V6 News

పింఛన్లలో అక్రమాలకు చెక్..పట్టణాల్లోనూ పెన్షన్ల పంపిణీకి ఫేస్ రికగ్నిషన్

పింఛన్లలో అక్రమాలకు చెక్..పట్టణాల్లోనూ పెన్షన్ల పంపిణీకి ఫేస్ రికగ్నిషన్
  • నకిలీల ఏరివేత కోసం ప్రభుత్వం నిర్ణయం 
  • ప్రజాభవన్​లో డిస్ట్రిక్ట్​ కో ఆర్డినేటర్లు, మున్సిపల్  కమిషనర్లకు శిక్షణ పూర్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చేయూత పింఛన్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతున్న ఫేషియల్  రికగ్నిషన్  విధానాన్ని ఇకపై రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లోనూ అమలుకానుంది. ఈ విధానం ద్వారా పింఛన్ల పంపిణీలో ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సెర్ప్​ ఆఫీసర్లు భావిస్తున్నారు. ఈ కొత్త విధానం అమలుపై ఇటీవల ప్రజాభవన్‌‌‌‌‌‌‌‌లో మున్సిపల్  శాఖ ఉన్నతాధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా సమన్వయకర్తలు, మున్సిపల్  కమిషనర్లు, ఎంపీడీఓలు, ప్రాజెక్టు మేనేజర్లు, వార్డు అధికారులకు ఈ విధానంపై సమగ్ర శిక్షణ  ఇచ్చారు. ఇక్కడ శిక్షణ పొందిన అధికారులు తమ జిల్లాల్లోని సిబ్బందికి శిక్షణ ఇచ్చి, క్షేత్రస్థాయిలో ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తారని పట్టణ ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సీఈఓ దివ్య దేవరాజన్‌‌‌‌‌‌‌‌  తెలిపారు. చనిపోయిన లబ్ధిదారుల పేర్లతో కొందరు అక్రమంగా పింఛన్​ డబ్బులు స్వాహా చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.

గతంలో పింఛన్ల పంపిణీ సమయంలో వృద్ధుల వేలిముద్రలు ఫింగర్‌‌‌‌‌‌‌‌ ప్రింట్  స్కానర్లలో సరిగా నమోదు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తేవి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ఫేస్  రికగ్నిషన్  విధానాన్ని తీసుకొచ్చారు.

బ్యాంక్​ అకౌంట్​ ద్వారా పింఛన్​ పొందుతున్న లబ్ధిదారులపై దృష్టి

రాష్ట్రంలోని గ్రేటర్​ హైదరాబాద్​తో పాటు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో బ్యాంక్​ అకౌంట్​ ద్వారా చేయూత ఫించన్​ డబ్బులు తీసుకుంటున్న లబ్ధిదారుల వివరాలను ఫేషియల్  రికగ్నిషన్  ద్వారా సేకరిస్తారు. వారందరి వివరాలు సేకరించడం వల్ల లబ్ధిదారులు వేలిముద్రలతో పనిలేకుండా యాప్  ద్వారా సులభంగా తమ గుర్తింపును నమోదు చేసి పింఛన్  తీసుకోవచ్చు.

‘‘ఈ కొత్త టెక్నాలజీతో లబ్ధిదారులు జీవించి ఉన్నారా? వలసవెళ్లారా? అనే విషయాలు సులభంగా తెలిసిపోతాయి. వరుసగా మూడు నెలలు పింఛన్  తీసుకోని వారిని గుర్తించడం, చనిపోయిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడం వంటివి జరుగుతాయి. దాంతో అర్హులకే ప్రభుత్వ లబ్ధి అందేలా చూడడం ఈ మార్పు ప్రధాన ఉద్దేశం’’ అని దివ్య దేవరాజన్​ వివరించారు.