
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో పోటీచేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరుగుతోన్న కెబినెట్ ..తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 21(3) ని సవరించేందుకు ఇటీవల కేబినెట్ నిర్ణయించింది. ఈ ఫైల్ పై పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి సీతక్క, సీఎం రేవంత్ ఇప్పటికే సంతకం చేశారు. ఇవాళ కేబినెట్ ఆమోదించడంతో ఆ ఫైల్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపనున్నారు. గవర్నర్ సంతకం తర్వాత ఆర్డినెన్స్ జారీచేయనున్నారు.
1994లో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం 1994 తర్వాత మూడో సంతానం కలిగితే వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు. ఏపీ నుంచి తెలంగాణ విడిపోయాక 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇద్దరు పిల్లల నిబంధనను టచ్ చేయలేదు.
పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారు అనర్హులు. అయితే.. ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు కోరాయి. 2024 డిసెంబర్ 20న జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన రాగా మంత్రి వర్గం ఆమోదించలేదు. తాజాగా ఇవాళ జరిగిన కేబినెట్..పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేతకు ఆమోదం తెలిపింది.