- తాజాగా వేటగాళ్ల ఉచ్చుకు చిరుతపులి బలి
- గతంలోనూ ఉమ్మడి జిల్లాలో పెద్దపులుల హతం
- యథేచ్ఛగా సాగుతున్న వన్యప్రాణుల వేట
మంచిర్యాల, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా జన్నారం డివిజన్ తాళ్లపేట రేంజ్ పరిధిలో చిరుతపులిని చంపడంతో పెద్దపులుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కవ్వాల్ పరిధిలో ఏడు నుంచి ఎనిమిది టైగర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట రేంజ్ పరిధిలోని ర్యాలీ అడవుల్లో ఒక ఫిమేల్ టైగర్ రెండేండ్లుగా ఆవాసం ఏర్పర్చుకుంది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి ఫారెస్ట్‌లో మరో టైగర్ ఉండగా, కాగజ్‌నగర్ ఫారెస్ట్‌లో మూడు పెద్దపులులు తిరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి ఏరియాలో మరో టైగర్ తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు ఇటీవల గుర్తించారు. మరో రెండింటిలో ఒకటి సిద్దిపేట, మరొకటి నిజామాబాద్ జిల్లా వైపు వెళ్లాయి. ప్రస్తుతం ఫారెస్ట్ ఆఫీసర్లు సీసీ కెమెరాలు, టైగర్ ట్రాకర్స్ ద్వారా ఆరు పులుల మూమెంట్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నట్లు చెబుతున్నారు. కానీ, వన్యప్రాణుల వేటగాళ్లు పనిలో పనిగా పులులు, చిరుతలనూ చంపుతుండడంతో వాటి రక్షణపై ఆందోళన వ్యక్తమవుతోంది.
గతంలోనూ పెద్దపులుల వేట..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలోనూ పెద్దపులులను వేటాడిన ఉదంతాలు ఉన్నాయి. 2016లో కోటపల్లి మండలం పిన్నారం అడవుల్లో కరెంట్ షాక్ తగిలి ఒక పులి చనిపోయింది. 2019లో జైపూర్ మండలం శివ్వారం ఫారెస్ట్‌లో బెంగాల్ రాయల్ మేల్ టైగర్ వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు బలైంది. దీని వెనుక మహారాష్ట్రలోని చంద్రాపూర్ గ్యాంగ్ ఉన్నట్లు ఫారెస్ట్ అధికారుల దర్యాప్తులో తేలింది. అలాగే 2014లో చెన్నూర్‌లో ఓ పెద్దపులి చర్మం లభించగా, 2017లో జన్నారానికి చెందిన ఐదుగురు పులి చర్మం విక్రయించేందుకు వెళ్తూ పట్టుబడ్డారు.
మూడేండ్ల కింద బెల్లంపల్లి మండలం రంగంపేటలో మరో పెద్దపులిని చంపి పాతిపెట్టిన ఘటన వెలుగు చూసింది. కుమ్రంభీంఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం ఆగర్‌గూడ ఫారెస్ట్ ఏరియాలో కే8 పెద్దపులి వేటగాళ్ల ఉచ్చులో చిక్కి ప్రాణాలు విడిచింది. తాజాగా తాళ్లపేట రేంజ్‌లోని ఊట్ల ఏరియాలో వన్యప్రాణుల వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుతపులి చిక్కగా, దానిని చంపి గోర్లు, చర్మం, ఇతర శరీర భాగాలను అమ్మడానికి యత్నించారు. ఈ క్రమంలోనే ఫారెస్ట్ అధికారులు ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేయడం తెలిసిందే.
కరెంట్ వైర్లు, ఉచ్చులతో ముప్పు..
కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణుల వేటగాళ్లతో పెద్దపులులు, చిరుతలకు ప్రమాదం పొంచి ఉన్నట్లు తాజా ఘటనను బట్టి తెలుస్తోంది. గతంలో పులుల వేటలో ప్రొఫెషనల్ హంటర్స్ ఉన్నట్లు తేలినప్పటికీ, ఇటీవల అటువంటి ఘటనలు కనిపించలేదు. కానీ, వన్యప్రాణుల వేటగాళ్లతోనే వాటికి ముప్పు ఉందని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని అటవీ ప్రాంత గ్రామాల వేటగాళ్లతో కొంత మంది చేతులు కలిపి వన్యప్రాణులను హతమార్చుతున్నారు.
అడవిలోనే గుట్టుచప్పుడు కాకుండా చర్మం వొలిచి మాంసాన్ని పట్టణాలకు తరలించి కిలో రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు అమ్ముతున్నారు. పట్టణ ప్రాంతాల్లో జింకలు, దుప్పులు, కొండగొర్రెలు, కుందేళ్ల మాంసానికి భారీగా డిమాండ్ ఉంది. దీంతో వేటగాళ్లు అటవీ ప్రాంతంలో కరెంట్ వైర్లతో షాక్ పెట్టి, క్లచ్ వైర్లతో ఉచ్చులు పెట్టి జంతువులను చంపుతున్నారు.
గత నెలలో బెల్లంపల్లి మండలం చాకెపల్లిలో కొంతమంది దుప్పిని వేటాడి మాసం కోస్తుండగా, ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకున్నారు. కరెంట్ షాక్‌తోనే దుప్పిని చంపినట్లు గుర్తించారు. అదే రోజు వేమనపల్లి మండలం బద్వెల్లి శివారులో వన్యప్రాణుల వేట కోసం కరెంట్ తీగలు అమర్చిన ముగ్గురు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లాలోని జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి, హాజీపూర్ మండలాల్లో జింకలు, దుప్పుల వేట జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం ఎండకాలం కావడంతో అడవుల్లో నీళ్లు దొరక్క వన్యప్రాణులు దూప తీర్చుకోవడానికి జనావాసాల వైపు వస్తుంటాయి. అదే క్రమంలో పెద్దపులులు, చిరుతలు సైతం అడవుల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఫారెస్ట్ అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
వేట కేసులను దాచిపెడుతున్నారా?
గతంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వన్యప్రాణుల వేట విచ్చలవిడిగా సాగింది. ఆ తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్లు నిఘా పెంచడంతో కొంత వరకు కంట్రోల్ అయింది. కానీ, ఇటీవల మళ్లీ అడ్డూ అదుపు లేకుండా వేట కొనసాగుతోంది. ఫారెస్ట్ ఆఫీసర్లు హంటింగ్ కేసులు బయటకు రాకుండా దాచిపెడుతున్నట్లు తెలుస్తోంది.
ఫీల్డ్ లెవల్లో పని చేసే కొంత మంది అధికారులు గ్రామాల్లో ఇన్ఫార్మర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని హంటింగ్ కేసుల సమాచారం అందిస్తున్నా, హయ్యర్ ఆఫీసర్లు వాటిని తొక్కిపెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. కేసుల సంఖ్య పెరిగితే తమ పనితీరుపై ప్రభుత్వానికి, ఉన్నతాధికారులు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో చేతులు దులుపుకుంటున్నారని సమాచారం.
