
- అభ్యర్థులకు పార్టీల లీగల్ హెల్ప్
- అఫిడవిట్లలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు
- జిల్లాకు మూడు టీమ్‌లను ఏర్పాటు చేయనున్న కాంగ్రెస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అఫిడవిట్ ఫైల్ చేయడంలో అభ్యర్థులకు సాయం చేసేందుకు ప్రధాన పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఆయా పార్టీల లీగల్ సెల్స్ టీమ్స్ ద్వారా అభ్యర్థుల అఫిడవిట్లను దగ్గరుండి స్క్రూటినీ చేయనున్నాయి. అఫిడవిట్ల విషయంలో సమస్యలు తలెత్తి కోర్టుల దాకా వెళ్లాల్సి వస్తున్నది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డి విషయంలో అఫిడవిట్లు తప్పుగా వేశారంటూ కోర్టులో కేసులు దాఖలు అయ్యాయి. వనమా వెంకటేశ్వర రావు, కృష్ణమోహన్ రెడ్డి అభ్యర్థిత్వం రద్దు చేసే దాకా వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పార్టీలు ముందుగానే అలర్ట్ అయ్యాయి. అభ్యర్థులకు లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో అఫిడవిట్ ఫైలింగ్ చేయడంలో సాయం అందించనున్నాయి.
బీఆర్ఎస్ నుంచి మొదలు..
అన్ని పార్టీల కన్నా ముందుగానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. బీ ఫామ్స్ కూడా పంచుతున్నది. ఈ క్రమంలోనే ఫాంలు, అఫిడవిట్లు నింపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థులకు సీఎం కేసీఆర్ పదే పదే సూచించారు. దాంతో పాటు లీగల్ సాయం కోసం పార్టీ తరఫున ప్రతినిధిని నియమించారు. సోమ భరత్‌కు లీగల్ అభిప్రాయాల బాధ్యతలను అప్పగించారు. ఆయన ఫోన్ నెంబర్‌నూ అభ్యర్థులందరికీ ఓపెన్‌గా ప్రకటించారు. కోర్టు కేసులతో దెబ్బ పడింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకే కావడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈసారి అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచించారు.
జిల్లాకు మూడు టీములు
కాంగ్రెస్ కూడా అభ్యర్థుల విషయంలో ఈసారి జాగ్రత్తలు తీసుకుంటున్నది. పార్టీ నుంచి గెలిచాక జంప్ అవుతుండడంతో దానికి చెక్ పెట్టేలా కార్యాచరణను రూపొందిస్తున్నది. అఫిడవిట్లను జాగ్రత్తగా నింపడంతో పాటే.. అభ్యర్థుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ కూడా తీసుకోవాలని భావిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాకు రెండు మూడు లీగల్ టీములను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. పార్టీకి లీగల్ సెల్ ఉన్నప్పటికీ.. ప్రస్తుతం అందులో సభ్యులెవరూ లేరని పార్టీ లీడర్లు చెప్తున్నారు.
ఈ క్రమంలోనే త్వరలోనే లీగల్ టీమ్‌లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. వనపర్తి జిల్లాలో ఒకే ఒక్క నియోజకవర్గం ఉన్నది. అలా తక్కువ నియోజకవర్గాలున్న జిల్లాల్లో అవసరాన్ని బట్టి లీగల్ టీమ్‌లను నియమిస్తామని చెప్పారు. ఇటు బీజేపీ కూడా అభ్యర్థుల కోసం లీగల్ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రతి అభ్యర్థికో లీగల్ ఎక్స్‌పర్ట్‌ను నియమించి అఫిడవిట్లను ఫైల్ చేయించాలని భావిస్తున్నట్టు సమాచారం.