
సుబ్రమణ్యన్ స్వామిపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
దిష్టిబొమ్మ దగ్ధం
రాహుల్ గాంధీ కొకైన్ తీసుకుంటాడని సుబ్రమణ్యన్ స్వామి చేసిన వ్యాఖ్యలకు నిరసన గా గాంధీ భవన్ ముందు ఆయన దిష్టిబొమ్మను దగ్దం చేశారు కాంగ్రెస్ నాయకులు దాసోజు శ్రవణ్, మల్లురవి, అనిల్ కుమార్ యాదవ్ లు. సుబ్రమణ్యన్ స్వామి వ్యాఖ్యలపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ స్పందిస్తూ.. బీజేపీ దేశ వ్యాప్తంగా నీచమైన రాజకీయాలకు పాల్పడుతుందని అన్నారు. నీతి నిజాయితీ లకు మారుపేరైన రాహుల్ గాంధీ పై సుబ్రమణ్యన్ స్వామి దుర్భాషలాడినా ఆయనపై ఆ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రాహుల్ ను కించపరచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గానూ అబిడ్స్ పోలీసు స్టేషన్లో సుబ్రమణ్యన్ స్వామి మీద ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
బీజేపీ కి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. సుబ్రహ్మణ్య స్వామి మీద చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.
పెళ్లిలో అక్షింతలు వేయమంటే పెళ్లి కూతురికి తాళి కట్టబోయిన సుబ్రహ్మణ్యస్వామి.. రాహుల్ గాంధీని విమర్శించడం సూర్యుడి పైన ఉమ్మి వేయడం లాంటిదన్నారు యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్. సుబ్రహ్మణ్య స్వామి దేశంలో ఎక్కడా తిరక్కుండా అడ్డుకుంటామని అనిల్ అన్నారు.
రాహుల్ గాంధీపై కొకైన్ వ్యాఖ్యలు చేయడంతో స్వామిపై ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.