పాత స్కీము​లతో కొత్త బడ్జెట్

పాత స్కీము​లతో కొత్త బడ్జెట్

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల ఏడాది వేళ రాష్ట్ర సర్కారు సోమవారం భారీ బడ్జెట్​తో జనం ముందుకు వచ్చింది. ఇందులో ఎలాంటి కొత్త పథకాలకు చోటివ్వలేదు. 2018 ఎన్నికల మేనిఫెస్టో నుంచి చెప్తూ వస్తున్న నిరుద్యోగ భృతిని పక్కనపడేసింది. గిరిజన బంధు ఊసెత్తలేదు. డబుల్​ బెడ్రూం ఇండ్ల ముచ్చట్నే లేదు. దళిత బంధు, సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకునేందుకు చేసే సాయం, రుణ మాఫీ, రీజినల్​ రింగ్​ రోడ్డుకు నిరుడు లెక్కనే కేటాయింపులు జరిపింది. వీటికి గత కేటాయింపుల నుంచి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. ఈ నెల 17న కేసీఆర్​బర్త్​ డే నాడు ప్రారంభించే కొత్త సెక్రటేరియెట్​కు మాత్రం ప్రస్తుత బడ్జెట్​లో రూ.400 కోట్లు పెట్టింది. భారీ బడ్జెట్​లో బీసీలకు కేటాయించింది అంతంతే. మొత్తంగా చూస్తే రాష్ట్ర సర్కారు గొప్పలు, కేంద్రంపై విమర్శలతో పాత పద్దుకు కొత్త రంగును అద్దినట్లు బడ్జెట్​ ఉందని ప్రతిపక్షాలు విమర్శించాయి. 

సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల సాయం చేస్తామని బడ్జెట్​లో ప్రభుత్వం తెలిపింది. ఈ సాయానికి కేంద్రం నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రూ.1,300 కోట్ల మేర ఫండ్స్ వస్తున్నాయని పేర్కొంది. సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకునే స్కీమ్​కు రూ.12 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది. డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. పంట రుణమాఫీకి మూడేండ్లుగా కేటాయింపులు జరుపుతున్నా.. మాఫీ పూర్తి కాలేదు. రూ.లక్ష లోపు ఉన్న పంట రుణాలన్నింటన్నీ మాఫీ చేసేలా కేటాయింపులు జరగలేదు. 

నిరుటి కన్నా రూ.34 వేల కోట్లు ఎక్కువ

రూ. 2,56,861 కోట్లతో నిరుడు మార్చి 7న 2022–23 బడ్జెట్​ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పుడు ​అదనంగా దాదాపు రూ.34 వేల కోట్ల మేర పెంచి.. 2,90,396 కోట్లతో 2023–24 బడ్జెట్​ను తెచ్చింది.

కొత్త ఈహెచ్ఎస్ విధానం

కొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని 2023–24 ఆర్థిక సంవత్సరంలో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తామని, ఇందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వాములుగా చేయనున్నట్లు బడ్జెట్​లో పేర్కొంది. విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామంది. 

వర్సిటీల్లో మౌలిక వసతులకు రూ. 500 కోట్లు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో మౌలిక వసతుల కల్పన, హాస్టల్ భవనాల ఆధునీకరణ, కొత్త భవనాల నిర్మాణం కోసం రూ.500 కేటాయిస్తున్నట్లు హరీశ్​ తెలిపారు. రాష్ట్రంలో జేఎన్టీయూ పరిధిలో 4 కొత్త ఇంజినీరింగ్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. వీటిలో సిరిసిల్ల, వనపర్తి  కాలేజీలు ఇప్పటికే ప్రారంభం కాగా..  త్వరలోనే మహబూబ్ నగర్, కొత్తగూడెంలో ప్రారంభిస్తామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్​ అంతర్జాతీయ ప్రమాణాలతో హెల్త్ సిటీ నిర్మాణాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఇందులో భాగంగా రూ.1,100 కోట్ల ఖర్చుతో రెండు వేల బెడ్ల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్  భవన నిర్మాణ పనులు అవుతున్నాయన్నారు.  

రాయదుర్గం – ఎయిర్​పోర్ట్​ మెట్రోకు 500 కోట్లు

శంషాబాద్ ఎయిర్​పోర్టులో సంవత్సరానికి 4 కోట్ల మంది ప్రయాణం చేసినా సరిపడే విధంగా విమానాశ్రయ విస్తరణ పనులు రూ. 7,500 కోట్లతో జరుగుతున్నాయని మంత్రి హరీశ్​ తెలిపారు. ఆ పనులు ఈ ఏడాది జూన్ లోపల పూర్తయి, ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయన్నారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి మొదలై శంషాబాద్ ఎయిర్​పోర్టుకు  రూ. 6,250 కోట్ల వ్యయంతో చేపట్టే మెట్రో కారిడార్​ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతోనే వచ్చే మూడేండ్లలో పూర్తి చేస్తుందని చెప్పారు. దీనికి ఈ సారి రూ.500 కోట్లు కేటాయిస్తున్నామని, పాతబస్తీలో మిగిలిన మెట్రో పనుల కోసం రూ.500 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ మెట్రోకు ఇంకో రూ.1,500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.  

ఈ ఏడాదే సీతారామ ప్రాజెక్టు

ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి హరీశ్​ చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే సీతారామ ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ లో 1,200 మెగావాట్ల సామర్థ్యానికి అదనంగా 8,085 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. నల్గొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి ప్రారంభం కానుందని తెలిపారు.

ఏప్రిల్​ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్​

ప్రభుత్వంలో 80,039 పోస్టులకు సంబంధించి వివిధ కేటగిరీల భర్తీ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతున్నదని మంత్రి హరీశ్​రావు అన్నారు. కొత్తగా రిక్రూట్ అయ్యే ఉద్యోగుల జీతభత్యాల కోసం ఈ బడ్జెట్​లో రూ.1000  కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ ఉంటుందని ప్రకటించారు. దాదాపు 11 వేల మంది కాంట్రాక్టు ఎంప్లాయీస్ ఉన్నట్లు తెలిపారు. సెర్ప్​ ఉద్యోగుల కోసం కొత్తగా ఏప్రిల్ నుంచి పే స్కేల్ తెస్తామని తెలిపారు.