హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ ఫస్టియర్ లో సర్కారు కాలేజీలతో పాటు గురుకులాల్లోనూ పాస్ పర్సంటేజ్ ఎన్నడూ లేనంతగా భారీ స్థాయిలో తగ్గింది. ఈసారి సర్కారు కాలేజీల్లో 34% మంది స్టూడెంట్లు, గురుకులాల్లో 52% మంది మాత్రమే పాసయ్యారు. సర్కారు కాలేజీలు అతి తక్కువగా ఉన్న మేడ్చల్ జిల్లా పాస్ పర్సెంటేజ్ లో టాప్లో ఉంది. గవర్నమెంట్ కాలేజీలు ఎక్కువగా ఉన్న మెదక్, వికారాబాద్ జిల్లాల్లో 30%లోపే పాసయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద స్టూడెంట్లు చదివే సర్కారు కాలేజీల్లో పాస్ పర్సెంటేజ్ ఇంత తక్కువగా రావడంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఆన్ లైన్ క్లాసులు అర్థంగాలే..
కరోనా కారణంగా పోయిన అకడమిక్ ఇయర్ లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో 23 రోజులు మాత్రమే ఫిజికల్ క్లాసులు నడిచాయి. మిగిలిన రోజులన్నీ ఆన్లైన్, టీవీ పాఠాలే జరిగాయి. గురుకులాల్లో ఒక్కరోజు కూడా ఫిజికల్ క్లాసులు కొనసాగలేదు. సర్కారు కాలేజీల్లో ఫిజికల్ క్లాసులను ఇంటర్ అధికారులు సరిగా మానిటర్ చేయలేదు. సుమారు1800 మంది గెస్టు లెక్చరర్లను కూడా రెన్యువల్ చేయలేదు. మరోపక్క సర్కారు కాలేజీలు, గురుకులాల్లో చదివే పిల్లలంతా పేదవాళ్లే కావడం, ఎక్కువ మంది వద్ద స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, టీవీ పాఠాలపై ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో చదువుపై ఎఫెక్ట్ పడింది. ఇంటిదగ్గర ఉండటంతో చాలామంది పేరెంట్స్ తో పాటు పొలం పనులు, ఇతర పనులకు వెళ్లారు. నిరుడు రెగ్యులర్ గా కూడా 60% మించి క్లాసులు జరగలేదు. మరోపక్క స్మార్ట్ ఫోన్లు ఉన్నా, సిగ్నల్, రీచార్జీ సమస్యలతో టీవీ, ఆన్లైన్ పాఠాలకు మరికొందరు స్టూడెంట్లు దూరమయ్యారు. అలాగే డౌట్లు వస్తే తీర్చేవారు లేక, ఆన్ లైన్ క్లాసులు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కాలేజీ యూనిట్ గా ఆన్ లైన్ పాఠాలు చెప్పాలని లెక్చరర్ సంఘాలు కోరినా, ఇంటర్ అధికారులు పట్టించుకోలేదు.
ప్రైవేట్ లో 12% తగ్గింది
ప్రైవేటు కాలేజీల్లో గతేడాది 60 శాతానికి పైగా పాసైతే, ఈ సారి 52% స్టూడెంట్లు మాత్రమే పాసైనట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. మూడు లక్షలకు పైగా స్టూడెంట్లు పరీక్షలు రాస్తే, వారిలో 1.56 లక్షల మందిపాసైనట్టు సమాచారం. ప్రైవేటు కాలేజీల్లోనూ ఫెయిలైన వారిలో ఎక్కువ మంది రూరల్ ఏరియాలోని పేద విద్యార్థులే ఉన్నట్టు పేర్కొంటున్నారు. వారికీ ఆన్లైన్ క్లాసులు అందక, పాఠాలు విన్నా అర్థంకాక అవస్థలుపడ్డారు. మొత్తం 4,59,242 మంది పరీక్షలు రాస్తే, వారిలో 2,24,012 మంది పాసయ్యారు. వీరిలో సగానికి పైగా (1,15,538) 75% ఆపై మార్కులు తెచ్చుకున్న వాళ్లే కావడం గమనార్హం. 35–50%లోపు మార్కులొచ్చిన వారు కేవలం 14,371 మందే ఉన్నారు.
సర్కారులో 26% తగ్గింది
ఈ ఏడాది మేనేజ్‌మెంట్ల వారిగా చూస్తే అన్నింటిలోనూ పాస్ పర్సెంటేజ్ తగ్గింది. పాస్ పర్సెంటేజ్ అత్యల్పంగా ఎయిడెడ్, సర్కారు కాలేజీల్లోనే నమోదైంది. ఈసారి గవర్నమెంట్ కాలేజీల్లో 86 వేల మంది పరీక్షలు రాస్తే, వారిలో 29 వేలకు(34%) పైగా స్టూడెంట్లు పాసయ్యారు. గతేడాది సర్కారులో 60.01% మంది పాస్ కాగా, లాస్టియర్ కంటే 26% పాస్ పర్సెంటేజీ తగ్గింది. గతేడాది బీసీ వెల్ఫేర్లో 87.29%, ఎస్సీలో 79.97%, ఎస్టీలో 72.60% మంది ఫస్టియర్లో పాస్ కాగా, ఈ ఏడాది ఈ మూడు డిపార్ట్మెంట్లలోనూ గతేడాది కంటే రిజల్ట్ భారీగా తగ్గింది. అన్ని గురుకులాల్లో కలిపి గతేడాది 76 శాతానికి పైగా ఉంటే, ఈ ఏడాది 52 శాతం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. టీఎస్ఆర్జేసీలో మాత్రమే 78% హయ్యెస్టు పాస్ పర్సంటేజీ వచ్చింది. మోడల్ స్కూల్స్, కేజీబీవీల్లోనూ 45%లోపే స్టూడెంట్లు పాసయ్యారు.
