V6 News

గాంజా, డ్రగ్స్అమ్మితే ఏడాది జైలు : సీఎం రేవంత్‌‌‌‌

గాంజా, డ్రగ్స్అమ్మితే ఏడాది జైలు : సీఎం రేవంత్‌‌‌‌
  •     మత్తు పదార్థాలు వాడితే  అడ్మిషన్లు కట్: సీఎం రేవంత్‌‌‌‌
  •     విద్యాసంస్థల్లో సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధన
  •     డ్రగ్స్ మహమ్మారిని అంతానికి పీస్​ కమిటీలు పనిచేయాలి 
  •     మంత్రి సీతక్కతో కలిసి స్పందన టీమ్స్‌‌‌‌ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: మహిళలకు రక్షణ, చిన్నపిల్లలకు భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతని, వారు సురక్షితంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. 

ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కనీసం 50 శాతం ఉండాలని సూచించారు. అది సాధ్యం కావాలంటే వారికి పూర్తి స్థాయి భద్రత కల్పించడం అనివార్యమని పేర్కొన్నారు. సోమవారం కమాండ్​ కంట్రోల్​ సెంటర్‌‌‌‌‌‌‌‌లో మంత్రి సీతక్క, డీజీపీ శివధర్ రెడ్డి,హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌‌‌‌‌‌‌‌తో కలిసి స్పందన టీమ్స్‌‌‌‌ను సీఎం రేవంత్‌‌‌‌ ప్రారంభించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బాధితుల కోసం 24/7 అందుబాటులో ఉండే ‘స్పందన’ ప్రత్యేక బృందాన్ని సీఎం అభినందించారు. డయల్ 100 లేదా 112కు ఫోన్ చేసిన వెంటనే పోలీసులు బాధితుల వద్దకు చేరుకొని తక్షణ రక్షణతోపాటు మానసిక ధైర్యాన్ని అందించడం ఈ టీమ్ ప్రధాన ఉద్దేశమని వివరించారు.

మహిళలపై నేరాలకు కారణం డ్రగ్స్‌‌‌‌, గంజాయే..

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలకు ప్రధాన కారణం డ్రగ్స్, గంజాయి, మద్యంలాంటి వ్యసనాలేనని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.  మహిళలపై జరుగుతున్న దాడుల్లో 80 శాతానికి పైగా మత్తుకు బానిసలైన వారే చేస్తున్నారని, ఈ వ్యసనాలను అరికట్టకుండా మహిళలకు పూర్తి రక్షణ కల్పించడం సాధ్యం కాదని  అభిప్రాయపడ్డారు. అందుకే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ‘ఈగల్ ఫోర్స్’ను ఏర్పాటు చేసి డ్రగ్స్‌‌‌‌పై యుద్ధం ప్రకటించిందని తెలిపారు. డ్రగ్స్ వ్యవహారంలో రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, ఉన్నతాధికారులు.. ఇలా ఎంతటి వారైనా సరే విడిచిపెట్టే ప్రసక్తి లేదని, హోదా చూడకుండా అరెస్ట్ చేసి జైలుకు పంపాలని పోలీసులను ఆదేశించారు. 

మత్తు పదార్థాలను విక్రయించేవారిని కనీసం ఏడాది పాటు బయటకు రాకుండా కఠినంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. సమాజంలో డ్రగ్స్ మహమ్మారిని అంతం చేసేందుకు పీస్ కమిటీ సభ్యులు చురుగ్గా పాల్గొనాలని రేవంత్ రెడ్డి కోరారు. ఒకప్పుడు మత సామరస్యం కోసం పనిచేసిన ఈ కమిటీలు, ఇప్పుడు గల్లీల్లో గంజాయి విక్రయాలను అడ్డుకోవాలని సూచించారు. విద్యాసంస్థల్లో ప్రవేశాల సమయంలోనే ‘డ్రగ్స్ వాడబోం’ అనే సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకునేలా కొత్త నిబంధన తీసుకురానున్నట్టు వెల్లడించారు.

మహిళలపై వివక్ష చూపితే కఠిన చర్యలు..

మహిళలపై వివక్ష చూపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సమాజంలో మహిళలకు తోడుగా నిలిచేందుకు ‘స్టాండ్ విత్ హర్’ అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలని సీఎం రేవంత్‌‌‌‌ పిలుపునిచ్చారు.  మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరు మీదనే మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఆస్తి మహిళల పేరు మీద ఉన్నప్పుడే వారికి సామాజిక భద్రత లభిస్తుందని చెప్పారు.

రాష్ట్రంలోని 67 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ. 60 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను అందిస్తూ వారిని వ్యాపార భాగస్వాములను చేస్తున్నామని, వారి ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌‌‌‌కు పరిచయం చేసేందుకు అమెజాన్‌‌‌‌లాంటి గ్లోబల్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 10 వేల కోట్లు వెచ్చించిందని పేర్కొన్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి, వారిని గౌరవంగా చూసుకున్నప్పుడే రాష్ట్ర ప్రగతి సాధ్యమని వెల్లడించారు.