- ప్రతి కులానికి తగిన సంక్షేమం అందించడమే సర్వే ముఖ్య ఉద్దేశం
- గతంలో చేసిన కుటుంబ సర్వేను విపరీతమైన ప్రచారంతో హైప్ చేశారు
- ఈసారి క్షేత్రస్థాయిలో ఉన్న నివాసితులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నం
- సీపెక్ సర్వే 2024పై స్వతంత్ర నిపుణుల కమిటీ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ సర్వే 2024 నివేదిక కేవలం అంకెల సమాహారం కాదని.. కోట్లాది మంది ప్రజల బతుకుచిత్రాన్ని ప్రతిబింబించే ‘తెలంగాణ సామాజిక సర్వస్వం’ అని స్వతంత్ర నిపుణుల కమిటీ తెలిపింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన మీడియా సమావేశంలో కమిటీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ కంచ ఐలయ్య, సభ్య కన్వీనర్ ప్రవీణ్ చక్రవర్తి, ప్లానింగ్ కమిషన్ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్, సభ్యులు డాక్టర్ భాగ్యా భుక్యా కలిసి సర్వేలోని అంశాలను వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న సామాజిక అసమానతలను తొలగించి, ప్రతి కులానికి వారి వెనుకబాటుతనం ప్రాతిపదికన ‘లక్షిత సంక్షేమం’ అందించడమే ముఖ్య ఉద్దేశమని వారు స్పష్టం చేశారు. 2011 జనగణన, 2014 సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలతో పోలిస్తే ప్రస్తుత జనాభా 3.55 కోట్లుగా నమోదు కావడంపై కంచె ఐలయ్య వివరణ ఇచ్చారు.
2014లో అప్పటి ప్రభుత్వం సృష్టించిన విపరీతమైన ప్రచారం వల్ల దుబాయ్ వంటి ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా వచ్చి పేర్లు నమోదు చేసుకున్నారని.. అది ఒక రకమైన ‘హైప్’ అని ఆయన అభివర్ణించారు. కానీ, ఈసారి ఎటువంటి ఆర్భాటం లేకుండా క్షేత్రస్థాయిలో ఉన్న నివాసితులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం వల్ల గణాంకాలు వాస్తవానికి దగ్గరగా వచ్చాయని తెలిపారు. 2011 నాటికి ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగుల వలసలు, ఏడు మండలాల విలీనం వంటి అంశాలు కూడా ఈ వ్యత్యాసానికి కారణమయ్యాయని పేర్కొన్నారు. 2027లో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీ ఐ) ఇచ్చే లెక్కలే అంతిమమని, అప్పటి వరకు రాష్ట్ర సంక్షేమ పథకాలకు ఇదే ప్రామాణికమని ఆయన స్పష్టం చేశారు.
ఇంగ్లిష్ విద్య అందుబాటులో ఉన్న కులాల్లో వృద్ధి
ఇంగ్లిష్ మీడియం విద్య మెరుగ్గా అందుబాటులో ఉన్న కులాలే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని కంచ ఐలయ్య పేర్కొన్నారు. నాణ్యమైన విద్య అందరికీ సమానంగా అందకపోవడం వల్లే కులాల మధ్య అసమానతలు పెరుగుతున్నాయని, ఏ వర్గాలకైతే ఇంగ్లిష్ విద్య అందుబాటులో లేదో వారు అభివృద్ధి పరుగులో వెనుకబడిపోతున్నారని స్పష్టం చేశారు.
విద్యారంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకున్న వర్గాలే ఇప్పుడు అధికార, ఆర్థిక వ్యవస్థల్లో ముందంజలో ఉన్నాయని వివరించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల 45 శాతం మంది ప్రజలు నేటికీ దినసరి కూలీలుగానే జీవనం సాగిస్తున్నారని కమిటీ సభ్యులు వెల్లడించారు. సరైన విద్య, నైపుణ్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల వీరంతా అసంఘటిత రంగంలో శారీరక శ్రమపైనే ఆధారపడి బతుకుతున్నారని, ఆర్థిక స్వావలంబన లేక వెనుకబాటుతనానికి గురవుతున్నారని పేర్కొన్నారు.
సామాజిక న్యాయంలో సరికొత్త ఫిలాసఫీ
సంక్షేమ పథకాల పంపిణీలో కమిటీ ఒక మార్పును ప్రతిపాదించింది. గతంలో సామాజిక న్యాయం అంటే అందరికీ కలిపి ఒకే ‘బావి’ నుంచి నీరు తోడినట్టు ఉండేదని.. కానీ, ఇప్పుడు ‘ప్రతి ఇంటికి ఒక నల్లా’ తరహాలో ప్రతి కులానికి వారి అవసరాలకు తగ్గట్టుగా పథకాలు అందాలని ప్రవీణ్ చక్రవర్తి వివరించారు. ఏ కులం ఏ రంగంలో ఎంత వెనుకబడి ఉందో తెలుసుకోవడానికి ఈ డేటా ఒక దిక్సూచిలా పనిచేస్తుందని ఆయన తెలిపారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం 2026 నాటికి తెలంగాణ జనాభా 3.7 కోట్లుగా ఉండవచ్చని, ప్రస్తుత సర్వే 97 శాతం గృహాలను కవర్ చేస్తూ 3.6 కోట్ల మందిని గుర్తించడం ద్వారా అత్యంత కచ్చితత్వాన్ని సాధించిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కులాల పేర్లు - సాంకేతిక పొరపాట్లపై వివరణ
నివేదికలో కులాల పేర్లలో దొర్లిన కొన్ని పొరపాట్లపై కమిటీ వివరణ ఇచ్చింది. ముఖ్యంగా బీసీ ‘-ఏ’ జాబితాలోని ‘మేదరి’ కులాన్ని ‘మెహతార్’గా పేర్కొనడంపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇది ప్రభుత్వ ఎన్యుమరేటర్ల మాన్యువల్‌లో ఉన్న సాంకేతిక పొరపాటే తప్ప కమిటీ సొంతంగా సృష్టించినది కాదని కంచె ఐలయ్య స్పష్టం చేశారు.
బీసీ కమిషన్ సిద్ధం చేసిన జాబితా ఆధారంగానే సర్వే సాగిందని, ప్రాంతాల వారీగా కులాల పేర్లలో ఉన్న వైవిధ్యం వల్ల కొన్ని చోట్ల ‘మేర’, ‘మేరా’, ‘కురుమ’, ‘కురుబ’ వంటి పదాల విషయంలో స్వల్ప గందరగోళం ఏర్పడిందని తెలిపారు. 0.6 శాతం మేర ఉన్న ఇతర కులాల వివరాలను కూడా పొందుపరిచామని, కుల గుర్తింపు లేని వారిని ‘నో క్యాస్ట్’ విభాగంలో చేమన్నారు.
కనీస వసతులకు దూరంగా చెంచులు
నల్లమల అడవుల్లో నివసించే చెంచు తెగ జనాభా 35,583 గా ఉందని, వారి కాంపోజిట్ వెనుకబాటుతనం ఇండెక్స్ 108 పాయింట్లుగా ఉందని డాక్టర్ భాగ్యా భుక్యా వెల్లడించారు. వీరికి ఇప్పటికీ విద్యుత్, సురక్షిత తాగునీరు సౌకర్యాలు అందట్లేదన్నారు.
ఆదాయం - ఆస్తుల నమోదులో వాస్తవాలు
సుమారు 1.1 కోట్ల మంది ప్రజలు (సుమారు 30 శాతం) వార్షిక ఆదాయం లక్ష రూపాయల కంటే తక్కువగా ఉన్నట్టు స్వయంగా వెల్లడించారని ప్రవీణ్ చక్రవర్తి తెలిపారు. సాధారణంగా ఆదాయం, భూమి, ఆస్తుల వివరాలు అడిగినప్పుడు ప్రజలు తక్కువ చేసి చెప్పే ధోరణి ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని, ఇక్కడ కూడా అదే జరిగిందని ప్రవీణ్ చక్రవర్తి తెలిపారు. అయితే, ఇది ‘రిలేటివ్ అనాలిసిస్’కు అడ్డంకి కాదని, అందరూ తక్కువ చేసి చెప్పినప్పుడు కూడా ఏ వర్గం ఎవరికంటే వెనుకబడి ఉందో సులభంగా గుర్తించవచ్చని తెలిపారు.
13 శాతం మంది వలస కార్మికులు బిహార్, ఒడిశా, బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారని, వారి సామాజిక స్థితిగతులను కూడా నివేదికలో పేర్కొన్నట్టు చెప్పారు. ఈ సర్వేను శాస్త్రీయంగా నిర్వహించినట్టు ప్లానింగ్ కమిషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ వివరించారు. నివేదికలోని సిఫార్సులపై అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నామని, బడ్జెట్ కేటాయింపులు, కొత్త పథకాల రూపకల్పనలో ఈ గణాంకాలే కీలకం కాబోతున్నాయని ఆయన వెల్లడించారు. త్వరలోనే ప్రభుత్వం ఈ డేటా ఆధారంగా కీలక నిర్ణయాలు తీసుకోనుందని స్పష్టం చేశారు.

