- నేటి నుంచి దిగ్గజ కంపెనీల సీఈవోలతో భేటీ
- ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ రంగాలపై దృష్టి
- ప్రపంచ వేదికపై ‘తెలంగాణ రైజింగ్
- విజన్–2047’ డాక్యుమెంట్ ప్రజెంటేషన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు చేరుకుంది. సోమవారం ప్రారంభమైన ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా అధికారుల బృందం అక్కడికి చేరుకుంది. అప్పటికే అక్కడున్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వీళ్లకు స్వాగతం పలికారు. సోమవారం ఉదయం మేడారంలో సమ్మక్క,- సారక్కకు మొక్కులు చెల్లించుకున్న సీఎం.. అనంతరం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా దావోస్ బయలుదేరి వెళ్లారు. ఆయన వరుసగా మూడోసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు.
దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు..
దావోస్ వేదికగా నాలుగు రోజుల పాటు (ఈ నెల 19-–24) జరగనున్న ఈ సదస్సులో సీఎం బిజీబిజీగా ఉండనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ‘ఫార్చూన్ 100’ కంపెనీలపై ప్రధానంగా దృష్టిసారించనున్నారు. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో గూగుల్, సేల్స్ ఫోర్స్, యూనిలీవర్, హనీవెల్, లోరియల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి అంతర్జాతీయ సంస్థల అధిపతులతో వరుసగా భేటీ కానున్నారు. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ రంగాల్లో రాష్ట్రాన్ని హబ్‌గా మార్చేందుకు ఆయా రంగాల ప్రముఖులతో చర్చలు జరపనున్నారు.
ప్రపంచ వేదికపై ‘విజన్ 2047’..
దావోస్ వేదికపై ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్-–2047’ ను సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. క్యూర్, ప్యూర్, రేర్ విధానాలను ఆయా కంపెనీలకు తెలియజేయనున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపార అవకాశాలు, ఐటీ, ఏఐ , లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని, భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచ పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు. సీఎం బృందంలో ఉన్నతాధికారులు జయేశ్ రంజన్, సంజయ్ కుమార్, అజిత్ రెడ్డి ఉన్నారు.
