- తెలంగాణను పెంటకుప్పలా మార్చారు
- తేజస్వి సూర్య ఒక వెధవ.. తెలంగాణపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడిండు
- ఆ వెధవ మాటలను ఏ ఒక్క వెధవా ఖండించలే.. కాంగ్రెస్, బీజేపీ నేతలు మనుషులు కాదా?
- ప్రజలకు ఎంత మంచి చేసినా ఎందుకు ఓడిపోయామో ఆత్మవిమర్శ చేసుకోవాలె
- ఈ మధ్య పార్టీలో సోషల్ మీడియా భక్తులు మోపైన్రు..
- కొందరు నేతలు ఇంకా అహంకారంతోనే ఉన్నరు
- సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా సరే ఈసారి మొఖం చూసి టికెట్ ఇచ్చేది లేదు
- పార్టీ రాష్ట్ర కమిటీ మినహా అన్ని కమిటీలనూ రద్దు చేస్తున్నట్టు ప్రకటన
- బీఆర్ఎస్ రజతోత్సవ ముగింపు కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చండాలమైన, చిల్లర ప్రభుత్వం నడుస్తున్నదని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. వాళ్లు మాట్లాడే మాటలేంటి.. ఆ కూతలేంటి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో అర్థం కావడం లేదని, తెలంగాణను పెంటకుప్పలా మార్చారన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని, ఆయనో వెధవ అని మండిపడ్డారు. ఆ వెధవ అన్నేసి మాటలు మాట్లాడినా ఏ వెధవా ఖండించలేదని, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఆయన్ను ఏమీ అనలేదని అన్నారు.
సీఆర్ పాటిల్ కాళేశ్వరం గురించి మాట్లాడితే రాజ్యసభలో సురేశ్‌రెడ్డి గట్టిగా ఖండించారని గుర్తు చేశారు. తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అడ్డుకోని కాంగ్రెస్, బీజేపీ నేతలు మనుషులు కారా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ ముగింపు, 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తెలంగాణభవన్‌లో పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు, మహిళా బిల్లు, పార్టీ కమిటీల రద్దు, సభ్యత్వ నమోదులాంటి వాటిపై తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో భాగంగా పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
‘‘నన్ను ఎన్నోసార్లు, ఎంతో మంది మానసిక క్షోభకు గురిచేశారు. హైదరాబాద్ విషయంలో రాజీ పడాల ని సోనియా గాంధీ ఎన్నోసార్లు చెప్పినా నేను రాజీ పడలేదు. చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకే 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నం. అది మన చిత్తశుద్ధి. తెలంగాణపై బీఆర్ఎస్కు ఉన్న చిత్తశుద్ధి మరే పార్టీకీ లేదు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే కిషన్ రెడ్డి పారిపోయారని ఎద్దేవా చేశారు.
కమిటీలన్నీ రద్దు..
బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ మినహా గ్రామ, మండల, జిల్లా కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. వారంలోగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపడతామని తెలిపారు. ప్రజలకు ఎన్ని కార్యక్రమాలు చేసినా, 60 లక్షల సభ్యత్వాలు ఉన్నా ఎందుకు ఓడిపోయామో ఆత్మ విమర్శ చేసుకోవాలని పార్టీ నేతలకు హితవు పలికారు. సింగరేణి కార్మికులకు అన్నీ చేసినా ఆ ప్రాంతంలో ఓటమి పాలయ్యామని అన్నారు. రాశి కాదు.. వాసి ముఖ్యమని పేర్కొన్నారు. ఈ మధ్య సోషల్ మీడియా భక్తులు ఎక్కువ మోపయ్యారని, సోషల్ మీడియాలో ఉండి ఫీల్డ్‌లో ఉండకపోతే కుదరదని నేతలకు వార్నింగ్ ఇచ్చారు. పలువురు నేతల తీరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇకపై మొఖాలు చూసి టికెట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. యాక్టివ్‌గా పనిచేసేవాళ్లకు టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. తనకు అన్నీ తెలుసని, గోల్‌మాల్ చేస్తామంటే కుదరదన్నారు. కొందరు నాయకులు ఇంకా అహంకారంతో వెళ్తున్నారని, అందరినీ కలుపుకొని పోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. టికెట్ కేటాయింపులకు సభ్యత్వ నమోదును ప్రామాణికంగా తీసుకుంటామని, పట్టించుకోకపోతే.. సిట్టింగ్ ఎమ్మెల్యే అని కూడా చూడనని, టికెట్ ఇవ్వబోనని స్పష్టం చేశారు. తాను ఒక్కసారి చెబితే.. వెయ్యిసార్లు చెప్పినట్టేనని చెప్పారు. సభ్యత నమోదు కోసం ప్రతి జిల్లాకూ ఒక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని ఇన్‌చార్జిగా నియమిస్తామన్నారు. సాధారణ సభ్యత్వానికి రూ.10, క్రియాశీల సభ్యత్వానికి రూ.50 చొప్పున రుసుం పెడుతున్నాన్నారు.
‘సర్’ విషయంలో అలర్ట్‌గా ఉండాలి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ కోసం బీఎల్‌వోల నియామక ప్రక్రియనూ పట్టించుకోకపోతే ఏం లాభం లేదని కేసీఆర్ అన్నారు. సర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, లేదంటే నష్టపోతామని చెప్పారు. నేతలందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దీనిపై ప్రతి నియోజకవర్గంలో 200 మందికి శిక్షణ ఇవ్వాలని ఈ సందర్భంగా కేసీఆర్ నిర్ణయించారు.
పార్టీ కార్యకర్తలను సైనికుల్లా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి విద్యా సంస్థలోనూ విద్యార్థి విభాగం కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. అనుబంధ సంఘాలనూ పటిష్ఠం చేయాలని అన్నారు. నియోజకవర్గాలవారీగా ముఖ్య నేతలతో త్వరలో ఎర్రవల్లిలో సమావేశం అవుతానని తెలిపారు.
రాష్ట్రంలో అక్రమాలు.. అరాచకాలు..
కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో అరాచకాలు, అక్రమాలు, భూకబ్జాలకు పాల్పడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ప్రజలు విసుగుచెందారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుందని, వెయ్యి శాతం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని పేర్కొన్నారు. పంటల కొనుగోళ్లపై ప్రభుత్వాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నిలదీసి రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
బీజేపీ నేతలు పార్లమెంట్‌లో మహిళా బిల్లు కావాలనే వీగిపోయేలా చేశారని, దీనికి బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పద ని హెచ్చరించారు. ఇప్పుడున్న సీట్లలోనే 33 శాతం మహిళా రిజర్వేషన్లు కల్పించాలని లోక్‌సభలో ప్రియాంక గాంధీ బాగా మాట్లాడారని పేర్కొన్నారు. ఒకప్పుడు ఇందిరాగాంధీకి వీరాభిమానిగా ఉండే వాడినని.. కానీ, ఎమర్జెన్సీ విధింపుతో అది పోయిందని చెప్పారు.
జనతాపార్టీ ఇందిరపై కక్ష సాధించడంతో మళ్లీ ఆమెపై అభిమానం పెరిగిందన్నారు. ఇందిరాగాంధీ ఉండేందుకు ఢిల్లీలో ఇల్లు కూడా లేకుండా చేశారని, ఇక్కడి పర్యటనకు వచ్చినపుడు గెస్ట్ హౌస్ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంట మనుషులు లేకున్నా ఇందిరాగాంధీ ఎన్నికల్లో గెలిచారన్నారు. ఇందిరాగాంధీకి మద్దతుగా తాను ఢిల్లీ ఎయిర్ పోర్టులో ‘దేశ్ కీ నేత’ అని నినాదాలు ఇచ్చానని గుర్తు చేశారు. కాగా, తాను సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను నీళ్ల గురించి ఆరా తీసేవాడినన్నారు. కానీ, ఇప్పుడు ఎమ్మెల్యేలు భూకబ్జాలు ఎంత బాగా చేస్తున్నారని ఆరా తీస్తున్నారన్నారు.

