- వ్యాపారవేత్తలు, పొలిటీషియన్లతో వీకెండ్ పార్టీలు
- గోవా, సిమ్లా నుంచి కొకైన్ సహా నిషేధిత డ్రగ్స్ సప్లయ్
- ఈగల్ ఫోర్స్ దర్యాప్తులో సంచలన విషయాలు
- శనివారం రాత్రి పార్టీలో కొకైన్‌తో చిక్కిన రోహిత్‌రెడ్డి,
- ఏపీ ఎంపీ మహేశ్, ప్రియాంకరెడ్డిసహా 11 మంది అరెస్ట్
- ఎంపీ మహేశ్ కుమార్, ప్రియాంకరెడ్డికి స్టేషన్ బెయిల్
- రోహిత్‌రెడ్డి సహా ముగ్గురిని జడ్జి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు.. 14 రోజులు రిమాండ్
- ఫామ్‌హౌస్‌ను సీజ్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం!
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోహిత్‌రెడ్డి తన ఫామ్‌హౌస్‌లో వ్యాపారవేత్తలు, పొలిటీషయన్లతో వీకెండ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారని, ఫారిన్ లిక్కర్, డ్రగ్స్ సహా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చారని ఈగల్ ఫోర్స్ దర్యాప్తులో బయటపడింది. ఫామ్‌హౌస్ గుట్టు తెలియకుండా బయట ప్రైవేట్ సెక్యూరిటీ, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి వీకెండ్ పార్టీ జరుగుతున్న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌పై ఈగల్ ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో రెయిడ్స్ చేసిన విషయం తెలిసిందే.
డ్రగ్స్ యూరిన్ టెస్ట్‌లో రోహిత్‌రెడ్డితోపాటు మరో నలుగురికి పాజిటివ్ నిర్ధారణ కాగా, మహేశ్‌కుమార్‌కు మాత్రం బ్లడ్ శాంపిల్స్ టెస్టులో డ్రగ్ తీసుకున్నట్టు బయటపడింది.దీంతో వీరందరిపై ఎన్‌డీపీఎస్‌తోపాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో రోహిత్ రెడ్డి, ఏపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్ సహా 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహించడంతోపాటు తన లైసెన్స్‌డ్ ఆయుధాన్ని దుర్వినియోగం చేసినందుకుగానూ మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితోపాటు ఆయన సోదరుడు రితేశ్‌రెడ్డిని, డ్రగ్స్ మత్తులో కాల్పులు జరిపిన ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మను ఉప్పర్‌పల్లి కోర్టు జడ్జి నివాసంలో ఆదివారం హాజరుపరిచారు.
ముగ్గురికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుల తరఫున వేసిన బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేశారు. మొదటిసారి పట్టుబడడంతోపాటు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీ మహేశ్‌కుమార్‌కు స్టేషన్ బెయిల్ లభించింది. అలాగే, ఫామ్‌హౌస్‌లో పట్టుబడ్డ ఫిల్మ్‌నగర్‌కు చెందిన ప్రియాంకరెడ్డి సహా మరో ఐదుగురికి జడ్జి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా..
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం సహా రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపార లావాదేవీలకు రోహిత్‌రెడ్డి తన ఫామ్‌హౌస్‌ను అడ్డాగా చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే గతంలోనూ పలు పార్టీల్లో డ్రగ్స్ సహా ఇతర ఇల్లీగల్ కార్యకలాపాలు నిర్వహించినట్టు అనుమానిస్తున్నారు. ఈ మేరకు రోహిత్‌రెడ్డి సహా పార్టీలో పాల్గొన్న వారి ప్రొఫైల్, ట్రాక్ రికార్డులను పరిశీలిస్తున్నారు. కాగా, ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి పోలీసులు సోదాలు జరుపుతున్న సమయంలో రోహిత్‌రెడ్డి పీఏ శ్రవణ్.. తన ఫోన్‌తో పాటు రోహిత్‌రెడ్డి సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేసినట్టు తెలిసింది.
ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీల వివరాలు బయటపడకూడదనే ఉద్దేశంతోనే శ్రవణ్‌కుమార్ ఆ ఫోన్లను ధ్వంసం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ధ్వంసం చేసిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించి.. డేటా రిట్రీవ్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు అడ్డాగా మారిన ఫామ్‌హౌస్‌ను సిటీ పోలీస్ యాక్ట్ కింద సీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు స్థానిక ఆర్డీవోకు ప్రతిపాదనలు పంపిస్తామని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఫామ్‌హౌస్‌లో ‘ఆపరేషన్ కొకైన్ డ్రగ్’ ఇలా..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు శనివారం రాత్రి 9.40 గంటలకు ఈగల్ ఫోర్స్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్, మొయినాబాద్ పోలీసులు వెళ్లారు. ఫామ్ హౌస్‌ను చుట్టుముట్టారు. బయట గేట్లకు తాళాలు వేసి ఉండడంతో గోడ దూకి ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించారు. అక్కడే స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్న స్థలంలో పార్టీ జరుగుతున్నట్టు గుర్తించారు. ‘‘మేం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ నుంచి వచ్చిన పోలీసులం.. అక్రమ మాదకద్రవ్యాల గురించి మాకు విశ్వసనీయ సమాచారం ఉంది.. సెర్చ్ వారెంట్‌తో వచ్చాం.. సోదాలు చేస్తాం..” అని అనౌన్స్ చేశారు.
ఆ వెంటనే, ఫామ్‌హౌస్‌లోని ఓ ప్రాంతం నుంచి ఒక షార్ట్ కాల్పులు జరిపినట్లు శబ్దం వినిపించింది. దీంతో ఈగల్ ఫోర్స్ పోలీసులు మళ్లీ అనౌన్స్ చేశారు. సెర్చెస్‌కు సహకరించాలని హెచ్చరించారు. కాల్పుల శబ్దం వినిపించిన స్థలానికి చేరుకున్నారు. ఫామ్‌హౌస్ వాష్ రూమ్ ముందు ఉన్న నమిత్ శర్మ వద్ద జర్మన్ మేడ్ 0.32 రివాల్వర్ ఒక లైవ్ రౌండ్, ఒక ఖాళీ బుల్లెట్ సెల్ గుర్తించారు. మరో మూడు ఖాళీ బుల్లెట్ సెల్స్‌లను సిల్వేరి శరత్‌కుమార్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. నమిత్ శర్మ ఢిల్లీకి చెందిన వ్యాపారిగా, వికారాబాద్‌కు చెందిన శరత్‌కుమార్.. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఫామ్ హౌస్ ఓనర్ రోహిత్ రెడ్డి డ్రైవర్‌గా గుర్తించారు. ఖాళీ బుల్లెట్ సెల్స్ గురించి ఆరా తీశారు. వాటిని తన యజమాని రోహిత్‌రెడ్డి ఇచ్చినట్లు శరత్‌కుమార్ పోలీసులకు వివరించాడు. నమిత్ శర్మ వద్ద రివాల్వర్, శరత్‌కుమార్ వద్ద ఖాళీ బుల్లెట్ సెల్స్ సీజ్ చేశారు.
పట్టుబడ్డ మిగిలిన కొకైన్
స్విమ్మింగ్ పూల్ పక్కన ఏర్పాటు చేసిన సోఫాల మధ్య రెండు టేబుల్స్ వద్ద మద్యం సేవిస్తున్న రోహిత్ రెడ్డి, ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్, ఫిల్మ్‌నగర్‌కు చెందిన మహిళ ప్రియాంక రెడ్డి సహా అక్కడున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్కరినీ విచారించారు. డ్రగ్స్ గురించి ఆరా తీశారు.
ఈ క్రమంలోనే రోహిత్‌రెడ్డి డ్రైవర్ శరత్‌కుమార్ తన వద్ద కొకైన్ ప్యాకెట్లను పోలీసులకు అందించాడు. తన యజమాని రోహిత్ రెడ్డి స్నేహితుడు కౌశిక్ రవి ఈ కొకైన్ ప్యాకెట్లను ఇచ్చాడని చెప్పాడు. పార్టీలోని కొంతమంది సభ్యులకు అందించిన తర్వాత మిగిలిన కొకైన్ తన ప్యాంట్ పాకెట్ జేబులో పెట్టుకున్నానని వాంగ్మూలం ఇచ్చాడు. ఈ మేరకు పోలీసులు కౌశిక్ రవిని ప్రశ్నించారు.
డిన్నర్ చేయడానికి వెళ్ల..
నాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాకు తెలిసిన కొంతమంది ఎప్పటి నుంచో నన్ను కలవాలి అనుకుంటున్నారు. వారు హైదరాబాద్ వచ్చారని తెలిసి కలవడానికి ఫామ్ హౌస్ కు వెళ్లాను. అక్కడే నైట్ డిన్నర్ చేద్దామనుకున్నాం. ఏలూరు ప్రజల నమ్మకాన్ని నేను వమ్ము చేయను.
- పుట్టా మహేశ్ యాదవ్, ఎంపీ, ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుడు
డ్రగ్ పరీక్ష పాజిటివ్ వచ్చింది వీరికే..
- పంజుగుల రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
- పుట్టా మహేశ్ కుమార్ యాదవ్, ఎంపీ, ఏలూరు, ఏపీ
- పంజుగుల రితేశ్ రెడ్డి, మణికొండ (రోహిత్ రెడ్డి తమ్ముడు)
- తిరువీధుల అర్జున్ రెడ్డి, పబ్ నిర్వాహకుడు, పుప్పాలగూడ
- కౌశిక్ రవి, న్యాయవాది, బెంగళూరు
- నమిత్ శర్మ, వ్యాపారి , ఢిల్లీ
- పార్టీలో పాల్గొన్న మిగతా సభ్యులు
- మోరవినేని రమేశ్, వ్యాపారి, మణికొండ
- వరమచనేని శ్రవణ్ కుమార్, మణికొండ
- నల్లపనేని విజయ కృష్ణ, వ్యాపారి, అమీర్‌పేట్
- ఆర్. ప్రియాంక రెడ్డి, గృహిణి, ఫిల్మ్‌నగర్
- సిల్వేరి శరత్ కుమార్, రోహిత్‌రెడ్డి డ్రైవర్, వికారాబాద్
పక్కా సమాచారంతో వెళ్లాం..
మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో పార్టీ జరుగుతున్నట్లు మాకు సమాచారం అందింది. పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నట్టు తెలిసింది. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో సోదాలు చేశాం. అదే సమయంలో లోపలి నుంచి కాల్పుల సౌండ్ వినిపించింది. నమిత్ శర్మ అనే ఢిల్లీకి చెందిన వ్యక్తి డ్రగ్స్ మత్తులో గాల్లోకి కాల్పులు జరిపాడు.
అతని వద్ద రివాల్వర్‌తో పాటు నాలుగు ఖాళీ కార్ట్రిడ్జ్‌లు, రోహిత్ రెడ్డి డ్రైవర్ వద్ద కొకైన్ స్వాధీనం చేసుకున్నాం. రోహిత్‌రెడ్డితోపాటు స్పాట్‌లోనే మరో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎన్‌డీపీఎస్, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం.
- గిరిధర్, ఎస్పీ, ఈగల్ ఫోర్స్
సిమ్లాలో కొకైన్ కొనుగోలు..
బెంగళూరుకు చెందిన కౌశిక్ రవిని న్యాయవాదిగా ఈగల్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. రోహిత్‌రెడ్డికి తాను స్నేహితుడినని కౌశిక్ రవి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తన బిజినెస్ టూర్‌లో భాగంగా ఇటీవల సిమ్లాకు వెళ్లినట్లు వెల్లడించాడు. సిమ్లాలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి కొకైన్ కొన్నానని, అదే కొకైన్ ఈ పార్టీకి తీసుకువచ్చానని అంగీకరించాడు. ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీలో సప్లయ్ చేయగా మిగిలిన కొకైన్ శరత్ కుమార్ వద్ద పెట్టినట్టు తెలిపాడు.
వీరిద్దరు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌యాదవ్, మరో 9 మందికి యూరిన్ కిట్ ద్వారా డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. డ్రగ్ టెస్ట్‌లో రోహిత్‌రెడ్డి, కౌశిక్ రవి, రోహిత్‌రెడ్డి సోదరుడు రితేశ్ రెడ్డి, ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్ శర్మ, తిరువీధుల అర్జున్ రెడ్డికి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఫామ్ హౌస్‌లో కొకైన్, లిక్కర్‌ను సీజ్ చేశారు.
