హద్దురాళ్లు ఊడిపోయినా భూమికి రక్షణ

హద్దురాళ్లు ఊడిపోయినా భూమికి రక్షణ

డిజిటల్‌‌ సర్వేతో రైతుల భూములకు పూర్తి స్థాయి రక్షణ వస్తుందని రెవెన్యూ శాఖ కేబినెట్‌‌ దృష్టికి తీసుకువచ్చింది. ఆర్వోఆర్‌‌ చట్టం -2020 ప్రకారం రాష్ట్రంలోని 99 శాతం వ్యవసాయ భూములు ఎలాంటి సమస్యలు లేకుండా ధరణిలో నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు. రైతులు కాస్తులో ఉన్న భూములకు భౌతికంగా ఉండే హద్దురాళ్లు, కాగితాల మీద ఉండే టీపన్‌‌ నక్ష కొలతలతో అవే హద్దులుగా డిజిటల్‌‌ రూపంలోకి మారుతాయని వివరించారు. ఇకపై రాళ్లు ఊడిపోయినా, కాగితాలు చినిగిపోయినా రైతుల భూమి ఇంచు కూడా తేడా రాకుండా డిజిటల్‌‌ మ్యాప్‌‌ రక్షణ కల్పిస్తుందని తెలిపారు. ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లోని మూడు గ్రామాల చొప్పున 27 గ్రామాల్లో డిజిటల్‌‌ సర్వే చేసి.. వాటికి అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన హద్దులు నిర్వహించే సర్వే పైలెట్‌‌ ప్రాజెక్టుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. దీంతో ఇకపై వ్యవసాయ భూముల సెటిల్‌‌మెంట్‌‌ అనే వ్యవహారమే ఉత్పన్నం కాదని పేర్కొన్నారు.