హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి వ్యవసాయం, అనుబంధ రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం 27 మంది సభ్యులతో ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం జీవో నెం.427 జారీ చేసింది. రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి కమిటీకి అధ్యక్షత వహించనుండగా, వ్యవసాయ శాఖ డైరెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
వ్యవసాయం, విద్య, అటవీ, పశుసంవర్ధక, సాగునీరు, ఇంధనం, హార్టీకల్చర్, పంచాయతీరాజ్, సెర్ప్, మార్క్‌ఫెడ్, నాబార్డ్, ఐక్రిశాట్, ఐఎండీ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెటర్నరీ, హార్టీకల్చర్ వర్సిటీల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. కమిటీ రాష్ట్రం నుంచి గ్రామ స్థాయి వరకు కంటింజెన్సీ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి, అన్ని భాగస్వామ్య వర్గాలతో సమావేశాలు నిర్వహించనుంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి, నివారణ చర్యలపై ప్రభుత్వానికి నివేదికలు, సిఫార్సులు సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
