హైదరాబాద్, వెలుగు: దేశంలోని పరీక్షల వ్యవస్థ మొత్తం విద్యా మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు చక్రధరరావు, కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్, కార్యనిర్వాహక కార్యదర్శి లక్ష్మీనారాయణ ఆరోపించారు. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ నేపథ్యంలో నీట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కై జైపూర్ వంటి ప్రాంతాల్లో పేపర్లను లీక్ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో 50 వేల మందికి సాఫ్ట్ మార్కులు ఇచ్చి 67 మందికి ఫస్ట్ ర్యాంకులు వచ్చేలా చేయడం ఎన్టీఏ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన ఒకే దేశం -ఒకే పరీక్ష విధానం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఇది కేవలం కార్పొరేట్ శక్తుల దోపిడీకే ఉపయోగపడుతోందన్నారు.
