబ్బంది వెళ్లలేని దట్టమైన అటవీ ప్రాంతాలు, కొండకోనల్లో నిఘా ఉంచేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఎక్కడైనా పొగ వస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే డ్రోన్ల ద్వారా పరిశీలించి, బేస్ క్యాంప్  సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. 2024–25లో ఇప్పటివరకు 5,600 హెచ్చరికలు రాగా.. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎక్కడా ప్రమాదం జరగలేదని నిర్ధారించుకున్నారు.

గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు: పీసీసీఎఫ్ సువర్ణ

అడవికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వరికొయ్యలు కాల్చడం వల్ల పర్యావరణంతోపాటు నేలసారం దెబ్బతింటుంది. ఆ మంటలు అడవికి వ్యాపించే ప్రమాదం ఉంది. భద్రాద్రి, ఆదిలాబాద్, నాగర్‌‌ కర్నూల్ వంటి అటవీ ప్రభావిత జిల్లాల్లో గ్రామసభలు, పాఠశాలల్లో సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తున్నాం. అడవిలో బీడీలు, సిగరెట్లు కాల్చడం, వంటలు చేయడం నిషేధం. ట్రెక్కింగ్‌‌కు వెళ్లే పర్యాటకులకు, తేనె, ఇతర అటవీ ఉత్పత్తులను సేకరించేవారికి ప్రత్యేకంగా సూచనలు చేశాం.

రక్షణ వలయంగా ఫైర్ లైన్స్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26,969 చ.కి.మీ అటవీ విస్తీర్ణంలో 56 డివిజన్లు, 10 సర్కిళ్ల పరిధిలో 250 పైగా రేంజ్ లు ఉన్నాయి. అటవీలో అగ్ని ప్రమాదాల నివారణకు కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. రోడ్లకు ఇరువైపులా అటవీ కాలిబాటల్లో ఐదు మీటర్ల వెడల్పుతో  ఫైర్ లైన్స్  ఏర్పాటు చేశారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర చెత్తాచెదారం, ఎండుటాకులు లేకుండా శుభ్రంచేసి వాటిని ఒకచోట చేర్చి కంట్రోల్డ్  పద్ధతిలో  కాల్చివేస్తారు. దీనివల్ల ప్రమాదవశాత్తు నిప్పు అంటుకున్నా.. 5 మీటర్ల ఖాళీ స్థలంతో అవతలి వైపు వ్యాపించదు. దీంతో అడవిలో మంటల వ్యాప్తికి అడ్డుకట్ట పడింది.