పెండింగ్‌‌ ట్రాఫిక్‌‌ చలాన్లపై ఫోకస్‌‌ పెట్టాం : డీజీపీ శివధర్రెడ్డి

పెండింగ్‌‌ ట్రాఫిక్‌‌ చలాన్లపై ఫోకస్‌‌ పెట్టాం : డీజీపీ శివధర్రెడ్డి
  • ఈ నెల 28న లోక్‌‌ అదాలత్‌‌ కు ఏర్పాట్లు చేస్తున్నం: డీజీపీ శివధర్​రెడ్డి
  •     హైకోర్టు జడ్జి శ్యామ్ కోషితో వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు: పెండింగ్‌‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల(2020కి ముందు ఉన్నవి)పై ఫోకస్​పెట్టామని డీజీపీ శివధర్​రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.శ్యామ్ కోషితో వీడియో కాన్ఫరెన్స్‌‌లో మాట్లాడారు. ఈ నెల 14న జరగాల్సిన లోక్‌‌ అదాలత్ 28వ తేదీకి రీషెడ్యూల్ అయినందున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ నెల 19 నుంచి 27 వరకు ప్రతీరోజు డైలీ సిట్యుయేషన్ రిపోర్ట్ ద్వారా స్టేట్ క్రైం రికార్డ్స్ బ్యూరో, సీఐడీ విభాగాలు కేసుల పురోగతిని పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నారు. రాజీ పడదగ్గ కేసులు, జారీ చేసిన నోటీసులు, ప్రీ -లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైన కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు.

కక్షిదారులకు అవగాహన కల్పిస్తున్నం

రాజీ పడదగ్గ కేసులను ముందుగానే గుర్తించి కక్షిదారులకు అవగాహన కల్పిస్తున్నామని డీజీపీ శివధర్​రెడ్డి తెలిపారు. గతేడాది మార్చి 8న జరిగిన జాతీయ లోక్‌‌ అదాలత్‌‌లో 1,83,182 కేసులు, జూన్14న 1.93 లక్షలు, నవంబర్ 15, డిసెంబర్ 21న జరిగిన లోక్‌‌ అదాలత్‌‌లో 1,79,964 కేసులు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌‌లో సీఎస్‌‌బీ డైరెక్టర్ శిఖా గోయల్, శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, అడిషనల్ డీజీపీ, సీఐడీ చారుసిన్హా, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.