సొంత పార్టీ ఎమ్మెల్యేల దెబ్బకు జీరో అవర్‌ రద్దు

సొంత పార్టీ ఎమ్మెల్యేల దెబ్బకు జీరో అవర్‌ రద్దు
  • ప్రశ్నల మీద ప్రశ్నలడిగిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
  • రెండ్రోజులు సమస్యలపై నిలదీత.. ఉక్కిరిబిక్కిరైన సర్కారు 
  • సీఎంను కలిసే చాన్స్‌ లేక సభలోనే ప్రశ్నిస్తున్నారన్న నేతలు

మా సెగ్మెంట్‌‌లో రోడ్లేస్తరా వెయ్యరా అని ఒకరు.. మా నియోజకవర్గాన్ని పట్టించుకోరా అని మరొకరు.. నా సొంతూరుకు రోడ్డేయించలేదంటూ జనం తిడ్తున్నరని ఇంకొకరు.. ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు. రెండ్రోజుల పాటు ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆ దెబ్బకు సర్కారు ఆగమాగమైంది. వీళ్లు ఇట్లే ప్రశ్నలడిగితే ప్రభుత్వం పరువు పోతుందని ఏకంగా జీరో అవర్‌‌నే ఎత్తేసింది.
   
రెండ్రోజులు.. 46 సమస్యలు

ఈనెల 20, 22 తేదీల్లో అసెంబ్లీలో జీరో అవర్ నిర్వహించారు. రెండు రోజుల్లో సుమారు 46 అంశాలను సభ్యులు సభలో ప్రస్తావించారు. రెండు, మూడు అంశాలపై విపక్ష పార్టీల సభ్యులు మాట్లాడారు. మిగతా సమస్యలను టీఆర్ఎస్ సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. తమ సెగ్మెంట్లలో మస్తు సమస్యలున్నాయని, పట్టించుకోరా అని నిలదీశారు. రాష్ట్రంలో సమస్యల్లేవని, జనం సంతోషంగా ఉన్నారని సభలో మంత్రులు చెబుతుంటే.. సమస్యలతో ఇబ్బందిపడుతున్నామని ఎమ్మెల్యేలు చెప్పడం సర్కారుకు ఇబ్బందిగా మారింది. ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సింది పోయి ప్రాబ్లమ్స్‌‌పై నిలదీయడంపై ప్రగతిభవన్ వర్గాల్లో చర్చ జరిగినట్టు తెలిసింది. జీరో అవర్‌‌లో ఎక్కువ మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో ఎక్కువ సమస్యలు ఫోకస్ అవుతున్నాయని ఓ మంత్రి చెప్పారు. కేసీఆర్‌‌ను కలిసే అవకాశం లేక అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తున్నారని అన్నారు. 

జీరో అవర్‌‌లోని సమస్యలకు అన్సర్ ఇవ్వరా?

జీరో అవర్‌‌లో సభ్యులు ప్రస్తావించే సమస్యలకు ప్రభుత్వం నుంచి రాతపూర్వక సమాధానాలు రావట్లేదని టీఆర్ఎస్‌‌కు మద్దతిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్రవెంకట వీరయ్య అన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో తము అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ లేదని ఆవేదన చెందారు. సభలో మంత్రులు నోట్ చేసుకుంటున్నట్టు చెప్తున్నారే  తప్ప ఆన్సర్‌‌ రావట్లేదన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు జోక్యం చేసుకుని.. సంబంధిత శాఖల కార్యదర్శులు జీరో అవర్‌‌లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలివ్వాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చామన్నారు. 

ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలివే
అసలు రోడ్లేయరా?: రేగా కాంతరావు
నా నియోజకవర్గం పినపాకలో అనేక గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నయి. వాటిని మరమత్తు చేస్తరా లేదా? ఎప్పుడో శాంక్షనైనా పనులు చేయట్లేదు. 

డయాలిసిస్ సెంటర్ ఏమైంది?: ఆత్రం సక్కు
నా నియోజకవర్గం అసిఫాబాద్‌కు డయాలిసిస్ సెంటర్ రెండేళ్ల క్రితం మంజూరు చేశారు. ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. అస్పత్రుల్లో సిబ్బంది కొరత వల్ల గిరిజనులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

మాటిచ్చి అమలు చేయట్లేదు: దుర్గం చెన్నయ్య
నిరుపయోగంగా ఉన్న సింగరేణి భూములు, ఆస్తులను తీసుకుని ప్రజలకు ఇస్తామని ప్రభుత్వం మాటిచ్చింది. కాని అమలు చేయడం లేదు. 

పదేళ్లుగా జూరాల గేట్లు రిపేర్ చేయట్లే: కృష్ణమోహన్‌రెడ్డి 
జూరాల రిజర్వాయర్‌ గేట్లను పదేళ్లుగా రిపేర్‌ చేయలేదు. దీంతో నీళ్లు లీకవుతున్నాయి. గద్వాల -గట్టు ఎత్తిపోతల పథకాలు చేపట్టాలి.

సొంతూరికి రోడ్డేయించలేదని విమర్శిస్తున్నరు: జైపాల్ యాదవ్
సొంతూరికి రోడ్డు అద్వానంగా మారింది. ఎమ్మెల్యేగా ఉండి కూడా రోడ్డేయించలేదని గ్రామ ప్రజలు విమర్శిస్తున్నారు.

ఉప్పల్ కారిడార్ పనులు స్లో: బేతి సుభాష్‌ రెడ్డి
చర్లపల్లి ఫ్లై ఓవర్‌ నిర్మాణం పదేళ్లుగా పూర్తవట్లేదు. ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు స్లోగా జరుగుతున్నాయి. దీంతో వరంగల్‌ వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

బాసర త్రిపుల్ ఐటీలో మస్తు సమస్యలు: విఠల్‌రెడ్డి
బాసర త్రిపుల్ ఐటీలో మస్తు సమస్యలున్నాయి. టీచింగ్ స్టాఫ్‌ కొరత ఉంది. ఉన్న స్టాఫ్‌కు సరిగా జీతాల్లేవు. పూర్తి కాలం వీసీని నియమించాలి.

కరెంట్ తీగలతో ప్రాణాలు పోతున్నయ్: ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి
దేవరకంద్ర నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో కరెంట్ తీగలు ఇండ్ల పైనే ఉంటున్నాయి. పని కోసం ఇండ్లపైకి ఎక్కి ప్రమాదవశాత్తు షాక్ తగిలి చనిపోతున్నారు. వాటిని తొలగించేందుకు చొరవ చూపాలి.