- సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీబీఐ డైరెక్టర్‌ను కలవాలని కేబినెట్ నిర్ణయం
- హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణుల సలహా మేరకు ముందుకు
- వంద రోజుల్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు
- అవసరమైతే ప్రజాప్రతినిధుల జీతాల్లో 50 శాతం కోత
- పీపీపీ పద్ధతిలో గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి..
- సీటింగ్ సామర్థ్యం 50 వేలకు పెంపు
- స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
- రాష్ట్రంలోని ప్యాక్స్‌కు నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాల నియామకం
- చిన్న కాళేశ్వరం భూసేకరణకు రూ.166.67 కోట్లు
- రాష్ట్ర కేబినేట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
- మీడియాకు వెల్లడించిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, వాకిటి శ్రీహరి
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేపట్టేలా కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలోనే ఢిల్లీ వెళ్లి సీబీఐ డైరెక్టర్ ను కలిసేందుకు మంత్రి మండలి ఓకే చెప్పింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఢిల్లీ న్యాయ నిపుణుల సలహా
తీసుకోనున్నారు.
అభిషేక్ సింఘ్వీ వంటి వారిని సంప్రదించాక సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ ఏకాభిప్రాయానికి వచ్చింది. రిటైర్డ్ ఉద్యోగులు ఆఫీసుల చుట్టూ, సచివాలయం చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా వారి బకాయిలను వెంటనే చెల్లించేలా తగిన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇక రాష్ట్రంలో పదవీ కాలం పూర్తయిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు (ప్యాక్స్) నామినేట్ పద్ధతిలో పాలకవర్గాలను నియమించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గచ్చిబౌలి స్టేడియాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సెక్రటేరియెట్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన కేబినెట్‌సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి మీడియాకు వెల్లడించారు.
కమిషన్ చట్టబద్ధమే.. సాంకేతిక అంశాలనే కోర్టు తప్పుపట్టింది
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును మంత్రివర్గం క్షుణ్ణంగా పరిశీలించిందని, కమిషన్ నియామకం చట్టబద్ధమని కోర్టు స్పష్టంగా చెప్పిన విషయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, లోపాలు, అక్రమాలపై దర్యాప్తు చేపట్టాలని సీబీ ఐని రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ జీవో చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కానీ, తొమ్మిది నెలలైనా సీబీఐ దర్యాప్తు ప్రారంభం కాలేదన్నారు.
హైకోర్టు తీర్పు సీబీఐ దర్యాప్తునకు ఎలాంటి అడ్డూ కాదని న్యాయ నిపుణులు తెలియజేశారన్నారు. కేవలం పిటిషనర్లకు నోటీసులు ఇవ్వలేదనే సాంకేతిక కారణాలతోనే హైకోర్టు కొన్ని అంశాలను తప్పుబట్టిందని, కానీ కమిషన్ విచారణను గానీ, నివేదికను గానీ అడ్డుకోలేదని, వాటి ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే తీర్పునిచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
అవసరమైతే ప్రజా ప్రతినిధుల జీతాల నుంచి 50 శాతం ఇద్దాం
గతంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టి వెళ్లిందని మంత్రి పొంగు లేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. రిటైర్మెంట్ ఏజ్ పెంచటంతో పాటు రిటైర్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోవటంతో రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు.
రిటైర్డ్ ఉద్యోగులు ఆఫీసుల చుట్టూ, సచివాలయం చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా వెంటనే వారికి ఇచ్చే బకాయిల చెల్లింపులకు తగిన చర్యలు చేపట్టాలని కేబినెట్నిర్ణయం తీసుకుందన్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి రూ.6,200 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు రూ.8 వేల కోట్లు పెండిం గ్ ఉన్నాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనందున ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి, అవసరమైన నిధులు సర్దుబాటు చేయాలని మంత్రివర్గం భావించిందన్నారు.
అవసరమైతే తమ జీతాలు, ప్రజా ప్రతినిధులకు ఇచ్చే జీతాల నుంచి 50 శాతం రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే సర్దుబాటు చేయాలని మంత్రులందరూ సూచించినట్లు మంత్రి తెలిపారు. రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు, బాధ్యులైన వారందరినీ పిలిచి చర్చలు జరపాలని, వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వంద రోజుల్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు దిశగా తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించిందని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
మరికొన్ని కేబినెట్ నిర్ణయాలు
గచ్చిబౌలి స్టేడియాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 76 ఎకరాల్లో 64 ఎకరాల్లో 21 రకాల స్పోర్స్‌కు సంబంధించిన సౌకర్యాలు కల్పించడంతో పాటు అవుట్ డోర్ స్టేడియం సామర్థ్యం 20 వేల నుంచి 50 వేలకు పెంచాలని నిర్ణయించింది. స్విమ్మింగ్ పూల్ సామర్థ్యం పెంపుతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడాకారులకు వసతి, శిక్షణ సౌకర్యాలు కల్పించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మిగిలిన 12 ఎకరాలను డెవలపర్స్ కు ఇచ్చి కమర్షియల్ యాక్టివిటీస్ ద్వారా వచ్చే రెవెన్యూను స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్వహణ, క్రీడాకారుల వసతి, శిక్షణ ఇతర కార్యక్రమాలకు ఉపయోగించాలని కేబినెట్ నిర్ణయించింది.
g మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజల చిరకాల కోరిక చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మహాదేవ్‌పూర్, కాటారం, మల్హర్ రావు, మహాముత్తారం మండలాల్లో దాదాపు 45 వేల ఎకరాలకు, 63 గ్రామాల ప్రజలకు ఈ ప్రాజెక్టుతో ప్రయోజనం చేకూరుతుంది. భూసేకరణ కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు 2,427 ఎకరాల భూమి అవసరం. ఇప్పటివరకు 1,020 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూసేకరణకు అవసరమయ్యే రూ.166.67 కోట్ల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్‌కు చెందిన 85.10 ఎకరాలను మత్స్య శాఖకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
కాళేశ్వరం పేరిట బీఆర్ఎస్ చేయని పాపం లేదు
కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరిట గత ప్రభుత్వం చేయని పాపం లేదని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద రూ.38 వేల కోట్లతో తలపెట్టిన ప్రాజెక్టును, అప్పటి సీఎం కేసీఆర్ తానే ‘కర్త, కర్మ, క్రియ’ అని చెప్పుకుంటూ అశాస్త్రీయంగా మేడిగడ్డకు మార్చారని ఆరోపించారు. ప్రాజెక్టు అంచనాలను ఏకంగా రూ.1.47 లక్షల కోట్లకు పెంచేసి ప్రజల సొమ్మును దోచుకున్నారని, మేడిగడ్డ కుంగిపోవడంతో ఇయ్యాల చుక్క నీరు కూడా ఇచ్చుకోలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో భూముల ధరలు తక్కువగా ఉన్నా, ఉద్దేశపూర్వకంగానే తుమ్మిడిహెట్టిని కాదని మేడిగడ్డను ఎంచుకోవడం వెనుక పెద్ద కుట్ర ఉందని పేర్కొన్నారు. రూ.97 వేల కోట్లు ఖర్చు చేసినా కనీసం లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందలేదని సీఏజీ నివేదికలో తేలిందని, ఈ చారిత్రక తప్పిదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు నిద్రపోయే ప్రసక్తే లేదని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు.

