- కేంద్రానికి తుమ్మల సూచన
హైదరాబాద్, వెలుగు: విత్తన చట్టంలో రైతుల హక్కులకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు డిమాండ్చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విత్తన ముసాయిదా చట్టం-2025పై రాష్ట్రాలు డిసెంబర్ 11లోపు అభిప్రాయాలు తెలపాలని కేంద్రం కోరిన నేపథ్యంలో, బుధవారం సెక్రటేరియెట్‌లో మంత్రి ఉన్నతాధికారులతో సమావేశమై తుది నివేదికను ఆమోదించారు.
రైతుల ప్రయోజనాలు, సంప్రదాయ విత్తన రక్షణ, నకిలీ విత్తనాల నిర్మూలన, పరిహార విధానం వంటి కీలక అంశాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రం బలమైన సవరణలు, కొత్త నిబంధనలు సూచించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “తెలంగాణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు విత్తనోత్పత్తి వెన్నెముక.
వేలాది మంది రైతులు సంప్రదాయ రకాలతో పాటు అధిక నాణ్యత గల విత్తనాల ఉత్పత్తి, సంరక్షణలో భాగస్వాములుగా ఉన్నారు. కానీ నకిలీ, నాసిరకం, అనుమతి లేని విత్తనాల వల్ల పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల రైతులు గత దశాబ్ద కాలంలో భారీ నష్టాలు వచ్చాయి. పెట్టుబడి ఖర్చులు పెరగడం, హైడ్రీడ్ -బీటీ విత్తనాల వైఫల్యాలతో వ్యవసాయ కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయారు”అని ఆవేదన వ్యక్తం చేశారు.

