
హైదరాబాద్, వెలుగు: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ పరిధిలో పనిచేస్తున్న పలు కేటగిరీలకు చెందిన 1,392 పోస్టులను ఒక సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సోమవారం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ, ఈ పోస్టులలో 11 కాంట్రాక్టు, 197 పార్ట్‌టైం, 1,184 అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులున్నారని తెలిపారు. 2025 ఏప్రిల్ 01 నుంచి 2026 మార్చి 31 వరకు ఈ ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ జీవో ఆర్టీ నెంబర్ 1450 ను ప్రభుత్వం జారీ చేసినట్లు మంత్రి ప్రకటించారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని హాస్టళ్లు, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు, ప్రత్యేక న్యాయస్థానాలు, జిల్లా కార్యాలయాల్లో సేవలు మరింత బలోపేతం అవుతాయన్నారు. ఈ పోస్టులలో పనిచేసే ఉద్యోగులంతా ఎస్సీ అభివృద్ధి కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేస్తారని పేర్కొన్నారు. వేతన చెల్లింపులు ఐఎఫ్ఎంఐఎస్ డీబీఈ మోడ్‌లో పారదర్శకంగా జరుగుతాయని ప్రకటించారు. అవుట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాలు థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా చెల్లిస్తామని, కొత్త కాంట్రాక్టు పోస్టులలో నియామకాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరుగుతాయన్నారు.