త్వరలో బీజేపీ థర్డ్ లిస్ట్ .. గ్రేటర్ సీట్లపై కమలం కసరత్తు

త్వరలో బీజేపీ థర్డ్ లిస్ట్ .. గ్రేటర్ సీట్లపై కమలం కసరత్తు
  • కిషన్ రెడ్డి నివాసంలో ముఖ్యనేతల భేటీ
  • బీసీ సీఎం నినాదంతో పార్టీలో కొత్త ఊపు
  • రేపు ఢిల్లీ వెళ్లనున్న బీజేపీ రాష్ట్ర నాయకులు
  • జాతీయ నాయకత్వంతో చర్చించాకే క్లారిటీ

హైదరాబాద్: బీజేపీ మూడో జాబితాపై కసరత్తు మొదలు పెట్టింది. 52 మందితో ఈ నెల 21న జాబితా విడుదల చేసిన బీజేపీ.. నిన్న మహబూబ్ నగర్ సెగ్మెంట్ కు ఏపీ మిథున్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తూ రెండో జాబితాను విడుదల చేసింది. ఇంకా 66 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇందులో పొత్తులో భాగంగా జనసేనకు 10–12 స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. మిగతా సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఇవాళ కాచిగూడలోని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి నివాసంలో ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ సమావేశమయ్యారు. భేటీ అయ్యారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలోని సీట్లపై చర్చ జరిగినట్టు సమాచారం. కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కో సీటు కోసం ఇద్దరి నుంచి నలుగురు పోటీ పడుతున్నారు. వారిలో గెలుపు అవకాశాలున్న అభ్యర్థి ఎవరు? ఎవరికి టికెట్ కేటాయించాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి సారంగపాణి, బండ కార్తీక టికెట్ ఆశిస్తున్నారు. శేరిలింగంపల్లి సెగ్మెంట్ నుంచి యోగానంద్ టికెట్ ఆశిస్తుండగా.. ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కూకట్ పల్లి, జూబ్లీహిల్స్ లో దీపక్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుంటే డాక్టర్ వీరపనేని పద్మ కూడా రేసులో ఉన్నారు. 

బీసీ సీఎం నినాదంతో కొత్త ఊపు

బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామన్న హోం మంత్రి అమిత్ షా ప్రకటనతో పార్టీలో కొత్త ఊపు వచ్చింది. ఎక్కువ మంది బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలే బీజేపీలో ఉండటం, మొదటి జాబితాలో కూడా బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. అమిత్ షా ప్రకటన ప్రత్యర్థి పార్టీలను గందరగోళంలో పడేసిందని చెబుతున్నారు. బీసీల ఓట్లు గంపగుత్తగా తమకే పడుతాయనే ధీమాతో ఉన్న కమలనాథులు ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బీసీ ఫ్యాక్టర్ బాగా కలిసొస్తుందని భావిస్తున్నారు. 

జనసేనకు 10–12 సీట్లు?

రెండు రోజుల క్రితం అమిత్​షాతో పవన్ కల్యాణ్​, కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. జన సే న 20 సీట్లు అడుగుతోంది. 10 నుంచి 12 సీట్లు ఇస్తామని చెప్పినట్టు సమాచారం. ఏయే సీట్లు ఇవ్వాలనే అంశంపైనా చర్చించినట్టు సమాచారం. పొత్తులో బాగంగా జనసేనకు కేటాయించే స్థానాల్లో టికెట్లు ఆశించే నాయకులతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో నేతలు పార్టీని వీడకుండా బుజ్జగించే అవకాశం ఉంది. 

రేపు ఢిల్లీకి రాష్ట్ర నాయకులు

మూడో జాబితాను సిద్ధం చేసుకున్న తర్వాత రాష్ట్ర నాయకులు రేపు ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ జాతీయ నాయకత్వంతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. రేపు సాయంత్రానికి మూడో లిస్టుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ALSO READ : 6 సెగ్మెంట్లలో నా అభ్యర్థులు.. యుద్ధానికి ఆయుధంతో సిద్ధంగా ఉన్నం: జంగా రాఘవ రెడ్డి