హైదరాబాద్, వెలుగు: కులగణన వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచడం ద్వారా పారదర్శకత కు, సామాజిక న్యాయానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. బుధవారం మంత్రులు సెక్రటేరియెట్లో మీడియాతో మాట్లాడారు. కేంద్రం కూడా తెలంగాణ కులగణన నమూనాను తీసుకోవాలని సూచించారు. దశాబ్దాలుగా కులగణనపై మాటలకే పరిమితమైన కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యస్పదమన్నారు.
నిజమైన డేటా బయటకు వస్తే వారి రాజకీయ అసత్యాలు బహిర్గతమవుతాయని భయంతోనే ఈ విమర్శలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వెనుకబడిన వర్గాల వాస్తవ పరిస్థితులు స్పష్టంగా బయటపడతాయని, ఇప్పటి వరకు కేవలం వాగ్దానాలకే పరిమితమైన నాయకుల నిజస్వరూపం ప్రజలకు అర్థమవుతుందని తెలిపారు. కులగణన డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచడం వల్ల అభివృద్ధి పథకాలు నిజంగా అర్హులైన వారికి చేరేలా చేయడం సులభమవుతుందని అన్నారు.
కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిజాయితీతో, ధైర్యంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన కులగణన సమగ్ర సమాచారాన్ని పబ్లిక్ డొమైన్ పెట్టడం మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పబ్లిక్ డొమైన్ ఉన్న డేటాను తీసుకునేందుకు ప్రతిఒక్కరికీ అవకాశం ఉందన్నారు.

