హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బస్వాపూర్ రిజర్వాయర్ సవరించిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 11.39 టీఎంసీల సామర్థ్యంతో 23 వేల ఎకరాలకు నీళ్లిచ్చేలా రిజర్వాయర్ నిర్మాణానికి 2017లో ప్రభుత్వం రూ.1751 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అనంతరం 2017 లోనే పీఎల్ఆర్ జాయింట్ వెంచర్ టెండర్ దక్కించుకుంది. 2019 లో రూ.1578.57 కోట్లతో ప్రభుత్వంతో సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది. కానీ ప్రభుత్వం ఇచ్చిన అంచనాల్లో తొలుత భూసేకరణను చేర్చలేదు. దీంతో పాటు వర్క్ కంపోనెంట్ పనుల ధరలు పెరిగాయి.
ఈ నేపథ్యంలోనే అంచనా వ్యయాన్ని ఇరిగేషన్ అధికారులు రూ.919 కోట్లు పెంచాలని ప్రతిపాదించారు. మొత్తం అంచనా వ్యయాన్ని రూ.1751 కోట్ల నుంచి రూ.2670 కోట్లకు పెంచాలని ప్రతిపాదించగా గురువారం జరిగిన క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ఎక్కువగా భూసేకరణ, పరిహారం కోసం రూ.534.25 కోట్లను రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో ప్రతిపాదించారు. వర్క్ కంపోనెంట్ వ్యయాన్ని రూ.1600.98 కోట్ల నుంచి రూ.1704.12 కోట్లకు పెంచారు. ప్రైస్ అడ్జస్ట్మెంట్కింద మరో 191.07 కోట్లు పెంచారు. పన్నులు రూ.61.95 కోట్లు, ఇతర పనులకు మరో రూ.23.14 కోట్లుగా రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో పేర్కొన్నారు.
రిజర్వాయర్ కోసం 4291.20 ఎకరాల భూములను సేకరించాలని నిర్ణయించగా అందులో ఇప్పటికే 2474 ఎకరాలు సేకరించారు. మరో 1816 ఎకరాలు సేకరించాల్సి ఉంది. మొత్తం భూసేకరణకు రూ.750 కోట్లు అవసరం కాగా వాటిలో 400 కోట్లు ఇప్పటికే చెల్లించారు. మరో 350 కోట్లు అవసరం. తిమ్మాపూర్, లప్పానాయక్ తండా, చోక్ల నాయక్ తండాల్లో 1535 కుటుంబాలను తరలించాల్సి ఉండగా.. 382.70 కోట్ల పరిహారం చెల్లించేలా నిర్ణయించారు. ఇందులో 1048 కుటుంబాలను తరలించారు. మరో 487 కుటుంబాలను తరలించాల్సి ఉండగా.. రూ.182 కోట్లు పరిహారం కింద చెల్లించాల్సి ఉంది.

