హైదరాబాద్, వెలుగు: గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా తరలించే 148 టీఎంసీల్లో తమకు 74 టీఎంసీలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీని నిర్మిస్తే.. అక్కడి నుంచి మరో 200 టీఎంసీలు తరలించుకునే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేసింది. ఇటీవల నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) గవర్నింగ్ బాడీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో తెలంగాణ వాదనలను ఎన్‌డబ్ల్యూడీఏ వినలేదు.
ఈ క్రమంలోనే మూడ్రోజుల క్రితం ఎన్డబ్ల్యూడీఏకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. నిరుడు ఆగస్టులో నిర్వహించిన ఆరో కన్సల్టేషన్ మీటింగ్‌లో చెప్పిన అంశాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. జీసీ లింక్‌ను తెలంగాణ భూ భాగం నుంచి చేపడుతున్నప్పుడు.. తమ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. 45 టీఎంసీలే ఇస్తామంటే కుదరదని పేర్కొంది. అంతేగాకుండా ఏపీ చేపడుతున్న నాలుగు ఇంట్రా లింక్ ప్రాజెక్టులైన చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, బాబు జగ్జీవన్ రామ్ సుజల స్రవంతి, వైఎస్ఆర్ పల్నాడు డ్రాట్ మిటిగేషన్ స్కీమ్, గుండ్రేవుల రిజర్వాయర్లకు అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ చేసింది.
పోలవరం బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని, ఏపీ కోరుతున్నట్టుగా పోలవరం నుంచి గోదావరి కావేరి లింక్‌ను చేపట్టొద్దని డిమాండ్ చేసింది. గోదావరి నదిలో తమకున్న 968 టీఎంసీల జలాలపై హక్కులకు రక్షణ కల్పించాలని కోరింది. ఇచ్చంపల్లి నుంచి తరలించే నీళ్లను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయొద్దని, తమకు కావాల్సిన చోట వాడుకుంటామని తేల్చి చెప్పింది. జీసీ లింక్లో భాగంగా కృష్ణా బేసిన్లో రెండు రిజర్వాయర్లను కట్టించి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
