- హైదరాబాద్ నుంచి నిర్దేశిత సమయంలో చేరేలా ప్రణాళికలు
- ప్రభుత్వ శాఖలు ఈవీ వెహికల్స్‌నే కొనాలి
- బోధనాసుపత్రులు, పెద్దాసుపత్రుల నిర్మాణాలు త్వరగా పూర్తి కావాలి
- రవాణా శాఖ ఆదాయం పెరిగే మార్గాలపై దృష్టి పెట్టాలి
- ఆర్ అండ్ బీ, రవాణా శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబద్, వెలుగు: ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కాలుష్య రహిత రవాణా లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వంలోని ఏ శాఖ అయినా ఇక నుంచి తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆర్ అండ్ బీ శాఖపై బుధవారం రివ్యూ నిర్వహించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్లను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడానికి కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలన్నారు. ఆయా జిల్లా కేంద్రాలకు సమీపంలో రోడ్లుంటే వాటిని అనుసంధానించి రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆయా జిల్లా కేంద్రాల నుంచి రింగు రోడ్లకు అనుసంధానించేలా రేడియల్ రోడ్లు నిర్మించాలన్నారు. హైదరాబాద్–విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే నుంచి నాగార్జున సాగర్ చేరేందుకు గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణాలు పూర్తి చేయాలని, అవసరమైన కొత్త నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. బోధనాసుపత్రులు, ఇతర టిమ్స్‌లాంటి పెద్దాసుపత్రుల నిర్మాణలను త్వరగా పూర్తి చేయాలన్నారు.
హైస్పీడ్ రైలు కారిడార్ సమీపంలో బస్ టెర్మినల్
క్యూర్ పరిధిలోని ప్రభుత్వ శాఖల పరిధిలో అద్దెలకు తీసుకునే వాహనాలు సైతం ఈవీలే ఉండాలని సీఎం స్పష్టం చేశారు. రవాణా శాఖలో మాన్యువల్ పద్ధతులకు స్వస్తి చెప్పాలని.. మొత్తం ఆన్‌లైన్‌లోనే కార్యకలాపాలు కొనసాగించాలన్నారు. ఆర్‌టీవో కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని, వెంటనే సొంత భవనాల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. శంషాబాద్ సమీపంలో హైస్పీడ్ రైలు కారిడార్ ప్రారంభమయ్యే ప్రాంతంలో అధునాతన బస్ టెర్మినల్ కు స్థలం కేటాయిస్తామని.. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఆర్ అండ్ బీ స్పెషల్‌సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
