మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: 2025–26 ఖరీఫ్, రబీ సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ ను గడువు లోగా ఎఫ్ సీఐకి అందచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ ఆదేశించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించిన ఆయన పలు రైస్ మిల్లులను తనిఖీ చేశారు. భూత్పూర్ మండలంలోని భాను పారా బాయిల్డ్ రైస్ మిల్, తాటికొండలోని నరహరి పారా బాయిల్డ్ రైస్ మిల్లులో మిల్లింగ్, బియ్యం నిల్వలు, సీఎంఆర్ సరఫరా, డెలివరీపై ఆరా తీశారు.
ఈ సందర్బంగా డైరెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా వడ్లను బియ్యంగా మార్చే ప్రక్రియను స్పీడప్ చేయాలని మిల్లర్లను ఆదేశించారు. నిబంధనల ప్రకారం మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్ లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన డీసీఎస్‌వోలు, సివిల్ సప్లై జిల్లా మేనేజర్లు, ఎఫ్‌సీఐ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.
