- వెంటనే కిషన్ రెడ్డి, సంజయ్ సహా రాష్ట్ర బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయాలి
- రేపిస్టులకు టికెట్లు ఇచ్చిన పార్టీ..
- మహిళా హక్కులపై మాట్లాడడం హాస్యాస్పదమని కామెంట్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ఏర్పాటును ఇండియా–పాకిస్తాన్‌తో పోల్చుతూ.. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మతితప్పి మాట్లాడుతున్నారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. అసలు సభలో బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లు ఏంటి? తేజస్వి మాట్లాడిన అంశాలు ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటును అవమానించేలా.. తేజస్వి మాట్లాడుతుంటే కనీసం అడ్డుకునే స్థితిలో కూడా బీజేపీ తెలంగాణ ఎంపీలు లేకపోవడం సిగ్గుచేటన్నారు.
ఇందుకు బాధ్యత వహిస్తూ.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ ఎంపీలంతా వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణపై చర్చ అనంతరం పార్లమెంట్ ఆవరణలో తేజస్వి వ్యాఖ్యలను ఎంపీ వంశీకృష్ణ తీవ్రంగా తప్పుబట్టారు.
బీజేపీ మొదటి నుంచీ తెలంగాణ వ్యతిరేకి అన్నారు. ప్రధాని మొదలు ఆ పార్టీకి చెందిన కీలక నేతలంతా సందర్భాల్లో తెలంగాణ ఏర్పాటును కించపరిచేలా మాట్లాడారని గుర్తుచేశారు. తెలంగాణ బిడ్డగా.. రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన సహించబోనన్నారు. రేపిస్టులను టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్న పార్టీ బీజేపీ అని ఎంపీ వంశీకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. అట్లాంటి పార్టీ.. మహిళల హక్కుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అత్రాస్, ఉన్నావ్ అత్యాచార దోషులను బీజేపీలో చేర్చుకుని ప్రోత్సహించింది ఆ పార్టీ నేతలేనని గుర్తుచేశారు. సమ్రాట్ చౌదరీ లాంటి రేపిస్ట్ ని ప్రోత్సహించేది కూడా కాషాయ పార్టీయే అన్నారు.
టాపిక్‌ను డైవర్షన్ చేస్తున్న కేటీఆర్
ట్విట్టర్ టిల్లు కేటీఆర్ టాపిక్ డైవర్షన్ చేస్తున్నారని ఎంపీ వంశీకృష్ణ ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం పోరాడింది.. తెలంగాణ తెచ్చింది.. ప్రస్తుతం తెలంగాణను అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర కూడా లేదని ఎంపీ పేర్కొన్నారు.
- తేజస్వివి అవగాహనలేని వ్యాఖ్యలు: చామల
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తేజస్వి సూర్య అవగాహన లేకుండా మాట్లాడారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ నాయకులను ప్రసన్నం చేసుకోవాలనే అలా మాట్లాడారన్నారు. దీనిపై తెలంగాణ బీజేపీ ఎంపీలు స్పందించాలని, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లను ముందు పెట్టి బీజేపీ డ్రామాలు ఆడుతోందని ఎంపీ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రీడ్ మోడల్ విధానం అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకం అంటూ బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.
- డీలిమిటేషన్ పేరుతో కేంద్రం కుట్ర..
డీలిమిటేషన్ పేరుతో కేంద్రంలోని బీజేపీ సర్కారు దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర చేస్తోందని ఎంపీ వంశీకృష్ణ విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా బీజేపీ గెలవదన్నారు. అందుకే కేవలం నార్త్‌లోనే సీట్లుపెంచుకొని.. అక్కడి నుంచే అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన తెలంగాణ నుంచి 3 శాతం, ఫైనాన్షియల్ గా 6 శాతం కాంట్రిబ్యూషన్ ఉందన్నారు. మోదీ సర్కార్.. సౌత్ నుంచి ఫండ్స్ తీసుకుంటుంది కానీ.. మా ఓట్లు వద్దు అనేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణతో పాటు దక్షిణాదికి అన్యాయం చేయాలనే చూస్తే.. మరో తెలంగాణ ఉద్యమాన్ని చూస్తారని హెచ్చరించారు. కేంద్రానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి.. హక్కులను ఉపయోగించుకుంటామన్నారు.

