ఆటో కార్మికులకు గుడ్‌న్యూస్.. ఛార్జీల పెంపు, సంక్షేమ బోర్డుపై కీలక నిర్ణయాలు

ఆటో కార్మికులకు గుడ్‌న్యూస్.. ఛార్జీల పెంపు, సంక్షేమ బోర్డుపై కీలక నిర్ణయాలు

హైదరాబాద్: రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి తెలిపారు. సచివాలయంలో ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రులు కీలక సమావేశం నిర్వహించారు.ఆటో డ్రైవర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకురాగా.. వాటిపై మంత్రులు, ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. గత ఆగస్టు 23న జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను కూడా సమీక్షించారు.

ఈవీ ఆటోలపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

టీజీఎస్‌ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టి ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ పాలసీ తీసుకురానున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అలాంటి విధానంపై ఎలాంటి చర్చ జరగడం లేదని తెలిపారు.

ఆటో కార్మికుల సంక్షేమ బోర్డుపై చర్యలు

ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుపై కార్మిక శాఖతో కలిసి ప్రాధాన్యతా ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ అంశాన్ని కేబినెట్‌లో చర్చించి, అనంతరం శాసనసభలో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఆటో ఛార్జీల పెంపునకు ప్రభుత్వం సానుకూలం

2012 తర్వాత ఆటో ఛార్జీలు పెంచలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ఛార్జీల పెంపుపై రవాణా శాఖ అధికారులు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఎంత మేర ఛార్జీలు పెంచాలనే అంశంపై కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని, ఆ నివేదిక ఆధారంగా త్వరలో ఛార్జీల పెంపును అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు.

ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో ప్రభుత్వ యాప్

ఆటో డ్రైవర్లకు ప్రయోజనం చేకూరేలా ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ రూపొందించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రికి ఇప్పటికే లేఖ రాసినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు.ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించి అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.జీఓ ఎంఎస్ నంబర్ 263 కింద తిరస్కరించబడిన కేసులు, గడువు ముగిసిన పర్మిట్లకు సంబంధించిన ఆటో రిక్షా పర్మిట్ కోటాను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

అగ్రిగేటర్ పాలసీపై కమిటీ

అగ్రిగేటర్ల ద్వారా వైట్ ప్లేట్ వాహనాల వినియోగంపై ఆటో సంఘాలు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన అగ్రిగేటర్ పాలసీలో ద్విచక్ర వాహనాలను ఉపయోగించుకునే అవకాశం ఉందని, దీనివల్ల నిరుద్యోగ సమస్యను కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.రాష్ట్రంలో అగ్రిగేటర్ పాలసీపై రవాణా శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయించి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.

ఇతర జిల్లాల ఆటోలపై నిబంధనలు కఠినంగా అమలు

ఇతర జిల్లాలకు చెందిన ఆటోలు హైదరాబాద్ నగరంలో తిరగకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆటో సంఘాలు కోరాయి. దీనిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ హామీ ఇచ్చింది.నిబంధనల అమలులో నగర ఆటో కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి సూచించారు.

సారథి పోర్టల్‌లో లైసెన్స్ సమస్యకు పరిష్కారం

సారథి పోర్టల్‌లో ఆటో రిక్షా డ్రైవింగ్ లైసెన్స్ కేటగిరీకి సంబంధించి స్పష్టత లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుతం ఎల్‌ఎంవీ (లైట్ మోటార్ వెహికల్) లైసెన్స్ ఉన్నవారు ఆటో నడిపే విషయంలో ఉన్న నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లు మంత్రి తెలిపారు.

18,766 ఆటోలకు రూ.1.50 లక్షల చొప్పున సాయం

హైదరాబాద్ నగరంలో డీజిల్, పెట్రోల్ ఆటోల స్థానంలో పర్యావరణహిత వాహనాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పొన్నం ప్రభాకర్ తెలిపారు.ఇందులో భాగంగా ఆటోలను రెట్రోఫిట్మెంట్ చేసుకునేందుకు హైదరాబాద్ నగరంలోని సుమారు 18,766 ఆటోలకు ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.ఈ కార్యక్రమం కోసం వివిధ శాఖల సమన్వయంతో సుమారు రూ.200 కోట్ల నిధులు ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

ఆటో డ్రైవర్లకు ప్రత్యేక బీమా పాలసీ

ఆటో డ్రైవర్ల ప్రమాద, సహజ మరణ బీమా అంశంపై కార్మిక శాఖతో చర్చించి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆటో డ్రైవర్లతో పాటు ఇతర వర్గాలకు కూడా భరోసా కల్పించేలా ప్రత్యేక బీమా పాలసీ తీసుకురావడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని చెప్పారు.ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించేలా ‘ఇందిరమ్మ పాలసీ’ తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు.

ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఆటో డ్రైవర్ల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వివిధ శాఖల సమన్వయంతో ఆటో కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.