వర్ష బీభత్సంతో చెరువులైన పట్టణాలు.. తెగిన హైవేలు.. తల్లడిల్లిన జనం

వర్ష బీభత్సంతో చెరువులైన పట్టణాలు.. తెగిన హైవేలు.. తల్లడిల్లిన జనం
  • 50 ఏండ్లలో ఎన్నడూలేనంత వాన.. పోటెత్తిన వరద
  • కామారెడ్డి, మెదక్​ జిల్లాల్లో కుంభవృష్టి
  • ఉత్తర తెలంగాణను ముంచెత్తిన వర్షాలు.. నలుగురు మృతి, పలువురు గల్లంతు
  • అత్యధికంగా కామారెడ్డి జిల్లా అర్గొండలో 50 సెం.మీ. వర్షపాతం
  • రాజంపేట మండలంలో 12 గంటల్లో 40 సెం.మీ. నమోదు
  • పోచారం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. భిక్కనూరులో దెబ్బతిన్న రైల్వే ట్రాక్​
  • కొట్టుకుపోయిన వాహనాలు.. కూలిన ఇండ్లు.. చెరువులకు గండ్లు
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్​ ఏరియల్​ సర్వే
  • మరో మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వానలు: వాతావరణ శాఖ

హైదరాబాద్ / కామారెడ్డి / మెదక్​, వెలుగు: యాభై ఏండ్లలో ఎన్నడూ లేనంత వాన.. రెండు రోజులు రికాం లేకుండా కురిసింది! ఆ ధాటికి ఊర్లు, పట్టణాలు చెరువులయ్యాయి. కాలనీలు మునిగిపోయాయి. జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పుట్టకొకరు చెట్టుకొకరు అన్నట్లు చెల్లాచెదురయ్యాయి. బుధ, గురువారాల్లో ఉత్తర తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. ఆయా జిల్లాల్లోని పట్టణాలు, పల్లెలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. నిర్మల్​, సిద్దిపేట జిల్లాల్లోనూ వాన, వరద బీభత్సం సృష్టించాయి. ఇంటర్నల్​ రోడ్లు, హైవేలు కొట్టుకుపోయాయి. 

కామారెడ్డి జిల్లాలోని అర్గొండలో అత్యధికంగా 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్​, ఆదిలాబాద్​, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నూ అతి భారీ వర్షాలు పడ్డాయి. యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురి శాయి. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వాన పడింది. హైదరాబాద్​ సిటీలో పండుగ రోజంతా ముసురు కమ్మేసింది. 

రోడ్లు కోతకు గురవడంతో కామారెడ్డి, హైదరాబాద్​ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రెస్క్యూ టీమ్స్​ వెంటనే రంగంలోకి దిగి ఆయా జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 

రంగంలోకి ఎస్డీఆర్​ఎఫ్​, ఎన్డీఆర్​ఎఫ్​

వర్షాల ధాటికి స్టేట్​ డిజాస్టర్​ రెస్పాన్స్​ ఫోర్స్​, నేషనల్​ డిజాస్టర్​ రెస్పాన్స్​ ఫోర్స్​కు చెందిన 15 టీమ్​ల సిబ్బంది రంగంలోకి దిగారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సిబ్బంది మోహరించారు. వారితోపాటు ఆర్మీకి చెందిన తెలం గాణ, ఆంధ్ర సబ్​ ఏరియా (టీఏఎస్​ఏ)కి చెందిన వంద మందికిపైగా సిబ్బంది వరద ప్రాంతాల్లో రక్షణ చర్యల్లో పాల్గొంటున్నారు. 

రికార్డు స్థాయిలో వానలు

కామారెడ్డి జిల్లాలోని అర్గొండలో  అత్యధికంగా 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి వర్షపాతమని అధికారులు చెప్తున్నారు. గతంలో 2006 ఆగస్టు 5న కరీంనగర్​లోని శంకరంపట్నంలో అత్యధికంగా 41.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇప్పటిదాకా అదే హయ్యెస్ట్​ వర్షపాతం కాగా.. ఇప్పుడు కామారెడ్డిలోని అర్గొండలోని కురిసిన వర్షం ఆ లెక్కలను చెరిపేసింది.  అత్యధిక వర్షపాతం నమోదైన టాప్​ 3 ప్రాంతాలు కామారెడ్డిలోనే ఉండగా.. టాప్​8లో 7 ప్రాంతాలు ఆ జిల్లాలోనే ఉన్నాయి. 

కామారెడ్డి జిల్లా నాగారెడ్డిపేటలో 33.5 సెంటీమీటర్లు, కామారెడ్డిలో 33.5, బిక్కనూరులో 33, సదాశివనగర్​లో 32, లింగంపేటలో 31.6, తాడ్వాయిలో 31.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. నిర్మల్​ జిల్లా నిర్మల్​లో 33.3 సెంటీమీటర్లు, అక్కాపూర్​లో 32.5, మెదక్​ జిల్లా హవేలిఘనపూర్​లో 31.6, కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో 28.5, మెదక్​ జిల్లా చేగుంటలో 25.6, కామారెడ్డి జిల్లా దోమకొండలో 25.5, ఎల్లారెడ్డిలో 24.9, నిర్మల్​ జిల్లా లక్ష్మణ్​చందాలో 22.5, కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో 21.9, కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్​లో 21.6, మెదక్​ జిల్లా పాపన్నపేటలో 21.1, సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో 20.7, మెదక్​ జిల్లా రామాయంపేటలో 20.2, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్​లో 20.1, కొండపాకలో 19.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 

నిజామాబాద్​ జిల్లా ధర్పల్లిలో 19 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. మొత్తంగా ఈ రెండు రోజుల్లో కామారెడ్డిలోని 10 ప్రాంతాలు, నిర్మల్​లోని 4, మెదక్​లోని 6 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకుపైగా వర్షం పడింది. నిజామాబాద్​, సిద్దిపేట జిల్లాల్లోని మరో మూడు చోట్ల కూడా 20 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది. 

ఉపరితల ఆవర్తనంతో ఫ్లాష్​ ఫ్లడ్స్​

ఐఎండీ ఇచ్చే అలర్ట్స్​ తప్పుతున్నాయి. ప్రత్యేకంగా కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ఆ ప్రభా వం మాత్రం వేరే జిల్లాల్లో కనిపిస్తున్నది. ఉదాహరణకు రెండు రోజుల కింద జయ శంకర్​ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఐఎండీ అతిభారీ వర్ష సూచన చేసింది. కానీ.. కామారెడ్డి, మెదక్​ జిల్లాల్లో కుండ పోత వర్షం పడింది. ఆ తర్వాత అది నిర్మల్​ జిల్లాకు విస్తరించింది. మెల్లమెల్లగా సిద్దిపేట, నిజామాబాద్​ జిల్లాలకూ ఆ విపత్తు విస్తరించింది. 

దానికి కారణం.. వెదర్​ సిస్టమ్స్​లో సడన్​గా మార్పులు రావడమేనని అధికారులు చెప్తున్నారు. అప్పటికప్పుడు మేఘాలు కమ్ముకొచ్చి వర్షాలు పడి ఫ్లాష్​ఫ్లడ్స్​ విరుచుకుపడుతు న్నాయని చెప్తున్నారు. ఇప్పుడు వర్ష బీభత్సం సృష్టించిన జిల్లాల్లోనూ పర్యావ రణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపి స్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలర్ట్స్​ ఇచ్చే టైమ్​కు ఉంటున్న వాతావరణ పరిస్థితులు.. ఆ వెంటనే మారిపోతున్నా యని అంటున్నారు.

మెతుకుసీమ అతలాకుతలం

భారీ వర్షాలతో మెదక్​ జిల్లా అతలాకుతలమైంది. వరదలకు కొట్టుకుపోయి ఒకరు మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు. ఒక దగ్గర కారుతో పాటు వరదలో కొట్టుకుపోయిన ఒకరిని ఎస్​డీఆర్ఎఫ్​ రక్షించగా.. మరో దగ్గర వరద ప్రవాహంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రెస్క్యూ టీం కాపాడింది. మంగళవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారు జాము వరకు హవేలీ ఘనపూర్ మండలం సర్ధనలో అత్యధికంగా 31.6 సె.మీ, నాగాపూర్​ లో 2.8 , చేగుంటలో 23.1, రామాయంపేట, మెదక్​లో 20 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 
    
బుధవారం కామారెడ్డి జిల్లా తాండూర్​కు చెందిన నరేందర్ గౌడ్ కారులో మెదక్ వస్తుండగా హవేలి ఘనపూర్ మండలం నాగాపూర్​శివారులో నక్కవాగుపై నేషనల్ హైవే మీదుగా ఉధృతంగా వరద ప్రవహించడంతో కారు కొట్టుకుపోయింది. ఎస్ డీఆర్ఎఫ్ బృందాలు పడవ సాయతో రక్షించాయి. ఇదే మండల పరిధి రాజ్ పేట బ్రిడ్జి వద్ద వరదలో చిక్కుకున్న ఆ గ్రామానికి చెందిన ఎనిమిది మందిని బుధవారం రాత్రి మిలటరీ రెస్క్యూ టీం సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి.
    
పోచారం ప్రాజెక్ట్  ఉధృతంగా ప్రవహించడంతో ముందు జాగ్రత్తగా హవేలీ ఘనపూర్ మండలం సర్ధన గ్రామానికి చెందిన దాదాపు 600 మందిని మెదక్ లోని పునరావాస కేంద్రాలకు తరలించారు. 
    
రామాయంపేటలోని మహిళా డిగ్రీ కాలేజీ చుట్టూ నీరు చేరడంతో 300 మంది స్టూడెంట్లను మరో బిల్డింగ్ లోకి తరలించారు. మెదక్ లోని సాయి నగర్ కాలనీ, పిల్లి కోటాల సబ్ స్టేషన్ జలమయమైంది. గుండు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో హవేలీ ఘనపూర్ మండలం రాజ్ పేట తండా పరిధి కాప్రయపల్లి దూప్ సింగ్ తండా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇండ్లు, గుడిసెల్లోకి నీరు చేరడంతో రెండు వందల మంది గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. కొందరు డాబా పైకి ఎక్కి వర్షంలో తడుస్తూ అక్కడే ఉన్నారు. తండాకు నలువైపులా వరద ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నది. సుమారు ఆరు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగి పోయాయి. 
    
మెదక్ - బోధన్ రూట్​లో హవేలి ఘనపూర్​మండలం నాగపూర్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న నేషనల్ హైవే రోడ్డు నక్కవాగు ఉధృతికి కొట్టుకుపోయింది. నిజాంపేట మండలం నందిగామ వద్ద రోడ్డు కొట్టుకు పోవడంతో రామాయంపేట - సిద్ది పేట రూట్లో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. 
    
పాపన్నపేట మండలం ఎల్లాపూర్ బ్రిడ్జిపై నుంచి మంజీరా ప్రవహిస్తుండటంతో మెదక్ - బోడ్ మట్ పల్లి రూట్​లో , మెదక్​ నుంచి మక్త భూపతిపూర్ వెళ్లే రూట్​లో పుష్పాల వాగు బ్రిడ్జి డ్యామేజీ అయి రాకపోకలు నిలిచిపోయాయి. 
    
సింగూర్ ప్రాజెక్ట్​ గేట్లు ఎత్తడంతో ఏడుపాయల మళ్లీ జల దిగ్బంధంలో చిక్కుకుంది. 

కామారెడ్డి కకావికలం

బుధ, గురువారాల్లో కుండపోత వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా కకావికలమైంది. వరదలతో ఈ జిల్లాలో ఇద్దరు చనిపోగా, ఒకరు గల్లంతయ్యారు. 
    
రాజంపేట మండలంలో 12 గంటల్లో ఏకంగా 4‌‌‌‌0 సెం.మీ. వర్షపాతం నమోదైంది. గత 50 ఏండ్లలో గంటల వ్యవధిలో ఇంత భారీ వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదు. ఈ ధాటికి నేషనల్​హైవే 44,  స్టేట్ హైవేలు, జిల్లా రోడ్లు, బ్రిడ్జీలు, రైల్వే ట్రాక్​లు కొట్టుకుపోయాయి. 
    
కామారెడ్డి జిల్లా కేంద్రం జలదిగ్బంధమైంది. పెద్ద చెరువు అలుగు పారడంతో జీఆర్​కాలనీలో పలు ఇండ్లు గ్రౌండ్​ఫ్లోర్​వరకు మునిగిపోయాయి. దీంతో అందరూ ఫస్ట్ ఫ్లోర్​కు వెళ్లి సాయం కోసం అర్థించారు. రెస్య్కూ టీమ్స్​ చేరుకొని  బాధితులను తాళ్ల సాయంతో, భూజాలపై మోస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సరంపల్లి చౌరస్తా దగ్గర ఎస్టీ రెసిడెన్సియల్ స్కూల్​ఆవరణలోకి వరద చేరడంతో స్టూడెంట్లను హుటాహుటిన అక్కడి నుంచి తరలించారు. హౌసింగ్​ బోర్డు కాలనీ వద్ద పెద్దవాగు ప్రవాహంలో ఐదు కార్లు కొట్టుకుపోయాయి. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో14 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వందలాది మందిని తరలించారు. 
    
ప్రాథమిక అంచనా ప్రకారం కామారెడ్డి జిల్లావ్యాప్తంగా  93,925 ఎకరాల్లో వరి, పత్తి, మక్క, సోయా, కూరగాయల పంటలు నీటమునిగాయి. 58 పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 10 చెరువుల కట్టలు తెగిపోగా, 40  చెరువులకు గండ్లు పడ్డాయి. మూడు కెనాల్స్​ దెబ్బతిన్నాయి. 3‌‌5 గ్రామాలకు కరెంట్​సప్లయ్​నిలిచిపోగా గురువారం మధ్యాహ్నం వరకు 23  గ్రామాలకు పునరుద్ధరించారు. 13 ఇండ్లు పూర్తిగా కూలిపోగా.. 31‌‌ ఇండ్లు ‌‌పాక్షికంగా దెబ్బతిన్నాయి. 
    
భిక్కనూరుకు సమీపంలోని ఎడ్లకట్ట వాగు భారీగా ప్రవహించడంతో హైదరాబాద్ నుంచి నాగ్ పూర్​వెళ్లే  హైవే 44పై నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. జంగంపల్లి వద్ద  వరద నిలవగా పోలీసులు రాత్రి వరకు ట్రాఫిక్​ ఆపేశారు. దీంతో వేలాది వాహనాలు నిలిచిపోయాయి. టెకిర్యాల్ ​బైపాస్​వద్ద హైవే కోతకు గురవడంతో ఒకవైపు నుంచే వాహనాలను పంపించారు. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి మార్గంలో ఉన్న స్టేట్​హైవే రోడ్డు నాలుగు చోట్ల కొట్టుకుపోయింది. మెదక్, ఎల్లారెడ్డి మధ్య నిర్మాణంలో ఉన్న హైవేపై నాగిరెడ్డిపేట మండల కేంద్రం, పోచారం శివార్లలో రోడ్లు కొట్టుకుపోయాయి. బీబీపేట సమీపంలో బ్రిడ్జి రోడ్డు ఒకవైపు కోతకు గురైంది. 
    
భిక్కనూరు- తలమడ్ల రైల్వేస్టేషన్ల మధ్య వరద ఉధృతికి రైల్వే ట్రాక్ ​దెబ్బతింది. రామేశ్వర్​పల్లి సమీపంలో బ్రిడ్జి నుంచి వెళ్లే నీటి ప్రవాహంతో ట్రాక్​ కింద మట్టి కొట్టుకుపోయింది. దీంతో పట్టాలు వేలాడుతూ కనిపించాయి. 
    
కామారెడ్డిలోని అశోక్​నగర్​ కాలనీ రైల్వే గేట్​సమీపంలో ట్రాక్​పై నుంచి వరద ప్రవహించింది. ట్రాక్​ దెబ్బతినడంతో బుధ, గురువారాల్లో సికింద్రాబాద్​, నిజామాబాద్ ​రూట్​లో కామారెడ్డి మీదుగా వెళ్లే రైళ్ల రాకపోలకు నిలిపివేశారు.